
ఆగష్టు 23 టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
మహోన్నత స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో తెలుగు బిడ్డ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (1872–1957) ఒకరు. పదవుల కోసం ఆయన ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. ఆయన దేనిని నమ్మారో దానినే త్రికరణ శుద్ధిగా ఆచరించారు. లక్షలాది రూపాయలు సంపాదించి, అంతా ప్రజల కోసమే ఖర్చు చేశారు. తన కోసం ఆయన పైసా కూడా మిగుల్చుకోలేదు. నాటి లోక్‌సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఆయన ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ కొనియాడిన విధానాన్ని చూస్తే ప్రకాశం వ్యక్తిత్వం అర్థమవుతుంది– ‘మనం 1928లో సైమన్ కమిషన్‌ను బాయికాట్ చేసిన సమయంలో చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళి పోయారు. ప్రకాశంగారు మాత్రం మిలిటరీ పోలీ సులు అడ్డుకోబోయి నప్పుడు చొక్కా విప్పి కాల్చమని తన ఛాతీని చూపించిన సాహసి అయ్యారు. ఆయన తన సర్వస్వం దేశ స్వాతంత్య్ర సమరంలో త్యాగంచేసిన మహావ్యక్తి, మరణించే నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగుల్చుకోలేదు’.
ప్రకాశం మరణించినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆయన విశిష్టతను ఇలా ప్రశంసించారు: ‘స్వాతంత్య్ర జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశభక్తుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు ప్రకాశంగారు. ముందువెనుకలు చూడని ధైర్యం, దాతృత్వం వలన ఆయన ఒక పురాణ పురుషులయ్యారు. ఆయన ఉత్తేజం వల్లనే వందలాది అనుయాయులు దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ జనకుడే కాదు, ఆయన భారత జాతీయోద్యమ నాయక శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు’.
ఇదీ చదవండి: అప్పుడే... ఏఐకి సార్థకత
నాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ... ‘నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1920 సంవత్సరం నుండి 1935 వరకు పంతులు గారితో నాకు పరిచయం, సాహచర్యం ఉన్నాయి. ఒకప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభ వించకపోయినా ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసా భావంతోనే చూసేవాడిన’ని అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
– డా‘‘ పి. మోహన్ రావు
చైర్మన్, ప్రకాశం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్
చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్