సాక్షి, న్యూఢిల్లీ: వస్తువు కొని మోసపోయామనో, నాణ్యమైన సేవలు అందలేదనో వినియోగదారులు ఇకపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్’ (ఎన్‌సీహెచ్) వినియోగదారుల పక్షాన నిలుస్తూ మంచి ఫలితాలను సాధిస్తోంది. గత ఎనిమిది నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా బాధితులకు ఏకంగా రూ.45 కోట్ల రీఫండ్‌ను ఇప్పించి రికార్డు సృష్టించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 25– డిసెంబర్ 26 మధ్య కాలంలో 31 వేర్వేరు రంగాలకు సంబంధించి వచ్చిన 67,265 ఫిర్యాదులను ఎన్‌సీహెచ్ పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఖర్చు లేకుండా ’ప్రీ–లిటిగేషన్’ (కేసు వేయక ముందే) దశలోనే సమస్యలను పరిష్కరిస్తుండటం వల్ల వినియోగదారుల కమిషన్లపై భారం తగ్గడంతో పాటు సామాన్యులకు త్వరితగతిన న్యాయం జరుగుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ మోసాలే దేశంలో అధికంగా నమోదవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తం రీఫండ్స్‌లో సింహభాగం ఈ–కామర్స్ రంగానిదే కావడం గమనార్హం. ఈ 8 నెలల్లో ఈ–కామర్స్ రంగానికి సంబంధించి 39,965 ఫిర్యాదులు పరిష్కారం కాగా, బాధితులకు రూ.32 కోట్లు తిరిగి వెనక్కి వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో ట్రావెల్ అండ్ టూరిజం రంగం ఉంది. ఈ రంగంలో 4,050 ఫిర్యాదులకు గాను రూ.3.5 కోట్లు రీఫండ్ అయ్యాయి. మొత్తం రీఫండ్స్‌లో 85 శాతానికి పైగా వాటా ఈ–కామర్స్, ట్రావెల్, ఏజెన్సీ సర్వీసులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఎయిర్‌లైన్స్ రంగాల నుంచే ఉండటం గమనార్హం. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు బాధితులు ఈ హెల్ప్‌లైన్‌ను ఆశ్రయిస్తూ తమ సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. హెల్ప్‌లైన్ కోసం 1915 టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు, వాట్సాప్ (8800001915), ఎన్‌సీహెచ్ యాప్, ఉమంగ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా 17 భాషల్లో ఫిర్యాదు చేసే సౌకర్యం ఉంది.


