మధ్యాహ్న భోజనం వికటించి 11 మంది విద్యార్థులకు అస్వస్థత | 11 students fall ill after eating spoiled midday meal | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం వికటించి 11 మంది విద్యార్థులకు అస్వస్థత

Nov 29 2025 4:34 AM | Updated on Nov 29 2025 4:34 AM

11 students fall ill after eating spoiled midday meal

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ హైస్కూల్‌లో ఫుడ్‌ పాయిజనింగ్‌ 

వంట ఏజెన్సీ నిర్వాహకురాలు టీడీపీ కౌన్సిలర్‌  

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట మున్సిపల్‌ ఉన్నత పాఠశాల­లో ఫుడ్‌ పొయిజన్‌తో 11 మంది విద్యార్థులు అస్వ­స్థతకు గురయ్యారు. దాదాపు 350 మంది విద్యా­ర్థులు రోజూ తరహాలోనే శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేశారు. మొదటగా పప్పు తిన్న 11 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

భోజనాలను నిలిపేసి విద్యార్థులను ఇంటికి పంపేశారు.  వాంతులు, కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న 11మం­దిని ప్రధానోపాధ్యాయుడు స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఏడుగురు బాలికలు,  నలుగురు బాలురు ఉన్నారు.  హైసూ్కల్‌లో మధ్యాహ్న భోజన ఏజెన్సీని 29వ వార్డు  టీడీపీ కౌన్సిలర్‌ మోతుకూరు జయలక్ష్మి నిర్వహిస్తున్నారు.   

పప్పులో కలిసిందేమిటి? 
పప్పు ఎలుకల మందు వాసన వచ్చిందని కొందరు విద్యార్థులు అధికారులకు తెలియజేశారు. మరికొందరు నాఫ్తలిన్‌  గోళీల వాసన వచ్చిందన్నారు. దీనిపై విచారణ జరగాల్సిఉంది. మరోవైపు సంఘటనకు కారణమైన హైసూ్కల్‌ వంట ఏజెన్సీ నిర్వాహకులను తొలగిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి షంషుద్దీన్‌  తెలిపారు. కందిపప్పుతోపాటు నీటిని పరీక్షలు చేయిస్తామని, ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందని తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని విద్యాధికారి తెలిపారు. 

షంషుద్దీన్‌తోపాటు  మున్సిపల్‌ కమిషనర్‌ సి.రవిచంద్రారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నాగరాజు విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.  జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఫోన్‌లో అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement