
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో టాప్–8 స్థానాలతో ప్లే ఆఫ్స్ లక్ష్యంగా గుజరాత్ జెయింట్స్ శ్రమించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 40–32 స్కోరుతో మూడు సార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. ఆరో నిమిషంలో సబ్‌స్టిట్యూట్ అయిన రెయిడర్ హిమాన్షు సింగ్ (11) వచి్చరాగానే పాయింట్ల పనిపట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 11 సార్లు పాయింట్లతో వచ్చాడు. అతనితో పాటు ఆల్‌రౌండర్లు మొహమ్మద్ రెజా (8), నితిని పన్వార్ (5), రెయిడింగ్ రాకేశ్ (4) రాణించడంతో గుజరాత్ క్రమం తప్పకుండా స్కోరు చేసింది.
పట్నా జట్టులో రెయిడర్ మన్‌దీప్ కుమార్ (12) ఒంటరి పోరాటం చేశాడు. 16 సార్లు రెయిడ్‌కు వెళ్లిన మన్‌దీప్ 12 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. రెయిడర్ అయాన్ (5), డిఫెండర్లు నవ్‌దీప్, అంకిత్ చెరో 4 పాయింట్లు చేసి రాణించారు. రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 32–31తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. యోధాస్ తరఫున రెయిడర్లు గుమన్ సింగ్ (8), గగన్ గౌడ (6), డిఫెండర్ హితేశ్ (7) అదరగొట్టారు.
తలైవాస్ జట్టులో కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ (7), డిఫెండర్లు సాగర్ రాఠి (5), రోనక్ (4) రాణించారు. నేటి నుంచి ఈ నెల 23 తేదీ వరకు రోజూ మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్‌పాంథర్స్‌తో పుణేరి పల్టన్, గుజరాత్ జెయంట్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి.