నేటి రెండో దశ పోలింగ్‌లో చిన్న పార్టీలదే పైచేయి
సీమాంచల్‌లో పట్టుకోసం ఎంఐఎం తహతహ
జన్ సురాజ్ వైపు యువత మొగ్గు
చిరాగ్, సహానీ, మాంఝీల సత్తాకు పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో మంగళవారం జరు గనున్న రెండో దశ ఎన్నికల్లో చిన్న పార్టీలు పెద్ద పరీక్షను ఎదుర్కోనున్నాయి. ఎన్నికలు జరుగ నున్న 122 స్థానాలకు గాను చాలాచోట్ల వివిధ కూటముల్లోని చిన్న పార్టీలు సహా స్వతంత్రంగా పోటీ చేస్తున్న పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోనున్నాయి. చివరి దశ ఎన్నికల్లో చిన్న పార్టీలు ఏమాత్రం సత్తా చాటుతాయన్న దానిపైనే గెలుపోటములు ప్రభావితమై ఉన్నాయి.
అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ
రెండో దశలోని 122 నియోజకవర్గాలు 20 జిల్లాల్లో విస్తరించి ఉండగా, ఇందులో 101 జనరల్, 19 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. గత 2020 ఎన్నికల్లో 122 స్థానాల్లో బీజేపీ 42 గెలుచుకోగా, ఆర్‌జేడీ 28, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5, ఎంఐఎం 5 సీట్లను గెలుచుకున్నాయి. ఈ స్థానాల్లో ఎంఐఎం మినహా మిగతా చిన్న పార్టీలేవీ పెద్దగా గెలవలేదు. ఈసారి పరిస్థితి వేరేగా ఉంది. ఇండియా, మహాగఠ్‌బంధన్ కూటముల్లోని చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు.
ముఖ్యంగా ఎన్‌డీయేలో భాగస్వామ్య పక్షమైన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ మొత్తంగా 28 స్థానాల్లో పోటీ చేస్తుండగా, రెండో దశ పోలింగ్ జరిగేవి అందులో 15 ఉన్నాయి. వీటిలో ఆరు ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఇక్కడ బీజేపీకి బలంగా ఉన్న రాజ్‌పుత్‌లు, జేడీయూకు మద్దతుగా నిలుస్తున్న ఓబీసీ. ఈబీసీ వర్గాలతో పాశ్వాన్ వర్గాన్ని కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే బీసీ వర్గాల్లో వచ్చిన చీలిక పాశ్వాన్‌కు ఏమాత్రం మద్దతిస్తాయన్నది స్పష్టం కావాల్సి ఉంది.
ఇక జతిన్‌రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) సైతం 6 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 4 రిజర్వుడ్ స్థానాలే ఉన్నాయి. ఇందులోనూ టెకారీ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ తన భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఈ స్థానంలో గెలిస్తే అనిల్‌కుమార్ మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.
హెచ్‌ఏఎం పోటీచేస్తున్న అనేక స్థానాల్లో ఆయనకు పోటీగా మహాగఠ్‌బంధన్‌లోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. మాంఝీ వర్గాన్ని ఎదుర్కొనేందుకు ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా అన్ని రకాల ప్రణాళికలు వేశారు. ఆ పార్టీ పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో ఆయన భార్య స్నేహలతను సైతం పోటీలో ఉంచారు. ఇక మహాగఠ్‌బంధన్‌లో ఉన్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) సైతం మొత్తం 12 సీట్లలో పోటీ చేస్తుండగా, రెండో దశలో 7 స్థానాలున్నాయి.
ఇందులో 5 నియోజకవర్గాల్లో ‘మల్లా’కమ్యూనిటీకి చెందిన వారే అధికంగా ఉండటంతో ఇందులో కనీసంగా 5 స్థానాలు గెలుస్తామని కూటమి బలంగా నమ్ముతోంది. ఆర్‌జేడీ నమ్ముకున్న ముస్లిం–యాదవ్ ఫార్ములాకు మల్లాలు తోడైతే ఇక్కడ విజయం ఖాయమని భావిస్తోంది. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రెండో దశలో 100 చోట్ల పోటీలో నిలవగా, ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న 32 నియోజకవర్గాలనే ఆమె లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం చేశారు.
కనీసంగా 2 నుంచి 5 స్థానాలు గెలుస్తామని బీఎస్పీ చెబుతోంది. ఇక సీమాంచల్‌లోని 24 స్థానాలకు గానూ గత ఎన్నికల్లో 5 స్థానాల్లో పోటీ చేసి, అన్నింటా విజయం సాధించిన ఎంఐఎం ఈసారి 11 స్థానాల్లో పోటీకి దిగింది. ఇక్కడ అర డజను సీట్లు గెలుస్తామని పార్టీ ధీమాతో ఉంది. ప్రశాంత్‌కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ సైతం 110 చోట్ల పోటీలో ఉంది. ఆయన పార్టీ వైపు ఎక్కువగా యువత, మహిళలు ఆకర్షితులు కావడంతో చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది.


