
ఇండియా కూటమి అభ్యర్థి ఎంపికపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య
సి.పి.రాధాకృష్ణన్‌ను ఎన్డీయే నేతలంతా కలిసే ఎంపిక చేసినట్లు వెల్లడి
ఎన్డీయే అభ్యర్థికి కాకుండా మరొకరికి మద్దతెలా ఇస్తామని ప్రశ్న
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయేలో ఉన్న తాము ప్రతిపక్ష పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఎలా మద్దతిస్తామని, ఓడిపోతామని తెలిసి కూడా ఇండియా కూటమి వాళ్లు తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తాము సపోర్ట్ చేస్తామని ఆశించడం కూడా కరెక్ట్ కాదంటూ ఇండియా కూటమిని విమర్శించారు. ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర సదన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే భాగస్వామిగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయనకు తెలిపారు. అనంతరం అక్కడున్న మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.
ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది..
‘సి.పి.రాధాకృష్ణన్‌ను ఎన్డీయే అభ్యర్థిగా మేమంతా కలిసే నిర్ణయించాం. ఆయన దేశంలో గరి్వంచదగ్గ నేత. దేశానికి, ఆ కుర్చీకి వన్నె తెస్తారు’.. అని చెప్పారు. టీడీపీ మద్దతు ఇస్తుందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. ‘గెలిచే అవకాశం లేకపోయినా తెలుగువాడు అంటూ అభ్యర్థిని పెట్టిన ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. రాష్ట్రంలో మేం, కేంద్రంలో ఎన్డీయే ఉన్నప్పుడు మేం వాళ్లకే కదా మద్దతు తెలిపేది’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మరో రూ.5 వేల కోట్లు ఇవ్వండి..
మరోవైపు.. చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా రూ.5 వేల కోట్లు అవసరమని ఆమెకు తెలిపారు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (సాస్కి–స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) కింద ఆ నిధులను అందించాలంటూ వినతిపత్రాన్ని అందచేశారు.
అలాగే, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం.. రూ.250 కోట్ల విడుదలకు ఉత్తర్వులివ్వాలని కూడా కోరారు. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియాతోనూ ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.