
రూపొందించిన బెంగళూరు స్టార్టప్
బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్(ఎఫ్‌డబ్ల్యూడీఏ) సంస్థ మొట్టమొదటిసారిగా దేశీయంగా మీడియం అల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యురెన్స్(మేల్) రిమోట్ యుద్ధ విమానం ‘కాల భైరవ’ను సిద్ధం చేసింది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సుహాస్ తేజస్కంద దీనిని శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. కాల భైరవుని స్ఫూర్తితో ఈ విమానం డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి దేశీయంగానే పూర్తి చేశామని వివరించారు. కాల భైరవ విమానం 3 వేల కిలోమీటర్ల దూరం 30 గంటలపాటు ఏకబిగిన ప్రయాణించగలదన్నారు.
దక్షిణాసియాలోని ఒక దేశం నుంచి ఇప్పటికే 25 లక్షల డాలర్ల విలువైన ఒక ఆర్డర్ వచ్చిందని వివరించారు. అమెరికా నుంచి మన ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక్కో రిమోట్ ప్రిడేటర్ విమానం ఖరీదు రూ.1,000 కోట్లు కాగా, అదే ఖర్చుతో 10 కాల భైరవలను దేశీయంగా సొంతం చేసుకోవచ్చని, ఇందులో ఒకటి దెబ్బతిన్నా లక్ష్య సాధనలో ఎటువంటి మార్పు ఉండదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న విధానాలు, అమెరికా ప్రభుత్వ ఆంక్షల నడుమ భారత ప్రభుత్వం యుద్ధ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడరాదని ఆయన తెలిపారు. వేరే దేశాల వంక చూడటం వల్ల మన వ్యూహాత్మక స్వాతంత్య్రం దెబ్బతింటుందని, రహస్య సమాచారం లీకయ్యే ప్రమాదముందని సుహాస్ పేర్కొన్నారు.