‘ఉన్నావ్’ బాధితురాలి ధర్నా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడాన్ని బాధితురాలు వ్యతిరేకించారు. కోర్టు తీర్పును నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని, పటిష్ట భద్రత కలి్పంచాలని బాధితురాలు ప్రభుత్వాన్ని కోరారు. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగించారని, ఇప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆదుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి విన్నవించారు.
అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష తగ్గించడం ఏమిటని నిరసనకారులు ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని అన్నారు. సుప్రీంకోర్టుపై తమకు విశ్వాసం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తమ బంధువులపై దాడి చేశారని, తప్పుడు కేసులు పెట్టారని, జైలుపాలు చేశారని తెలిపారు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, బాధితురాలి ధర్నాకు అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించాయి.


