breaking news
Vice President position
-
ఉప రాష్ట్రపతి పదవి రాజకీయ సంస్థ కాదు
గౌహతి: ఉప రాష్ట్రపతి పదవి అనేది దేశంలో అత్యున్నత రాజ్యాంగ విభాగమే తప్ప రాజకీయపరమైన సంస్థ కాదని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. త్వరలో జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విపక్ష ‘ఇండియా’కూటమి అభ్యర్థిగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం అస్సాం రాజధాని గౌహతిలో మీడియాతో మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చొనే వ్యక్తికి ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన లక్షణాలు ఉండాలని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మాటల్లో, చేతల్లో, ప్రవర్తనలో నిజాయతీ, పారదర్శకత ఉండాలని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవికి సంబంధించి ఇవి తన అభిప్రాయాలని స్పష్టంచేశారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పదవీ కాలం ముగియకముందే హఠాత్తుగా రాజీనామా చేయడంపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... వ్యక్తుల గురించి తాను మాట్లాడబోనని బదులిచ్చారు. ఓటు హక్కును నిరాకరించొద్దు భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అనుమానాలకు తావులేకుండా ఎన్నికల సంఘం పనిచేయాలన్నారు. ఓటు హక్కు వచ్చిన తర్వాతే దేశ పౌరులుగా మారినట్లు చాలామంది భావిస్తుంటారని గుర్తుచేశారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని పేర్కొన్నారు. ఓటు వేసే హక్కును నిరాకరించడానికి వీల్లేదన్నారు. ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు సహజమేనని, రాజ్యాంగంలోనే ఆ అంశం పొందుపర్చారని గుర్తుచేశారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మధ్య ఎన్నో అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించే విషయంలో వారు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పౌరులంతా కచ్చితంగా పాల్గొనాలని వారు సూచించారని చెప్పారు. ఎన్నికల నుంచి ఓ వర్గాన్ని లేదా కులాన్ని పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాను భావించడం లేదన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందని, దానిపై మాట్లాడడం సరైంది కాదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయా పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేసే సంప్రదాయం లేదన్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చని చెప్పారు. పలు రాజకీయపార్టీలతోపాటు స్వతంత్య్ర ఎంపీలు సైతం తన అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారని వివరించారు. అస్సాం రాష్ట్రం ఒకప్పుడు తన కర్మభూమి అని చెప్పారు. -
సీపీ రాధాకృష్ణన్ (ఉప రాష్ట్రపతి అభ్యర్థి) రాయని డైరీ
మనవి కాని రోజులు కొన్ని ఉంటాయి. కచ్చితంగా అవి మన రోజులే అనుకుని, అవి తెచ్చిన ఆకూ వక్కల పళ్లేన్ని అందుకోవటానికి చేతులు చాస్తామా, హఠాత్తుగా అవి పక్కకు మళ్లిపోతాయి!మోదీజీ నన్ను ఉప రాష్ట్రపతిగా అనుకోగానే మొదట నాకు... ఇలా దగ్గరి వరకు వచ్చి, అలా దూరంగా మళ్లిపోయిన రోజులే గుర్తొచ్చాయి.అయితే నాకు ఒకటే నమ్మకం. మనవి కాని రోజులను కూడా మనవి అయ్యేలా చెయ్యగల శక్తిమంతులు మోదీజీ. లెక్కలైనా ఆఖరి నిమిషంలో అటూ ఇటూ అవొచ్చు. మోదీజీ లెక్క ఎటూ అవ్వదు.రెండు సభల మొత్తం ఓట్లు 782. ఉప రాష్ట్రపతిగా నేను గెలవటానికి కావలసిన ఓట్లు 394. ఎన్డీయేకు ఉన్నవి 422. ఇక నేను ఉప రాష్ట్రపతిని కాకుండా ఎలా ఉంటాను? ఉంటాను! ప్రతిపక్షాలకు ఉన్న 330 ఓట్లు, ఏ పక్షానికీ చెందని 30 ఓట్లు, ఎన్డీయే నుండి ఒకవేళ చీలిపోయే 35 ఓట్లు కలిస్తే నేను ఉప రాష్ట్రపతిని కాకుండా ఉంటాను.కానీ... గోడ మీది ఈ కూడికలు, తీసివేతలు మోదీజీ అనే సింహం ముందు వట్టి పిల్లి మొగ్గల వంటివి. ఆయన ఒకరి పేరు చెప్పారంటేæఆ ఒకరు రాష్ట్రపతి భవన్ ఫోర్‌కోర్టులో ప్రమాణ స్వీకారం చేసినట్లే!సెప్టెంబరు 9న ఉప రాష్టపతి ఎన్నిక! సెప్టెంబరు 9 అనగానే నాకు 25 ఏళ్లనాటి సెప్టెంబర్ 29 మనసులోకి వచ్చింది! ఆ రోజు... ప్రధాని వాజ్‌పేయి, వరుసగా ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. నా వంతు వచ్చింది. నా పేరు కూడా వచ్చింది.‘‘రాధాకృష్ణన్ అనే ఆ గడ్డం మనిషి ఎక్కడ? ఆయన్ని పిలిపించండి’’ అని వాజ్‌పేయి, తన పక్కనే ఉన్న అద్వానీతో అన్నారు. అయితే వాళ్లు పిలిపించింది సీపీ రాధాకృష్ణన్ అనే నన్ను కాదు. పి. రాధాకృష్ణన్ అనే వేరొకర్ని! నేను కోయంబత్తూరు ఎంపీని. ఆయన నాగర్‌కోయిల్ ఎంపీ. పొరపాటున నాకు బదులుగా ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు! ఎప్పుడూ గడ్డం ఉండే నాకు అప్పుడు గడ్డం లేక పోయుండాలి. లేదంటే, ఎప్పుడూ గడ్డం ఉండని పి.రాధాకృష్ణన్‌కు అప్పుడు గడ్డం ఉండి ఉండాలి. ‘‘ఎవరైతే ఏంటీ, ఇద్దరూ జెమ్సే కదా’’ అన్నారట వాజ్‌పేయి! బీజేపీ ఎప్పుడూ అలానే ఆలోచిస్తుంది. జెమ్ ఏదైనా జెమ్మే అయినప్పుడు కోయంబత్తూరు జెమ్ కోసమే ఎందుకు చూడటం అంటుంది. ఇంకోసారి 2014లో మోదీజీ ప్రధానిగా వచ్చినప్పుడు నా చేతికి రావలసిన ఆకూ వక్కల పళ్లెం చేజారి, మళ్లీ పి. రాధాకృష్ణన్ వైపే వెళ్లిపోయింది!సీఎం జయలలిత ప్రిస్టేజ్‌గా తీసుకుని కోయంబత్తూరులో నాకు పోటీగా వాళ్ల క్యాండిడేట్‌ను గెలిపించుకోవటంతో, కన్యాకుమారిలో గెలిచిన పి.రాధాకృష్ణన్‌ను నా ప్లేస్‌లో (నేను గెలిచి ఉంటే) కేబినెట్లోకి తీసుకున్నారు మోదీజీ.చేయలేకపోయిన సహాయాలను గుర్తు పెట్టుకుని, చేసిన సహాయాలను మర్చిపోయే మహనీయుడు మోదీజీ!నాకు మంత్రి పదవి ఇవ్వలేక పోయినందుకు ఆయన నన్ను పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌ని చేశారు. తెలంగాణ గవర్నర్‌ని చేశారు. జార్ఖండ్ గవర్నర్‌ని చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌ని చేశారు. ఇపుడు భారత ఉప రాష్ట్రపతిని చేస్తున్నారు! ఒకటి ఇవ్వలేక పోయినందుకు వంద ఇస్తారు మోదీజీ! మనవి కాని రోజులు ఉన్నట్లే, మోదీజీ తలచుకుంటే మనవి తప్ప వేరేవారివి కాని రోజులు కూడా ఉంటాయి. బహుశా అలాంటి రోజులలో ఒకటిగా 2027 జూలై 25 నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నా నమ్మకం. ద్రౌపదీ ముర్ము తర్వాత వచ్చే వారు భారతదేశ 16వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు అది! -
ఆయన నక్సలైట్ల మద్దతుదారుడు
కొచ్చి/తిరునల్వేలి: నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని విపక్ష ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’ చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం కేరళలో ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. నక్సలైట్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వాడుకున్నారని ఆరోపించారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడుం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదని అన్నారు. నక్సలైట్ల సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. వామపక్షాల ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసుకుందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే... ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగానే పదవికి రాజీనామా చేసి ఉంటే.. రాజ్యాంగ(130 సవరణ) బిల్లు–2025ను తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని అమిత్ షా అన్నారు. 30 రోజులపాటు జైల్లో ఉన్న వారిని పదవుల నుంచి తొలగించే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను అన్ని రాజకీయ పారీ్టలూ పాటించాలని సూచించారు. ఏ ముఖ్యమంత్రి అయినా జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జైల్లో ఉంటూ కూడా పరిపాలన సాగిస్తారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించలేదని, అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని చేర్చలేదని స్పష్టంచేశారు. జైల్లో ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించడంలో తప్పేమీ లేదన్నారు. సోనియా, స్టాలిన్ కలలు నెరవేరవు రాజ్యాంగ(130 సవరణ) బిల్లును ‘నల్ల బిల్లు’ అనే హక్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేదని అమిత్ షా తేల్చిచెప్పారు. శుక్రవారం తమిళనాడులోని తిరునల్వేలిలో బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో ప్రసంగించారు. చీకటి పనులు చేసిన చరిత్ర స్టాలిన్‌కు ఉందన్నారు. డీఎంకే ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. స్టాలిన్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం సోనియా గాంధీ ఎజెండా, కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం స్టాలిన్ ఎజెండా అని దుయ్యబట్టారు. వారి కలలు నెరవేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాంను అప్పట్లో రాష్ట్రపతిని చేసింది, నేడు అదే తమిళనాడు బిడ్డ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. -
US Presidential Election 2024: ట్రంపే అమెరికా ఆశాకిరణం
మిల్వాకీ: అమెరికా శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం చివరి శ్వాస దాకా పాటుపడతానని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ (39) అన్నారు. వారిని అధికార డెమొక్రటిక్ పార్టీ పూర్తిగా విస్మరించిందంటూ మండిపడ్డారు. మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ల నేషనల్ కన్వెన్షన్‌లో వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యరి్థగా బుధవారం లాంఛనంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదాసీదా, నిరుపేద మూలాలున్న తాను ఇంత దూరం వస్తానని కల్లో కూడా ఊహించలేదని చెప్పారు. ‘‘జీవితంలో ఒక్క మెట్టూ ఎదుగుతూ వచ్చా. ఒకరకంగా సగటు అమెరికన్ కలగనే జీవితాన్ని ప్రస్తుతం జీవిస్తున్నా. వారంతా భద్రమైన, సురక్షితమైన జీవితం గడిపేలా చేస్తా. ఏ పారీ్టవారన్న దానితో నిమిత్తం లేకుండా ప్రతి అమెరికన్‌కూ నా సర్వస్వం ధారపోస్తా. అమెరికా ఎన్నడూ మరిచిపోలేని ఉపాధ్యక్షుడిగా పేరు తెచ్చుకుంటా’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్‌పై ప్రశంసల వర్షం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా మధ్యతరగతికి, శ్రామిక వర్గానికి ప్రస్తుతం ఆయనే ఏకైక ఆశాకిరణమన్నారు. ‘‘ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందే ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. ఎవరైనా జీవితంలో కలలుగనేవన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. అయినా అమెరికన్లకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తపించారు. అందుకోసం తిట్లను, వేధింపులను, మరెన్నింటినో సహిస్తున్నారు. నిజానికి ట్రంప్‌కు ఆయనకు రాజకీయాలు అవసరం లేదు. అమెరికా ప్రజలకే ఇప్పుడు ట్రంప్ అత్యవసరం’’ అని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయాలను కేవలం కెరీర్‌గా మలచుకున్న స్వార్థపరుడంటూ వాన్స్ దుయ్యబట్టారు. బైడెన్ మతిలేని వాణిజ్య ఒప్పందాలు, విదేశీ యుద్ధాలకు అర్థం లేని మద్దతు తన స్వస్థలం ఒహాయో వంటి నిరుపేద అమెరికా ప్రాంతాలను సర్వనాశనం చేశాయంటూ మండిపడ్డారు. పాలక వర్గ ప్రతినిధిగా బైడెన్ ప్రతి చర్యా అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలపరం చేసింది. మన యువతను యుద్ధక్షేత్రాలకు బలిచి్చంది. ఇరాక్ నుంచి అఫ్గానిస్తాన్ దాకా, ఆర్థిక సంక్షోభం నుంచి మాంద్యం, అక్రమ వలసల దాకా ప్రస్తుత పాలక వర్గం అన్ని రంగాల్లోనూ పదేపదే విఫలమవుతూ వస్తోంది. ఈ సమస్యలన్నింటి నుంచి అమెరికాను గట్టెక్కించే చిట్టచివరి, అత్యుత్తమ ఆశాకిరణం ట్రంప్ మాత్రమే. సగటు అమెరికన్‌కు అగ్రతాంబూలమే ఆయన విజన్. ఆయనను పోగొట్టుకుంటే మనకిక భవిష్యత్తుండదు’’ అన్నారు. ‘‘దేశానికి తొలి ప్రాధాన్యమిచ్చే ట్రంప్‌నే అమెరికన్లు గెలిపించుకోబోతున్నారు’’ అని వాన్స్ జోస్యం చెప్పారు.దక్షిణాసియా వలసదారులపై వాన్స్ ప్రశంసలు దక్షిణాసియా నుంచి వచ్చినవారు అమెరికాను సుసంపన్నం చేశా రని వాన్స్ అన్నారు. భార్య ఉషా చిలుకూరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘దక్షిణాసియా నుంచి వలస వచి్చనవారి కుమార్తెను నేను పెళ్లాడాను. ఆమెకు పెళ్లి ప్రస్తావన చేసినప్పుడు లా స్కూల్ చదువు కోసం, ప్లాట్ కొనుగోలుకు చేసిన 1.2 లక్షల డాలర్ల అప్పులు నా నెత్తిన ఉన్నాయని చెప్పా. అయినా పెళ్లికి అంగీకరించింది’’ అని చెప్పారు. తన వ్యక్తిగత, ఆధ్యాతి్మక జీవితంపై భార్య ప్రభావం ఉందన్నారు. తల్లి బెవర్లీని సభకు పరిచయం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.భారతీయ వంటలు నేర్చుకున్నారు: ఉషవాన్స్ గొప్ప ఉపాధ్యక్షునిగా తనను తాను నిరూపించుకుంటారని భార్య ఉషా చిలుకూరి (38) విశ్వాసం వెలిబుచ్చారు. వాన్స్ ప్రసంగానికి ముందు ఆయనను రిపబ్లికన్ కన్వెన్షన్‌కు ఆమె లాంఛనంగా పరిచయం చేశారు. ‘‘జేడీది నిరుపేద స్థానిక శ్వేతజాతి కుటుంబం. నాదేమో భారతీయ వలసదారుల కుటుంబం. అలాంటి మేం కలుసుకోగలిగామన్నా, ప్రేమలో పడి పెళ్లి చేసుకోగలిగామన్నా కేవలం అమెరికా గొప్పదనమే అందుకు కారణం’’ అన్నారు. ‘‘నా భారతీయ జీవన శైలి గురించి జేడీ ఆసక్తిగా అన్ని విషయాలూ తెలుసుకున్నాడు. పక్కా మాంసాహారి అయినా నా శాకాహార జీవనశైలికి అలవాటు పడ్డాడు. మా అమ్మనడిగి భారతీయ వంటకాలు చేయడం నేర్చుకున్నాడు’’ అన్నారు. -
Jayanti Chauhan: ఆసక్తి లేని పని ఆమెకు వద్దట
వారసులు వారసత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహపడతారు. యువరాజులు కిరీటం కోసం వెంపర్లాడతారు. ఆసక్తి లేని పని చేయనక్కర్లేదని సామ్రాజ్యాలను వదలుకుంటారా ఎవరైనా? 32 ఏళ్ల జయంతి చౌహాన్. 7000 కోట్ల బిస్లరీ వాటర్ సామ్రాజ్యానికి ఏకైక యువరాణి. ‘నాకు ఆసక్తి లేదు’ అని చైర్ పర్సన్ పదవిని నిరాకరించింది. దీని వల్ల సంస్థను టాటా పరం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తృప్తినిచ్చే పని చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. కాని తృప్తినిచ్చే పనిలోనే ఆనందం ఉందని ఆమె సందేశం ఇస్తోంది. ఈ కాలపు యువత ఈ మాట ఆలకించాల్సిందే. ఇదంతా ఒక జానపద కథలాగే ఉంది. పూర్వం ఎవరో ఒక రాజు తన రాజ్యం మొత్తాన్ని ఏకైక కుమార్తె చేతిలో పెడదామనుకుంటే ‘నాకు వద్దు నాన్నా. నాకు హాయిగా సెలయేళ్ల మధ్య గడుపుతూ, చిత్రలేఖనం చేసుకుంటూ, పూ లతల మధ్య ఆడుకోవాలని ఉంది’ అని ఆ కూతురు అంటే రాజు ఏమంటాడు? రాజ్యం ఏమవుతుంది? ‘జల సామ్రాజ్యం’ లేదా ‘ఆక్వా కింగ్డమ్’గా అందరూ పిల్చుకునే ‘బిస్లరీ’ సంస్థకు ఇప్పుడు ఆ పరిస్థితే ఎదురైంది. దాని అధినేత రమేష్ చౌహాన్ తన సంస్థను అనివార్యంగా టాటాకు అప్పజెప్పనున్నాడు. రేపో మాపో ఇది జరగనుంది. 7000 కోట్లకు సంస్థ చేతులు మారుతుంది. పూర్తి మార్పుకు మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ సంస్థ భారాన్ని 82 ఏళ్ల రమేష్ చౌహాన్ మోయక తప్పదు. కారణం ఏమిటి? ‘నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కుమార్తె జయంతికి సంస్థ పగ్గాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు. సంస్థ అమ్మేయదల్చుకోవడం బాధాకరమే. కాని టాటా సంస్థకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అదైతే నా సంస్థను బాగా చూసుకుంటుందని భావిస్తున్నాను. వారి వైపే నా మనసు మొగ్గుతున్నది’ అని రమేష్ చౌహాన్ అన్నాడు. పార్లే బ్రదర్స్‌లో ఒకరైన రమేష్ చౌహాన్ 1993లో తన సొంత సాఫ్ట్డ్రింక్లైన థమ్సప్, సిట్రా, మాజా, గోల్డ్స్పాట్లను కోకాకోలాకు విక్రయించాడు. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన బిస్లరీని అమ్మేయబోతున్నాడు. కారణం కూతురు జయంతికి ఉన్న కళాత్మక ఆసక్తులే. మనకు ఏది ఇష్టం? జయంతి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏది మనసుకు బాగా నచ్చుతుందో ఆ పని చేయాలి. అందరికీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. కాని కుదిరే అవకాశం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది జీవితం గడిచిపోయాక ‘నేను ఇది కాదు చేయాలనుకున్నది. నాకు అవకాశం కూడా వచ్చింది. కాని వేరే దారిలో వెళ్లిపోయాను. చాలా అసంతృప్తిగా ఉంది’ అనడం వింటూ ఉంటాము. ఆ రియలైజేషన్ వచ్చేలోపు జీవితం గడిచిపోయి ఉంటుంది. అదే సమయంలో మన అభిరుచులు, ఆసక్తులు అన్ని వేళలా ఆర్థిక సమీకరణాలకు లొంగేలా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నప్పుడు సొంత మార్గం ఎంచుకోవడంలో తప్పు ఏముంది? ఐ.టి. ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేసేవారు, ఐ.పి.ఎస్. ఉద్యోగాన్ని వదిలి సంఘసేవ చేసేవారు ఉన్నారు. ఒక స్పష్టతతోనే జయంతి బిస్లరీని వద్దనుకుని ఉంటుంది. ఆ స్పష్టత ఉంటే ఎవరైనా తమకు ఇష్టమైన రంగంలో పని చేస్తూ ఆనందకరమైన జీవితం గడపవచ్చు. డబ్బు వల్ల మాత్రమే ఆనందం లభించదని జయంతి చెబుతోంది కదా. ఎవరు జయంతి? జయంతి చౌహాన్ (37) రమేష్ చౌహాన్‌కు ఒక్కగానొక్క కూతురు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత మొదట న్యూయార్క్‌లో, ఆ తర్వాత లండన్‌లో, ఆ పైన ఇటలీలో చదువుకుంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చదువుకుంది. దాంతోపాటు లండన్‌లో ‘స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ (లండన్ యూనివర్సిటీ) నుంచి అరబిక్ భాష నేర్చుకుంది. అరబిక్ భాష నేర్చుకోవడం ఒక భిన్న అభిరుచి అని చెప్పవచ్చు. ఆమెకు ఇదొక్కటే కాదు... ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రయాణాలు ఇష్టపడుతుంది. జంతు ప్రేమ ఉంది. అంత పెద్ద వ్యాపార సంస్థకు వారసురాలైనా చక్కగా ఒక ఆటో ఎక్కి రోడ్డు పక్కన బంతిపూలు కొనుక్కుంటూ కనిపిస్తుంది. ఆమెకు రంగులు అంటే ఇష్టం. మంచి బట్టలు ఇష్టం. భావు కత్వంతో జీవించడం ఇష్టం. అలా అని ఆమెకు వ్యాపార దక్షత లేదనుకుంటే పొరపాటు. చదువు పూర్తయిన వెంటనే 24 ఏళ్ల వయసులో సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పని చేయడం మొదలుపెట్టింది. మొదట ఢిల్లీ కార్యాలయంలో చేసి ఆ తర్వాత ముంబై ఆఫీస్‌కు హెడ్ అయ్యింది. జయంతి చేరాక హెచ్.ఆర్, మార్కెటింగ్, సేల్స్‌లో సమూలమైన మార్పులు తెచ్చింది. పోటీదారుల చొరబాటును ఎదుర్కొనడానికి ‘బ్లూ’ కలర్ నుంచి బిస్లరీ రంగును ‘ఆకుపచ్చ’కు మార్చింది. సంస్థలో ఆధునిక యాంత్రికీకరణలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇంత సాధించిన కుమార్తె సంస్థ పగ్గాలు చేపడుతుందని తండ్రి ఆశించడం సహజం. కాని జయంతి తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. బహుశా ఆమె మనసు ఇందులో లేదు. ఆమెకు తృప్తినిచ్చే పని ఇది కాకపోవచ్చు. అందుకే ఆమె ఇంత సామ్రాజ్య కిరీటాన్ని వద్దనుకుంది. -
రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్‌పెన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ పెన్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సదస్సునుద్దేశించి పెన్స్ మాట్లాడుతూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జియో బైడెన్ చైనా తొత్తు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్ చైనాకి చీర్ లీడర్ అయిన ఆయన లెఫ్ట్ పార్టీతో రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారని ఆరోపించారు. శ్వేత సౌధంలో మరో నాలుగేళ్ల పాటు ట్రంప్ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బైడెన్ అధికారంలోకి వస్తే చైనా కంపెనీలపై విధించిన సుంకాలన్నీ రద్దు చేయాలని చూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో చైనా నుంచి ప్రయాణాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం పద్ధతి’’అంటూ పెన్స్ విరుచుకుపడ్డారు. బైడన్ నాయకత్వంలో అమెరికన్లు సురక్షితం కాదన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఆకస్మికంగా హాజరై పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్య పరిచారు. మరోవైపు భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తన తల్లి శ్యామల గోపాలన్ 19 ఏళ్ల వయసులోనే భారత్ నుంచి అమెరికాకు వచ్చారని చిన్నతనం నుంచి సమానత్వ సాధన గురించి తనకు పాఠాలు బోధించారని చెప్పారు. మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమలా హ్యారిస్ చిన్న వీడియో రూపంలో తన సందేశాన్ని ఇచ్చారు. తన తాతతో కలిసి చెన్నై వీధుల్లో ఉదయం వేళల్లో నడుచుకుంటూ తన తల్లి మహిళా సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కుల గురించి తెలుసుకున్నారని, ఆమే తనకు స్ఫూర్తి అని చెప్పారు. -
హెచ్‌సీఏ ఎన్నికల బరిలో శ్రీధర్
- ఉపాధ్యక్ష పదవికి పోటీ - ముగిసిన నామినేషన్ల ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్)గా వ్యవహరిస్తున్న ఎం.వి.శ్రీధర్ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయన ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. శనివారంతో హెచ్‌సీఏ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. మొత్తం 22 పదవులకుగాను 68 నామినేషన్లు దాఖలయ్యాయి. మాజీ మంత్రి జి. వినోద్, అర్షద్ అయూబ్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేయగా, వెంకటేశ్వరన్, జాన్ మనోజ్ కార్యదర్శి పదవికి పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి వ్యవహరిస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఆయన సోమవారం ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువుంది. వచ్చే నెల 7న ఎన్నికలు జరుగుతాయి.