టెన్త్‌ క్లాస్‌ కిల్లర్‌! | Kukatpally Girl Murder Case Busted: Telangana | Sakshi
Sakshi News home page

టెన్త్‌ క్లాస్‌ కిల్లర్‌!

Aug 23 2025 3:32 AM | Updated on Aug 23 2025 7:26 AM

Kukatpally Girl Murder Case Busted: Telangana

కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. వెలుగులోకి సంచలన విషయాలు

పక్క భవనంలో చోరీ కోసం స్కెచ్చేసిన టెన్త్‌ కుర్రాడు 

చోరీ అనంతరం గ్యాస్‌ లీక్‌ చేసి ఆ ఇంటికి నిప్పంటించాలని కుట్ర 

దొంగతనం చేస్తుండగా బాలిక చూడటంతో పట్టుబడిపోతానన్న భయంతో హత్య 

వెంట తెచ్చుకున్న కత్తితో సుమారు 20 సార్లు పొడిచి ఇంట్లోకి పరార్‌ 

బాలిక తండ్రిపైనే అనుమానం వచ్చేలా పోలీసులను తప్పుదోవ పట్టించిన వైనం 

ఓ స్థానికుడి సమాచారంతో చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నపోలీసులు.. నిందితుడి ఇంట్లో సోదాల్లో కత్తి, రక్తపు మరకల దుస్తులు లభ్యం

సాక్షి, హైదరాబాద్‌/మూసాపేట: ఆ బాలుడికి క్రికెట్‌ బ్యాట్‌పై మక్కువ... ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు కొనివ్వలేదు... పక్క భవనంలోని స్నేహితుడి ఇంటి నుంచి ఆ బ్యాట్‌ చోరీకి స్కెచ్‌ వేశాడు. ఒకవేళ బ్యాట్‌ కనిపించకపోతే అందినకాడికి డబ్బు దోచుకొని ఆ సొమ్ముతో బ్యాట్‌ కొనుక్కుందామనుకున్నాడు. చోరీ అనంతరం ఇంటిని గ్యాస్‌ లీక్‌తో తగలబెట్టాలని వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్‌పై రాసుకొని మరీ కుట్రపన్నాడు.

అయితే చోరీ చేస్తుండగా ఆ ఇంటి యజమాని కుమార్తె చూడటంతో తప్పించుకోవడం కోసం ఆమెను దారుణంగా హతమార్చాడు. కూకట్‌పల్లి దయార్‌గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను చంపిన పదో తరగతి బాలుడి వ్యవహారమిది. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్ప లు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు.

పుట్టిన రోజున వచ్చి కేక్‌ తినిపించి...
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి దాదాపు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ వలసవచ్చి కూకట్‌పల్లి దయార్‌గూడలోని ఓ భవనం నాలుగో అంతస్తులో నివసిస్తున్నారు. భర్త గతంలో చిరుద్యోగం చేసి మానేయగా భార్య కొన్నాళ్ల క్రితం వరకు కిరాణా దుకాణం నిర్వహించి ప్రస్తుతం ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివే వారి కుమారుడు (15) సక్రమంగా బడికి వెళ్లకుండా టీవీ, ఓటీటీల్లో వచ్చే క్రైమ్, హారర్‌ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు, సీరియల్స్‌ ఎక్కువగా చూసేవాడు.

కొన్నాళ్లుగా ధ్రువ్‌ రాఠీ అనే యూట్యూబర్‌కు చెందిన చానల్‌ వీక్షిస్తున్నాడు. తమ ఇంటికి ఆనుకొని ఉన్న మూడంతస్తుల భవనంపై ఉన్న పెంట్‌ హౌస్‌లో సహస్ర అనే బాలిక తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి సింగిల్‌ బెడ్రూం ఇంట్లో నివసిస్తోంది. పక్కపక్క భవనాల్లో ఉండటంతోపాటు ఆమె సోదరుడు కూడా బాలుడు చదివే పాఠశాలలోనే చదువుతుండటంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఉంది. మార్చిలో జరిగిన సహస్ర పుట్టిన రోజు వేడుకకు సైతం హాజరైన బాలుడు.. ఆమెకు కేక్‌ కూడా తినిపించాడు.

క్రికెట్‌ కిట్‌ కొనివ్వని కారణంగా...
సహస్ర సోదరుడితోపాటు కాలనీలో ఉండే పిల్లలతో కలిసి బాలుడు తరచూ క్రికెట్‌ ఆడేవాడు. కొన్నాళ్ల క్రితమే సహస్ర సోదరుడు ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీకి చెందిన ఓ క్రికెట్‌ బ్యాట్‌ కొనుక్కోవడంతో తనకు కూడా క్రికెట్‌ బ్యాట్‌ కొనివ్వాలని తల్లిదండ్రుల్ని పలుమార్లు అడిగాడు. వారు కొనకపోవడంతో సహస్ర ఇంట్లో చోరీకి స్కెచ్చేశాడు. తరచూ సహస్ర ఇంటికి వెళ్లి వస్తుండటం వల్ల ఆ ఇంట్లో ఏవి ఎక్కడు న్నాయో తెలిసిన బాలుడు.. ఆ ఇంట్లో ఎవ్వరూ లేనివేళ బ్యాట్‌ కాజేసి.. ఆపై సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు గ్యాస్‌ లీక్‌ ద్వారా ఇంటికి నిప్పంటించాలని కుట్ర పన్నా డు. ఇందుకోసం వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్‌పై రాసుకొని చివర్లో ‘మిషన్‌ డన్‌’ అని రాశాడు. 

పాఠశాలకు సెలవులు కావడంతో...
చోరీ కోసం పథకం వేసిన బాలుడు ఈ నెల 18న సహస్ర, ఆమె సోదరుడు స్కూళ్లకు వెళ్లిపోతారని.. తండ్రి మెకానిక్‌ షాపుకి, తల్లి విధులకు వెళ్తుందని భావించాడు. అయితే సహస్ర చదువుతున్న బోయిన్‌పల్లి కేంద్రీయ విద్యాలయాలో స్పోర్ట్స్‌ మీట్‌ ఉండటంతో నాలుగు రోజులు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. దీంతో ఆమె మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలియని బాలుడు.. తమ భవనం నాలుగో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వచ్చి సైడ్‌ వాల్‌ మీదుగా సహస్ర కుటుంబం ఉంటున్న భవనం మూడో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడి పెంట్‌హౌస్‌కు చేరుకున్నాడు.

తలుపు తీసి ఉండటంతో నేరుగా లోపలకు వెళ్లి చోరీకి ప్రయత్నించాడు. అదే సమయంలో లోపల గదిలోంచి హాల్లోకి వచ్చిన సహస్ర బాలుడిని చూసింది. ఆమె అరిస్తే పట్టుపడతాననే భయంతో బాలుడు ఆమె నోరు నొక్కి తన వద్ద ఉన్న కత్తితో నేరుగా ఆమె గొంతులో పొడిచాడు. దీంతో సహస్ర అరవలేక అక్కడే కూలిపోయింది. అయినప్ప టికీ చావలేదని భావించిన నిందితుడు.. ఆమెను విచక్షణారహితంగా దాదాపు 20 పోట్లు పొడిచి వచ్చిన మార్గంలోనే తన ఇంటికి పారిపోయాడు. బయట ఆరేసిన దుస్తులు తన మీద వేసుకొని రక్తం మరకలు తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోకి వెళ్లాడు.

కత్తి, లేఖను దాచి... రక్తం మరకలు దుస్తుల్ని వాషింగ్‌ మెషీన్‌లో పడేసి ఆన్‌ చేశాడు. ఆపై ఏమీ ఎరగ నట్లు తండ్రితో కలిసి పెంపుడు కుందేలును పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో లంచ్‌ బాక్స్‌ కోసం ఇంటికి వచ్చిన సహస్ర తండ్రి.. కుమార్తె రక్తపుమడుగులో మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులనూ తప్పుదోవ పట్టించి..
ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు జటిలంగా మారింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల అందరితోపాటు ఈ బాలుడినీ విచారించారు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేలా అతను.. సహస్ర ఇంటి నుంచి డాడీ, డాడీ అంటూ అరుపులు వినిపించాయని చెప్పి బాలిక తండ్రినే అనుమానితుడిగా చేశాడు. దీంతో ఆమె తండ్రిని విచారించిన పోలీసులు.. క్షుద్రపూజల అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేశారు.

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇచి్చన సమాచారంతో... 
స్థానికంగా నివసించే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఈ బాలుడి వ్యవహార శైలిపై అనుమానం వచి్చంది. దీంతో ఆయన ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం ఆ బాలుడు చదివే పాఠశాలకు వెళ్లిన పోలీసులు సహస్ర హత్య విషయమై ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు చేశారు.

దీంతో కత్తి, రక్తం మరకలతో ఉన్న దుస్తులు, లేఖ లభించాయి. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆంగ్లంలో 11 లైన్లలో రాసి ఉన్న ఆ లేఖలో ‘ఫస్ట్‌ గో హోం... అండ్‌ టేక్‌ గ్యాస్‌ అండ్‌ ఎ టేబుల్‌ అండ్‌ నెక్ట్స్‌ కీప్‌ ఎట్‌ ద డోర్‌ అండ్‌ ఫైర్‌ ద గ్యాస్‌’అంటూ లేఖలో రాసి ఉంది. దీన్ని పరిశీలించిన పోలీసులు చోరీ తర్వాత ఆధారాలు దొరక్కుండా ఇంటిని గ్యాస్‌ లీక్‌ చేసి కాల్చాలని కుట్రపన్నినట్లు భావిస్తున్నారు. ఈ ఉదంతంపై శనివారం అధికార ప్రకటన చేయనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement