
అది అత్యున్నత రాజ్యాంగ విభాగం
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది
విపక్ష ‘ఇండియా’అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి వెల్లడి
గౌహతి: ఉప రాష్ట్రపతి పదవి అనేది దేశంలో అత్యున్నత రాజ్యాంగ విభాగమే తప్ప రాజకీయపరమైన సంస్థ కాదని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. త్వరలో జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విపక్ష ‘ఇండియా’కూటమి అభ్యర్థిగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం అస్సాం రాజధాని గౌహతిలో మీడియాతో మాట్లాడారు.
ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చొనే వ్యక్తికి ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన లక్షణాలు ఉండాలని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మాటల్లో, చేతల్లో, ప్రవర్తనలో నిజాయతీ, పారదర్శకత ఉండాలని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవికి సంబంధించి ఇవి తన అభిప్రాయాలని స్పష్టంచేశారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పదవీ కాలం ముగియకముందే హఠాత్తుగా రాజీనామా చేయడంపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... వ్యక్తుల గురించి తాను మాట్లాడబోనని బదులిచ్చారు.
ఓటు హక్కును నిరాకరించొద్దు
భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అనుమానాలకు తావులేకుండా ఎన్నికల సంఘం పనిచేయాలన్నారు. ఓటు హక్కు వచ్చిన తర్వాతే దేశ పౌరులుగా మారినట్లు చాలామంది భావిస్తుంటారని గుర్తుచేశారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని పేర్కొన్నారు.
ఓటు వేసే హక్కును నిరాకరించడానికి వీల్లేదన్నారు. ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు సహజమేనని, రాజ్యాంగంలోనే ఆ అంశం పొందుపర్చారని గుర్తుచేశారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మధ్య ఎన్నో అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించే విషయంలో వారు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పౌరులంతా కచ్చితంగా పాల్గొనాలని వారు సూచించారని చెప్పారు. ఎన్నికల నుంచి ఓ వర్గాన్ని లేదా కులాన్ని పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాను భావించడం లేదన్నారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందని, దానిపై మాట్లాడడం సరైంది కాదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయా పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేసే సంప్రదాయం లేదన్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చని చెప్పారు. పలు రాజకీయపార్టీలతోపాటు స్వతంత్య్ర ఎంపీలు సైతం తన అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారని వివరించారు. అస్సాం రాష్ట్రం ఒకప్పుడు తన కర్మభూమి అని చెప్పారు.