గతంలో ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేదని ఆ రాష్ట్ర స్పీకర్ రమణ్ సింగ్ అన్నారు. గత కాంగ్రెస్ పాలకుల విధానాలు సరిగ్గా ఉంటే రాష్ట్రంలో నక్సలిజం ఎప్పుడో అంతమయ్యేదన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గతంలో జరిగిన ఓ సంఘటనను కాంక్లేవ్‌లో పంచుకున్నారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టు పార్టీ అంపశయ్యపై ఉంది. 2026 మార్చి 31 వరకూ దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడం. దాని కనుగుణంగా కేంద్ర బలగాలు నక్సల్స్‌పై దాడులు తీవ్రతరం చేయడం ఆ పార్టీలోని అగ్రనేతలంతా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. దీనికితోడు భారీ సంఖ్యలో నక్సల్స్ లొంగుబాట్లు జరుగుతుండడంతో మావోయిస్టు పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత స్పీకర్ రమణ్ సింగ్ ఛత్తీస్‌గఢ్ లో ఒకప్పుడు నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. తన లోక్‌సభ నియోజకవర్గంలోని చురియా పట్టణంలో పర్యటించిన ఘటనను పంచుకున్నారు.
"నేను చురియా పట్టణంలోకి ప్రవేశించగానే కొద్దిదూరంలోని పోలిస్ స్టేషన్ దగ్గర తుపాకుల శబ‍్ధం వినిపించింది. అది ఏంటి అని ఎమ్మెల్యేను అడిగితే నా రాక సందర్భంగా టపాసులు పేలుస్తున్నారని తెలిపారు. అంతలోనే కొంతమంది ప్రజలు వచ్చి నన్ను అక్కడి నుండి తీసుకెళ్లారు. తర్వాత దాదాపు గంట సేపు వరకూ కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత నేను ఆ పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లాను ఎస్సై ఇద్దరు కానిస్టేబుల్స్ నిరంతరాయంగా కాల్పులు జరుపుతూ పోలీస్ స్టేషన్‌ను కాపాడారు. ఆ ఘటనలో ఒక నక్సల్ మృతి చెందాడు". అని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒకప్పుడు పరిస్థితులు అలానే ఉండేవన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా సరైన విధానాలు తీసుకొని ఉండి ఉంటే రాష్ట్రంలో నక్సలిజం ఎప్పుడో అంతం అయి ఉండేదని రమణ్ సింగ్ తెలిపారు.


