నేడు, రేపు భారీ వర్షాలు | Heavy rains today and tomorrow | Sakshi
Sakshi News home page

నేడు, రేపు భారీ వర్షాలు

Nov 29 2025 4:31 AM | Updated on Nov 29 2025 7:41 AM

Heavy rains today and tomorrow

రేపు తీవ్ర వాయుగుండంగా మారనున్న ‘దిత్వా’

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై అధిక ప్రభావం 

విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడి

సాక్షి, అమరావతి/వాకాడు: ‘దిత్వా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను ఉత్తర–వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ శుక్రవారం రాత్రి సమయానికి పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. 

ఆదివారం తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. 

ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101లను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement