వీసాలపై ట్రంప్‌ స్పెషల్‌ ఫోకస్‌.. 5.5 కోట్ల మంది టార్గెట్‌ | Donald Trump Administration Special Focus On USA VISAs, Reviewing All Foreigners For Violations | Sakshi
Sakshi News home page

వీసాలపై ట్రంప్‌ స్పెషల్‌ ఫోకస్‌.. 5.5 కోట్ల మంది టార్గెట్‌, వారికి నిలుపుదల

Aug 22 2025 7:46 AM | Updated on Aug 22 2025 10:00 AM

Donald Trump Administration Special Focus On USA VISAs

వాషింగ్టన్‌: అమెరికాలో వీసాల విషయంలో ట్రంప్‌ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికా ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను మరింత క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది. డ్రైవర్లకు వర్కర్‌ వీసాలు మంజూరు చేయడం లేదని మార్కో రూబియో బాంబు పేల్చారు. దీంతో, మరిన్ని వీసాలపై కోత విధించే అవకాశం ఉంది.

అయితే, అమెరికాలో ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు ట్రంప్‌ యంత్రాంగం తెలిపింది. ఈ సందర్బంగా అమెరికాలో నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చినా, వీసా కాల పరిమితిని మించి అమెరికాలో నివసిస్తున్నా, ప్రజాభద్రతకు భంగం కలిగించినా అలాంటి వ్యక్తులను స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక, అమెరికా చట్టాల ఉల్లంఘనలను సైతం సమీక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దుచేయడం ఖాయమని గతంలోనే స్పష్టం చేసిన ట్రంప్‌ ప్రభుత్వం అన్నంతపనీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ, పలురకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్‌ వీసాలను రద్దుచేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

డ్రైవర్లకు వర్కర్‌కు నో వీసా.. 
మరోవైపు.. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్‌ వీసాలు మంజూరు చేయమని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, అమెరికన్లకు ఉద్యోగాలు సైతం లేవన్నారు. అయితే, ఆగస్టు 12న ఫ్లోరిడా టర్న్‌పైక్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రూబియో హెచ్చరించడం గమనార్హం. కాగా, సదరు ట్రక్కు డ్రైవర్‌.. భారత్‌ నుంచి వలస వెళ్లడం, అతడు చట్ట విరుద్దంగా అ‍మెరికాలో నివాసం ఉంటున్నట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ల వీసాలపై కూడా ట్రంప్‌ యంత్రాంగం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇక, అమెరికాలో 2023 నాటికి 16 శాతం ట్రక్కు డైవర్లు ఇతర దేశస్థులే ఉన్నట్టు తెలుస్తోంది. 

నాలుగు వేల వీసాలు రద్దు.. 
అమెరికా చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ ఆరువేల మందిలో దాదాపు నాలుగు వేల మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ‘ఇమిగ్రేషన్, నేషనల్‌ యాక్ట్‌లోని మూడో సెక్షన్‌ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన వారి వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల, యూదు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది. ఉగ్రసంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్‌మెంట్‌ షెడ్యూలింగ్‌ను అర్థంతరంగా ట్రంప్‌ ప్రభుత్వం నిలిపివేయడం తెలిసిందే. జూన్‌లో మళ్లీ వీసాల అపాయింట్‌మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్‌ మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా ‘పబ్లిక్‌’ మోడ్‌లోనే ఉంచాలని సూచనలు చేసింది. మరోవైపు.. అమెరికాలో రెండోసారి డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. వారందరినీ అమెరికా నుంచి స్వదేశాలకు పంపించేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement