
కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెడతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి
సర్కార్ హామీ నేపథ్యంలో నివేదికపై స్టే లేదా రద్దు ఆదేశాలు అవసరం లేదన్న హైకోర్టు
నివేదిక కాపీని అధికారిక వెబ్‌సైట్‌లో పెడితే తీసేయండి
కమిషన్ 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వకపోవడం సరికాదు
అన్ని అంశాలపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం
రిపోర్టును మీడియాకు వెల్లడించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు
పిటిషనర్లకు ‘ముందస్తు చర్యలు’ భావన అవసరం లేదని స్పష్టికరణ
తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో కమిషన్ నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని మంత్రిమండలి నిర్ణయించినప్పుడు.. అంతకుముందే మీడియాకు వివరాలు వెల్లడించడాన్ని తప్పుబట్టింది.
పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లు ఒకవేళ నివేదికను అధికారిక వెబ్‌సైట్ లో పెడితే వెంటనే తీసివేయాలని ఆదేశించింది. కమిషన్ 8బీ, 8సీ కింద నోటీసులు జారీ చేయకుండా పిటిషనర్లను నిందితులుగా చూపడం సరికాదని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తదుపరి వారంలోగా సమాధాన కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.
తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మీడియా భేటీ వెనుక దురుద్దేశం ఉందన్న పిటిషనర్లు
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై 2024, మార్చి 14న విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 6 జారీ చేసింది. పిటిషనర్లు సహా పలువుర్ని కమిషన్ విచారించింది. ఈ ఏడాది జూలై 31న సర్కార్‌కు నివేదిక సమర్పించింది. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం తమ నోటీసులు జారీ చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. నివేదికలోని అంశాలు తమ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఈ నెల 4న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడంతో తమ పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు.
నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం మీడియాకు వివరాలు వెల్లడించిందని తెలిపారు. ఈ మేరకు సెక్షన్ 8బీ, 8సీకి సంబంధించి కిరణ్ బేడీ వరెŠస్‌స్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ, స్టేట్ ఆఫ్ బిహార్ వర్సెస్ ఎల్‌కె అద్వానీ తీర్పు కాపీలను కూడా అందజేశారు. నివేదిక కాపీని తమకు అందించకుండా పదే పదే వివరాలు వెల్లడించడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని.. దీని వెనుక దురుద్దేశం ఉందని.. సహజ న్యాయ సూత్రాలను సర్కార్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. జీవో 6ను రద్దు చేయాలని, కమిషన్ నివేదిక పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేదిగా ఉందని ప్రకటించాలని కోరారు..’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అసెంబ్లీలో చర్చకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్న ఏజీ
‘కమిషన్ సమర్పించిన నివేదికను అధ్యయనం చేయడానికి, పరిశీలనాంశాలను మంత్రిమండలికి సమర్పించడానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని ఏజీ తెలిపారు. తమ నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు మంత్రిమండలి పరిశీలనకు సమర్పించిందని చెప్పారు.
కాగా కమిషన్ నివేదికను ఆమోదించాలని, చర్చ కోసం అసెంబ్లీ ముందుంచాలని ఈ నెల 4న కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. అయితే అసెంబ్లీలో చర్చకు ముందే ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని గురువారం ఏజీని అడిగాం. అసెంబ్లీలో చర్చ తర్వాతే నివేదికపై తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచి్చన లిఖిత పూర్వక వివరణను ఏజీ శుక్రవారం కోర్టుకు సమర్పించారు. రిపోర్టును అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందని తెలిపారు’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో వివరించింది.
స్టే, రద్దు ఉత్తర్వులివ్వని ధర్మాసనం
‘నివేదికలోని అంశాలను మీడియాకు వెల్లడించడం ద్వారా ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా నివేదిక ఉంచినట్లు పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ముందు, నివేదికను మంత్రిమండలి ఆమోదించి, చర్చ కోసం అసెంబ్లీ ముందు ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. నివేదికను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లయితే, దానిని తొలగించాలి. 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి పిటిషనర్ల ప్రతిష్టను కించపరిచేలా కమిషన్ నివేదికలోని ఆంశాలు ఉంటే అంటే అది సరికాదు.
లాగే, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని సర్కార్ చెబుతున్నందున పిటిషనర్లకు ‘ముందస్తు చర్యలు’ అనే భావన అవసరం లేదు. నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం లేదు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చట్టం వీలు కల్పిస్తుంది. అక్కడ దానిని చర్చించాలి. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. మూడు వారాలు సమయం ఇస్తున్నాం..’ అని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.