
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు
నక్సలైట్లకు మద్దతివ్వడానికి సుప్రీంకోర్టును వాడుకున్నారు
వామపక్షాల ఒత్తిడి వల్లే ఉప రాష్ట్రపతి అభ్యరి్థగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
కేంద్ర మంత్రి అమిత్ షా ఆగ్రహం
కొచ్చి/తిరునల్వేలి: నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని విపక్ష ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’ చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు.
శుక్రవారం కేరళలో ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. నక్సలైట్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వాడుకున్నారని ఆరోపించారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడుం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదని అన్నారు. నక్సలైట్ల సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. వామపక్షాల ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసుకుందని ధ్వజమెత్తారు.
కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగానే పదవికి రాజీనామా చేసి ఉంటే.. రాజ్యాంగ(130 సవరణ) బిల్లు–2025ను తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని అమిత్ షా అన్నారు. 30 రోజులపాటు జైల్లో ఉన్న వారిని పదవుల నుంచి తొలగించే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలను అన్ని రాజకీయ పారీ్టలూ పాటించాలని సూచించారు. ఏ ముఖ్యమంత్రి అయినా జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జైల్లో ఉంటూ కూడా పరిపాలన సాగిస్తారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించలేదని, అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని చేర్చలేదని స్పష్టంచేశారు. జైల్లో ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించడంలో తప్పేమీ లేదన్నారు.
సోనియా, స్టాలిన్ కలలు నెరవేరవు
రాజ్యాంగ(130 సవరణ) బిల్లును ‘నల్ల బిల్లు’ అనే హక్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేదని అమిత్ షా తేల్చిచెప్పారు. శుక్రవారం తమిళనాడులోని తిరునల్వేలిలో బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో ప్రసంగించారు. చీకటి పనులు చేసిన చరిత్ర స్టాలిన్‌కు ఉందన్నారు. డీఎంకే ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. స్టాలిన్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని విమర్శించారు.
కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం సోనియా గాంధీ ఎజెండా, కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం స్టాలిన్ ఎజెండా అని దుయ్యబట్టారు. వారి కలలు నెరవేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాంను అప్పట్లో రాష్ట్రపతిని చేసింది, నేడు అదే తమిళనాడు బిడ్డ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు.