122 సీట్లు..1,302 మంది అభ్యర్థులు
ఓటేయనున్న 3.7 కోట్ల మంది
భారీగా భద్రతా ఏర్పాట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని డజను వరకు మంత్రులు సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 122 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 3.70 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. నేపాల్‌తో సరిహద్దులు కలిగిన పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, మధుబని, సుపౌల్, అరారియా, కిషన్‌గంజ్ జిల్లాల్లో జరిగే ఈ క్రతువు కోసం యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేపట్టింది.
ఇందులో అత్యధిక జిల్లాలు ముస్లింల ప్రాబల్యమున్న సీమాంచల్ ప్రాంతంలోనివి కావడం గమనార్హం. సంక్లిష్ట కుల, వర్గ సమీకరణాలతో తుది విడత పోలింగ్ అధికార ఎన్డీయేతోపాటు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారులు 45, 399 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనివే 40,073 ఉన్నాయి. 3.67 లక్షల ఓటర్లతో అతిపెద్ద నియోజకవర్గం నవాడా జిల్లాలోని హిసువా కాగా, లౌరియా, చన్‌పటియా, రక్జౌల్, త్రివేణిగంజ్, సుగౌలి, బన్‌మఖిల్లో అత్యధికంగా 22 మంది చొప్పున బరిలో ఉన్నారు. మొదటి దశ పోలింగ్‌లో అత్యధికంగా 65 శాతం మంది ఓటేయడం విశేషం.
అత్యంత సమస్యాత్మకం.. 8,491
రెండో దశ పోలింగ్‌ను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 4 లక్షల మంది భద్రతా సిబ్బందిని బందోబస్తు కోసం రంగంలోకి దించారు. 45, 399 పోలింగ్ స్టేషన్లలో 8,491 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటి వద్ద అదనంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే 50 వేల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించిన అధికారులు, ఎన్నికల రోజున మరో 50 వేల మందిని రప్పిస్తున్నారు. ఇప్పటికే 60వేల మంది బిహార్ పోలీసులు ఎన్నికల విదుల్లో ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గయాజీలో అత్యధికంగా అత్యంత సమస్యా త్మకమైన 1,084 పోలింగ్ స్టేషన్లు ఉన్నా యని వివరించారు. కిషన్‌గంజ్, పుర్నియా, సీతామర్హి, మోతిహరీల్లో అత్యంత సమస్యా త్మకమైన పోలింగ్ బూత్ ఒక్కటీ లేదన్నారు. అదేవిధంగా, 122 నియోజ కవర్గాల పరిధిలోని 13,651 శివారు గ్రామా లను సమస్యాత్మకంగా గుర్తించినట్లు వివరించారు.


