breaking news
justice sudarshan reddy
-
క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ?
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నదానికంటే ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్‌కు అధిక మెజారిటీ సాధించడం వెనుక క్రాస్ ఓటింగ్ దాగిఉందన్న వాదన మరింత పెరిగింది. సొంత ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయకుండా రాధాకృష్ణన్ వైపు కొందరు విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల ఎంపీలు మొగ్గుచూపారని వార్తలు ఎక్కువయ్యాయి. ఇండియా కూటమి పక్షాల ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై అంతర్గత విచారణ చేయించాలని కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బిహార్ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ అంశం పార్టీల ఐక్యతకు ప్రశి్నస్తోంది. దీంతో ఐక్యత పెద్ద సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో కూటమిలోని లోటుపాట్లను గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా సవరించుకోవాలనే అభిప్రాయంతో విపక్షపార్టీలు ముందుకెళ్తున్నట్లు సమాచారం. మంగళవారం వెల్లడైన ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో సుమారు 20 ఓట్లు రాధాకృష్ణన్‌కు పడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 324 ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆయనకు కేవలం 300 ఓట్లు పడ్డాయి. రాధాకృష్ణన్ గరిష్టంగా 436 ఓట్లు సాధించవచ్చని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన 452 ఓట్లు సాధించారు. మరింత స్పష్టమైన మెజారిటీ ఒడిసిపట్టారు. పోలింగ్ పూర్తయిన వెంటనే తమ అనుకూల ఓట్లపై ఓ అంచనాకు వచి్చన కాంగ్రెస్ సైతం తమకు అనుకూలంగా 315 ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు ఇక్కడే క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతో పాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. భారీ క్రాస్ ఓటింగ్ దృష్ట్యా ఈ అంశంపై కచ్చితంగా విచారణ జరగాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. దీనిని తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనగానే పరిగణించాలని, ఇది విపక్షాల అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తివారీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు సైతం ఈ విషయంపై విచారణ కోరుకుంటున్నారని ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి రావాల్సిన 12 ఓట్లలో కనీసంగా 3 ఓట్లు, తమిళనాట డీఎంకే నుంచి రావాల్సిన 32 ఓట్లలో కనీసంగా 4 ఓట్లు, ఆర్జేడీ నుంచి రెండు ఓట్లు, శివసేన(ఉద్ధవ్) పార్టీ నుంచి కొన్ని ఓట్లు క్రాసింగ్ జరిగినట్లు అంచనాలు వేస్తున్నారు. మాకు సంబంధం లేదన్న పార్టీలుఅయితే క్రాస్ ఓటింగ్ వివాదంపై విపక్ష పార్టీల వాదన భిన్నంగా ఉంది. తమ సభ్యులెవరూ రాధాకృష్ణన్‌కు ఓటేయలేదని కాంగ్రెస్ మిత్రపక్షాలు కరాఖండీగా చెప్పాయి. దీనిపై ఇప్పటికే ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ పార్టీలు తమ ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ప్రకటనలు సైతం ఇచ్చాయి. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓట్లు నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థికే బలంగా పడ్డాయని చెబుతున్నాయి. అయితే బిహార్, తమిళనాడు, పశి్చమబెంగాల్ ఎన్నికల దృష్ట్యా కూటమిలో ఐక్యత కొనసాగి ఎన్నికల్లో పోరాడాలంటే క్రాస్ ఓటింగ్‌పై విచారణ జరపాలని కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. ఇదే సమయంలో విపక్షాల అభ్యర్థికి 40 శాతం ఓట్ల వాటాను ‘నైతిక విజయం‘గా కాంగ్రెస్ నాయకులు అభివరి్ణస్తున్నారు. 2022 ఎన్డీఏకు చెందిన జగదీప్ ధన్‌ఖడ్‌పై పోటి చేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు వచి్చన ఓట్లతో పోలిస్తే ఈసారి తమకుæ దాదాపు 14 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఇక వీటిని తిప్పికొడుతున్న బీజేపీ 15 మంది ప్రతిపక్ష ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని, మరో 15 మంది ఉద్దేశపూర్వకంగా చెల్లని ఓట్లు వేశారని కౌంటర్లు ఇస్తోంది. -
ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్‌లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4 రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !మాత్రమే ఉంది. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగ్గా, అటు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ‘తమిళనాడు మోదీ’గా పేరుసి.పి.రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. 16 ఏళ్లకే ఆరెస్సెస్‌లో చేరారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్‌తో ఆయనకు బలమైన అనుబంధముంది. అభిమానులు ఆయనను ‘తమిళనాడు మోదీ’ అని పిలుస్తుంటారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీలో బలమైన ఓబీసీ నేతగా ఎదిగిన ఆయనకు పార్టీ పలుమార్లు గవర్నర్‌గా అవకాశమిచ్చింది. జార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ ఇన్చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సేవలందించారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ 1974లో జనసంఘ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా, సభ్యుడిగా చేశారు. స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం వహించారు. 2004 నుంచి మూడేళ్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 93 రోజులపాటు 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర చేశారు.మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా: సుదర్శన్రెడ్డిమరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తానని ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమిని స్వీకరించాలన్నారు. ‘ ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్య బలం.. కేవలం విజయంలో మాత్రమే లేదు. చర్చలు, నిరసన ద్వారా కూడా ప్రజాస్వామ్యం బలపడుతుంది. విజయం సాధించిన రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు’ అని తెలిపారు.రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపిన అమిత్ షాఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నాయకుడని ఆయన కొనియాడారు. ఖర్గే శుభాకాంక్షలురాధాకృష్ణన్కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్రడ్డి పోరాటానికి సైతం కృతజ్ఞతలు తెలిపారు. ‘ ఇది ఎన్నిక మాత్రమే కాదు.. ఇది సిద్ధాంతాల యుద్ధం. పార్లమెంట్ సంప్రదాయాలను రాధాకృష్ణన్ కాపాడతారని ఆశిస్తున్నా. ప్రతిపక్షాలకు సరైన సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. -
నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగనుండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్‌ను నిర్వహించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఏకు సొంతంగా 422 మంది సభ్యుల బలం ఎలక్టోరల్ కాలేజీలోని బలాబలాల పరంగా చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 781 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇక 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉంది. విజయానికి అవసరమైన ఓట్లు 391 కాగా, ఎన్డీఏకు సొంతంగానే 422 మంది సభ్యుల బలం ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ 11 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించడంతో ఆ సంఖ్య 433కి చేరనుంది. ఇక విపక్ష ఇండియా కూటమికి రెండుసభల్లో కలిపి 311 ఓట్లు ఉండగా, ఈ కూటమికి ఆప్ మద్దతు ప్రకటించింది. దీంతో కూటమి బలం 320 మాత్రమే దాటుతోంది. అయితే రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఎంపీలు తమ పార్టీల విప్‌ను పాటించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీల మాక్ పోలింగ్.. పార్టీల బలాబలాలపై ఇరు పక్షాలకు స్పష్టత ఉన్నప్పటికీ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడంపై ఆందోళన, క్రాస్ ఓటింగ్ భయం రెండు కూటముల్లోనూ కనిపిస్తోంది. 2022 ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోవడంతో ఈసారి పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ తమ ఎంపీల కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ పాత పార్లమెంట్ భవనం సెంట్రల్హాల్లో మాక్ పోలింగ్ ద్వారా తమ ఎంపీలకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందు ఇచ్చారు. సంవిధాన్ సదన్‌లో జరిగిన సమావేశంలో ఖర్గేతో పాటు సోనియాగాం«దీ, శరద్‌పవార్, టీఆర్ బాలు, అఖిలేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సైతం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలతో మాక్ పోలింగ్ నిర్వహించింది. ఎన్డీఏ ఎంపీలతో మోదీ సమావేశం మంగళవారం ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం..‘రాధాకృష్ణన్ అద్భుతమైన ఉప రాష్ట్రపతి అవుతారని ప్రజలు విశ్వసిస్తున్నారు..’అంటూ ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ మచ్చలేని నేతగా అభివరి్ణస్తోంది. రాజకీయ, పాలనాపరమైన ఆయన విశేష అనుభవం..రాజ్యసభ చైర్మన్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉపకరిస్తుందని పేర్కొంటోంది. ఇక విపక్షాల అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి 2011లో సుప్రీంకోర్టులో పదవీ విరమణ పొందారు. నల్లధనం, సల్వాజుడుం తదితర కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు.బీఆర్ఎస్, బీజేడీ దూరంరెండు కూటములకు సమాన దూరాన్ని పాటిస్తూ వస్తున్న బీఆర్ఎస్, బీజేడీలు ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్కు నలుగురు, బీజేడీకి ఏడుగురు సభ్యుల బలం ఉంది. -
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వీడియో సందేశం
ఢిల్లీ : దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఎంపీలు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా తాను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కేవలం ఉపరాష్ట్రపతి కోసం జరిగే ఎన్నికగా చూడొద్దని, ఇది భారత ఆత్మ కోసం జరిగే ఎన్నికగా ఎంపీలు భావించాలన్నారు. అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీడియో సందేశం కోసం క్లిక్ చేయండి.. -
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం
-
ఉప రాష్ట్రపతి పదవి రాజకీయ సంస్థ కాదు
గౌహతి: ఉప రాష్ట్రపతి పదవి అనేది దేశంలో అత్యున్నత రాజ్యాంగ విభాగమే తప్ప రాజకీయపరమైన సంస్థ కాదని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. త్వరలో జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విపక్ష ‘ఇండియా’కూటమి అభ్యర్థిగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం అస్సాం రాజధాని గౌహతిలో మీడియాతో మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చొనే వ్యక్తికి ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన లక్షణాలు ఉండాలని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మాటల్లో, చేతల్లో, ప్రవర్తనలో నిజాయతీ, పారదర్శకత ఉండాలని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవికి సంబంధించి ఇవి తన అభిప్రాయాలని స్పష్టంచేశారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పదవీ కాలం ముగియకముందే హఠాత్తుగా రాజీనామా చేయడంపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... వ్యక్తుల గురించి తాను మాట్లాడబోనని బదులిచ్చారు. ఓటు హక్కును నిరాకరించొద్దు భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అనుమానాలకు తావులేకుండా ఎన్నికల సంఘం పనిచేయాలన్నారు. ఓటు హక్కు వచ్చిన తర్వాతే దేశ పౌరులుగా మారినట్లు చాలామంది భావిస్తుంటారని గుర్తుచేశారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని పేర్కొన్నారు. ఓటు వేసే హక్కును నిరాకరించడానికి వీల్లేదన్నారు. ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు సహజమేనని, రాజ్యాంగంలోనే ఆ అంశం పొందుపర్చారని గుర్తుచేశారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మధ్య ఎన్నో అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించే విషయంలో వారు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పౌరులంతా కచ్చితంగా పాల్గొనాలని వారు సూచించారని చెప్పారు. ఎన్నికల నుంచి ఓ వర్గాన్ని లేదా కులాన్ని పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాను భావించడం లేదన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందని, దానిపై మాట్లాడడం సరైంది కాదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయా పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేసే సంప్రదాయం లేదన్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చని చెప్పారు. పలు రాజకీయపార్టీలతోపాటు స్వతంత్య్ర ఎంపీలు సైతం తన అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారని వివరించారు. అస్సాం రాష్ట్రం ఒకప్పుడు తన కర్మభూమి అని చెప్పారు. -
ప్రజాస్వామ్య ప్రతిష్ట మసకబారుతోంది
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరి విధుల్లో మరొకరు జొరబడకుండా ఉంటే వ్యవస్థలన్నీ బాగానే ఉంటాయి. కానీ మన దగ్గర ఇప్పుడదే లోపిస్తోంది. ‘‘పార్లమెంటులో జరిగే చర్చల్లో మెజారిటీ, మైనారిటీ పార్టీలన్న భేదం చూపటం మొదలుపెడితే అదే రోజు ప్రజాస్వామ్యం అంతమైనట్టే..’’అన్న మన తొలి లోక్‌సభ స్పీకర్ గణేశ్ మౌలాంకర్ మాటలు గుర్తొస్తున్నాయి. పార్లమెంటులో ఎవరు మాట్లాడాలో, ఎవరు మా ట్లాడొద్దో శాసిస్తున్నారు. అంతా వారిష్టం అన్నట్టుగా కొనసాగుతోంది. చర్చ, సంభాషణకు వీల్లేకుండా పోయింది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది.ఆ మార్పునకు నేనేమన్నా దోహదపడతానేమోనన్న భావనతోనే ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించాను..’అని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలస్తంభాల ప్రతిష్ట మసకబారుతోందని, అవి తిరోగమనంలో ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆ యన పాల్గొన్నారు. తాను ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించటానికి దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పెడధోరణిని నియంత్రించాలి నేను ఏ రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తిని కాను. భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో చేరను. దేశంలో 63.7 శాతం జనాభాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండటమంటే మెజార్టీ ప్రజల అభ్యర్థిగా ఉండటమేనని భావిస్తూ అంగీకరించా. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు స్థానం లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 30 రోజుల్లోనే ఓటర్ల జాబితా రూపకల్పన కసరత్తు మొదలైంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అప్పట్లో జాబితా రూపొందించారు. వయోజనులను జాబితాలో ఎలా చేర్చాలనే ప్రధాన కర్తవ్యంతో ఆ కసరత్తు జరిగింది. కానీ ప్రస్తుతం జాబితా నుంచి పేర్లు ఎలా తొలగించాలి అన్నదే ముఖ్యంగా మారింది. ఆ పద్ధతిని ప్రశ్నించాల్సి ఉంది. ఇక్కడి వారు అండగా ఉంటారన్న నమ్మకం ఉంది.. నేను 53 సంవత్సరాలుగా రాజ్యాంగ పుస్తకాన్ని వెంట మో స్తున్నాను. అన్నింటికీ అందులో సమాధానం ఉంటుందని బలంగా నమ్ముతాను. నేను ఉప రాష్ట్రపతిగా విజయం సాధి స్తే, దాని ప్రకారమే నడుచుకుంటాను. ఎలక్టోరల్ కాలేజీలో పార్టీలకు సభ్యత్వం ఉండదు, వాటి ప్రతినిధులకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. వారు పార్టీలకతీతంగా ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారని భావిస్తున్నా. రాజకీయ పదవి కాదు.. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌కు మద్దతివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. శివసేన చీఫ్ ఉద్ధవ్ థ్రాక్రేను కోరినట్టు తెలిసింది. అయితే ఆ సమయంలోనే నేను ఉద్ధవ్‌ను కలిశాను. ఫడ్నవీస్ అభ్యర్థనకు మీరెలా స్పందిస్తారని ఆయనను విలేకరులు అడిగారు. దీంతో సుదర్శన్‌రెడ్డితో భేటీ ముగిశాక నేను ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వమని కోరతాను అని ఆయన అన్నారు.ఆయన తీరు నాకు ఆసక్తిగా అనిపించింది. ఇండియా కూటమిలో కాకుండా తటస్థంగా ఉన్న విపక్ష పార్టీలు నాకు మద్దతు తెలిపినందున నేను ఇండియా కూటమి అభ్యర్థిగా కాకుండా విపక్షాల అభ్యర్థిగా బరిలో ఉన్నాను. రాజకీయ ముళ్ల కిరీటం మీకెందుకు అని కొందరు నా అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఉప రాష్ట్రపతి పదవి రాజకీయ పదవి కాదు, అది ఏ పార్టీకి సంబంధం లేనిది. అందుకే దాన్ని నేను రాజకీయ ముళ్లకిరీటంగా భావించటం లేదని చెప్పా. నిర్భయంగా.. నిష్పాక్షికంగా పనిచేస్తాదేశంలోని ఎంపీలకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి లేఖ ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభకు చైర్మన్‌గా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను బాధ్యత వహిస్తానని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు. భయం, పక్షపాతం లేకుండా పనిచేస్తానని, గౌరవం, మర్యాద, సంభాషణ, సమన్వయం అనే విలువలతో ముందుకెళతానని వెల్లడించారు. దేశంలోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సోమవారం ఆయన లేఖ రాశారు ఈ లేఖను తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘రాజ్యాంగ పరిరక్షణే దేశానికి నిజమైన బలమని నా జీవితం నాకు తెలియజేసింది. ఈ ఎన్నిక ఇద్దరు వ్య క్తుల మధ్య పోటీ కాదు. సిద్ధాంతపరమైన పోరాటం. సెప్టెంబర్ 9వ తేదీన జరిగే ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వండి. ’ అని ఆ లేఖలో సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఏ సవాల్‌కైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఫలానా అని ముద్ర వేస్తూ కొంద రు మాట్లాడుతున్నారు. అలా అంటే ఈ రాజకీయాలు నాకెందుకులే అని వెనక్కు తగ్గుతానేమో అనుకున్నారు. కానీ నేను ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’అని విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ మాట (నక్సలైట్) అన్నందుకు తనకు బాధ కలగలేదని చెప్పారు.వారు మాట్లాడినంత మాత్రాన తాను సుప్రీంకోర్టు జడ్జిగా ఇచి్చన తీర్పులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చలేరని చెప్పారు. అసలు ఆ తీర్పు గురించి మాట్లాడే ముందు ఒక్కసారి చదివి మాట్లాడాలని హితవు పలికారు. అలా చదివి మాట్లాడితే తనపై ఉపయో గించిన భాషా ప్రయోగం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఇండియా కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల మధ్య పరిచయ కార్యక్రమం జరిగింది. ఏ పార్టీ సభ్యత్వం తీసుకోను.. ఈ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రా జ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు మసకబారుతున్న సందర్భంలో గొంతెత్తి మాట్లాడే కర్తవ్యం ప్రతి పౌరుడిపైనా ఉంటుందన్నారు. అందుకే తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి అంగీకరించానని చెప్పారు. తాను రాజకీయ ముళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకోలేదని.. భవిష్యత్తులోనూ ఏ పార్టీ సభ్యత్వం తీసుకోనని స్పష్టం చేశారు. తాను రాజకీయేతర వ్యక్తిని కాదని.. రాజ్యాంగంపట్ల విధేయతతో ఓటు వేసే ప్రతి పౌరుడికీ రాజకీయాలతో అవినాభావ సంబంధం ఉంటుందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వివరించారు. మరింత ప్రమాదంలోకి ప్రజాస్వామ్యం... దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడికి ఆయుధంగా ఓటు హక్కును ఇవ్వాలని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావించారని, కానీ ఓటరు జాబితాను చిత్తు కాగితంలా మార్చి ఇష్టం ఉన్నవారి పేర్లను జాబితాలో చేర్చి.. ఇష్టంలేని వారి పేర్లు తీసేయడం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఇదే ధోరణితో వెళ్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించను.. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు తాను పార్టీల బలాబలాలను చూసుకోలేదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చెప్పా రు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకను హిమాలయాలపై ఎగురవేశానని చెప్పేంత వెర్రివాడిని కాదని.. కానీ తెలంగాణ ప్రతిష్టకు, ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ఏ పనీ చేయనని చెప్తానన్నారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని, దేశంలోని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థినని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇండియా కూటమిలో లేని ‘ఆప్’సహా మరికొన్ని పార్టీలు తనకు మద్దతిచ్చాయని చెప్పారు. రెండు విధానాల మధ్య పోటీ: సీఎం రేవంత్ ఈ ఎన్నిక రెండువిధానాల మధ్య జరుగుతోందని.. రాజ్యాం గాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వారు.. రాజ్యాంగాన్ని రక్షించి పేదలందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలనే వారి మధ్య పో టీ జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలుగు గౌ రవాన్ని, ప్రతిష్టను పెంచేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఒ క్కతాటిపైకి రావాలని కోరారు. జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్, వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, కేసీఆర్, ఒవైసీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతివ్వాలని కోరారు.తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 42 మంది లోక్‌సభ, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు. -
రాజ్యాంగ రక్షణకు పాటుపడతా
సాక్షి, చెన్నై: తనను ఆదరించి గెలిపిస్తే ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని విపక్షాల ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. తమిళనాడులోని ఎంపీల మద్దతును కూడగట్టుకునేందుకు చెన్నైలో ఆదివారం సాయంత్రం సుదర్శన్ రెడ్డి పర్యటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నై టీనగర్‌లోని ఓ హొటల్లో జరిగిన సమావేశంలో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, వీసీకే తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ‘‘ నేనిప్పుడు నా గురించి చెప్పుకోదల్చుకోలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేనిచ్చిన తీర్పులనూ ప్రస్తావించదల్చుకోలేదు. నా తీర్పుల కంటే ఇప్పుడు మీరు నా విషయంలో ఇచ్చే తీర్పు(ఓటు వేయడం) అత్యంత కీలకం. నాకు అవకాశం ఇస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా’’ అని సుదర్శన్ రెడ్డి చెప్పారు. -
అందుకే అడగ్గానే ఒప్పుకున్నా: జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి
ఢిల్లీ: స్వయంగా దేశ ప్రధానినే తమ అభ్యర్థికి ఓటేయాలని అడుగుతున్నారని.. అలాంటిది తాను ఎంపీలను అడగడంలో తప్పేమీ లేదని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి(79) అంటున్నారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. ఓ తెలుగు ఛానెల్‌తో ఆయన మాట్లాడారు. ‘‘ఉత్తర, దక్షిణ భారత దేశం అనే తేడా లేదు. నేను తెలంగాణలో పుట్టా.. కానీ భారతదేశ పౌరుడినే. ఉపరాష్ట్రపతి పదవిని- దేశాన్ని దయచేసి వేరుగా చేసి చూడొద్దు. ప్రజాక్షేత్రంలోకి వచ్చాను. ఇందులో దాపరికం ఏం లేదు. పార్లమెంట్ సభ్యులందరూ విజ్ఞులు. స్వయంగా ప్రధాని తమ అభ్యర్థికి ఓటేయాలని ఎంపీలను అడుగుతున్నారు. అందుకే నేను కూడా నాకు ఓటు వేయాలని ఎంపీలను బహిరంగా కోరుతున్నా.... ఉపరాష్ట్రపతి పీఠం.. రాజకీయ వ్యవస్థేం కాదు. అదొక రాజ్యాంగబద్ధమైన పదవి. రాజకీయ వ్యవస్థ కాదనే ఉద్దేశంతోనే అడగ్గానే ఒప్పుకున్నా. రాజకీయ ప్రేరేపిత పరిస్థితుపై మాట్లాడను. ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. నేను పోటీ పడుతోంది ఉప రాష్ట్రపతి పదవి కోసమే. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు కాదు. ఆ పదవికి ఉన్న గౌరవం కాపాడాల్సి ఉంది.పార్లమెంట్ సభ్యుల్లో విభజన జరిగిందని నేను అనుకోవడం లేదు. నేను గెలవాలని ఎంపీలు కోరుకుంటున్నారు. నాకు మద్దతు ఇస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడిని అనుకుంటే నాకు ఓటేయండి. భారతీయ రాజకీయ వ్యవస్థలో మార్పు జరగాలి. రాజ్యాంగ పరిరక్షకు కృషి చేస్తా. సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుతున్నా’’ అని ఎంపీలకు విజ్ఞప్తి చేశారాయన. ఇదిలా ఉంటే.. ఉపరాష్ట్రపతి పదవికి నామినేన్ల దాఖలుకు రేపు ఆఖరి తేదీ. ఇవాళ ఇండియా ఎంపీల కూటమి సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పాల్గొంటారని.. రేపు(గురువారం) తన నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
‘ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. రాజకీయాలతో సంబంధం లేని వారిని ఎన్నుకోవాలని వాళ్లు భావించినట్లుంది. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎంపీలను వ్యక్తిగతంగా కలిసి, నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని, ఓటు వేయాలని కోరతా. దేశ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తా’. – ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్రెడ్డిసాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం తీసుకుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బూచిరెడ్డి సుదర్శన్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఇండియా కూటమి నేతలతో కలిసి ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో రెండో అత్యున్నత పదవికి జరగనున్న ఈ ఎన్నికలను ‘సైద్ధాంతిక యుద్ధం’గా ఖర్గే అభివర్ణించారు. అందుకే విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ పడుతున్నాయన్నారు. కాగా అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్ష అభ్యర్థి, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌తో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పోటీ పడనున్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణన్‌లు బుధవారం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ (పార్లమెంటు పాత భవనం)లో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఏకగ్రీవ నిర్ణయం మంగళవారం మధ్యాహ్నం ఖర్గే నివాసంలో, ఆయన అధ్యక్షతన జరిగిన ఇండియా కూటమి భేటీకి విపక్ష పార్టీల నేతలు శరద్‌పవార్, సంజయ్ రౌత్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, డెరిక్ ఓబ్రియెన్, కనిమొళి, తిరుచ్చి శివ, జాన్ బ్రిట్టాస్, ధర్మేంద్ర యాదవ్, ప్రమోద్ తివారీ, రజని పాటిల్, అరి్వంద్ సావంత్, ఎంఏ బేబీ తదితరులు హాజరయ్యారు. అంతా కలిసి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును విపక్ష కూటమి అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించింది. ఈ సమావేశానంతరం ఖర్గే విపక్షాల సంయుక్త ప్రకటనను మీడియాకు చదివి విన్పించారు. పేదల పక్షపాతి ‘సుదర్శన్ రెడ్డి దీర్ఘకాలం పాటు న్యాయ సేవలందించారు. దేశంలోని ప్రఖ్యాత, ప్రగతిశీల న్యాయవేత్తలలో ఒకరు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశిష్టమైన సేవలు అందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిరంతరం పోరాడారు. ఆయన తీర్పుల్లో పేదల పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ, ప్రాథమిక హక్కుల కాపాడేందుకు కృషి చేశారు. విపక్ష పార్టీలన్నీ ఒకే పేరుకు అంగీకారం తెలపడం సంతోషంగా ఉంది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఎదురవుతుందో అప్పుడు విపక్షాలన్నీ ఏకమై ఇందుకు వ్యతిరేకంగా పోరాడతాయి..’అని ఖర్గే పేర్కొన్నారు. దక్షిణాది వర్సెస్ దక్షిణాది! జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో అనివార్యమైన ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చివరివరకు ప్రయతి్నంచింది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. ఏ కూటమిలోనూ లేని వైఎస్సార్సీపీ, బీజేడీ వంటి పార్టీల అధినేతలతో ఈ మేరకు బీజేపీ నేతలు చర్చలు జరిపారు. మంగళవారం సైతం రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. అయితే ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దక్షిణాది రాష్ట్రానికే చెందిన రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపాలని నిర్ణయించింది. ఊహించని విధంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. తద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నికను దక్షిణాది వర్సెస్ దక్షిణాది అన్నట్టుగా మార్చివేసింది. ఎన్డీయే తమ అభ్యర్థిగా..తమిళనాడుకు చెందిన, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బరిలోకి దింపిన నేపథ్యంలో.. డీఎంకే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలక్టొరల్ కాలేజీలో ఎన్డీఏకే బలం ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 782 మంది ఓటర్లు ఉన్నారు. ఎవరైనా గెలవాలంటే 394 ఓట్లు అవసరం. కాగా ఎన్డీఏకు లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల (మొత్తం 422) మద్దతు ఉంది. ఇండియా కూటమికి లోక్‌సభలో 234 మంది, రాజ్యసభలో 96 మంది (మొత్తం 330) మద్దతు ఉంది. ఇక ఏ కూటమికీ చెందనివారు 30 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం ఎన్డీఏ ఆధిక్యం సుస్పష్టంగా ఉన్నప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని బరిలోకి దింపాయి. వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి.. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ మండలం ఇబ్రహీంపట్నం తాలూకా ఆకుల మైలారం గ్రామంలో బూచిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, అనసూయమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. సుదర్శన్‌రెడ్డికి భార్య పద్మారెడ్డి, ఇద్దరు కుమారులు శశిధర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, కుమార్తె సుమిత (పస్తుతం అమెరికాలో) ఉన్నారు. ఆయన ఆకుల మైలారం గ్రామంతో పాటు యాచారం మండలం కురి్మద్దలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత పదో తరగతి వరకు హైదరాబాద్ శాలిబండలోని రిఫైన్ ఎయిడెడ్ స్కూల్లో చదివారు. నగరంలోని వివేకవర్ధిని కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్బీ చదివారు. 1971లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. సిటీ సివిల్ కోర్టు (హైదరాబాద్), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించారు. 1988 ఆగస్టు 8న హైకోర్టులో రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది (1988–1990)గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా స్వల్పకాలం విధులు నిర్వర్తించారు. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు కార్యదర్శిగా, కరస్పాండెంట్‌గా పనిచేశారు. 1993–94 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. 2011 జూలై 8న పదవీ విరమణ పొందారు. 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం ఆమోదం పొందిన తర్వాత అదే ఏడాది గోవా తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు. అయితే వ్యక్తిగత కారణాలతో అదే ఏడాది ఆ పదవి నుంచి వైదొలిగారు. అందరి మద్దతూ కోరతా – ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి – ఘన స్వాగతం పలికిన విపక్ష పార్టీల ఎంపీలు జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, రఘురాంరెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్‌లతో పాటు రాజీవ్ శుక్లా సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎంపీలను వ్యక్తిగతంగా కలిసి, తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా, ఓటు వేయాల్సిందిగా కోరతానని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, రఘురామిరెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్‌లతో పాటు రాజీవ్ శుక్లా సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఆకుల మైలారంలో ఆనందోత్సాహాలు కందుకూరు: జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన స్వగ్రామమైన ఆకుల మైలారంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక యువత బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడంతో ఆనందంగా ఉందని వారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన.. గ్రామ పరిధిలోని మాలగూడ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఓ ఇల్లు నిర్మించుకున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వరి పంట, పండ్ల తోటలు పరిశీలించి వెళ్తుంటారు. -
జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?
ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటంలో పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో మీడియా స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి. ప్రజల పట్ల కడు గౌరవంతో, అణకువతో ప్రవర్తించాలి. కానీ ఒకనాటి విశిష్ట పాత్రికేయ ప్రమాణాలన్నీ క్రమంగా పతనమవడం చూస్తున్నాం. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నిశితమైన విమర్శలు చేశారు. నిజాయితీ గల పాత్రికేయులందరూ వీటికి జవాబులు వెతకాలి. అయితే పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి స్వార్థపర రాజకీయాలేనని మరవరాదు. ‘‘వార్తా పత్రికలు అనేవి సమాజంలో అంతర్భాగం. అంతమాత్రాన్నే తాము మొత్తం సమాజానికే ‘శిష్టాది గురువు’లమనీ, లోకంలోని జ్ఞానమంతా తమ సొత్తనీ భావించి విర్రవీగరాదు. బుద్ధిగల ఏ వార్తాపత్రికైనా చారిత్రక పరిణామంలో తనవంతు కీలకమైన పాత్ర నిర్వహిం చాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాధ్యత గల ఏ పత్రికైనా సమాజం కోసం, తాను సేవలందించే ప్రజల కోసం వారి పట్ల కడు గౌరవంతో, అణ కువతో ప్రవర్తించాలి. ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ఈ క్రమంలోనే సమాజం పట్ల పత్రికల బాధ్యతను ఏరోజుకారోజు తాత్కాలిక రాజకీయ పార్టీలు లేదా ఆనాటి ప్రభుత్వాల బాధ్యతతో పోల్చుకోరాదు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడు వాదోడు కావడంలో పత్రికలు పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి.’’ – సుప్రసిద్ధ జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ 1978 సెప్టెంబరు 5న తన నూరు సంవత్సరాల చరిత్రను (1878–1978) సమీక్షిస్తూ రాసిన సంపాదకీయం. ఒకనాటి ఇలాంటి విశిష్ట పత్రికా (పాత్రికేయ) ప్రమాణాలన్నీ కొలది సంవత్సరాలుగా ఎలా పతనమవుతూ వస్తున్నాయో చూస్తూనేవున్నాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు న్యాయ మూర్తులలో విశిష్టమైన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఈ విషయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భావాలతో న్యాయస్థానాల ద్వారా, సభల ద్వారా ప్రజా బాహుళ్యంలో ఆధునిక వైజ్ఞా నిక దృష్టిని పెంపొందించడానికి కృషి చేస్తూ వచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో నేటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించి, నిశితమైన విమర్శలు చేశారు. ఈనాటి కొందరు జర్నలిస్టులు పత్రికా యాజమాన్యాల సాయంతో పాలకుల్ని ఒప్పించడం సబబైన మార్గమని భావిస్తూండడాన్ని జస్టిస్ సుదర్శన్ విమర్శించారు. ఈ ధోరణి నేటి మీడియాలో పెరిగి పోతుండడాన్ని ఆయన నిరసించారు. వేలాది వార్తా పత్రికలు, వెయ్యి ఉపగ్రహాల సహాయంతో నడుస్తున్న న్యూస్ చానల్స్, 600 ఎఫ్.ఎం. స్టేషన్స్‌తో దేశంలోని బహు కొలదిమంది సంçపన్నులు లాభాల వేటలో పడి సొమ్ము చేసు కుంటున్నారు. ఇలాంటి వాతావరణంలోనే ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మీడియా ఓ పెద్ద ఘటనగా చూపింది. అందుకు దోహదం చేసినవాళ్లు వెంటనే దాన్ని రాజకీయ పోరాటంగా మలిచేశారు. కానీ అదే సమయంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కేవలం ఏడు నిమిషాల ప్రాధాన్యం కల్పించారు. ఎందు కని? వార్తలు పత్రికా ఆఫీసుల నుంచి కాకుండా ఎక్కడో బయట ‘అల్లి’ పత్రికలకు చేరుతున్నాయి! అయినా నిజాయితీ గల జర్నలిస్టులు, ప్రజా సమస్యల పట్ల ఆవేదన చెందగల పాత్రికేయులు కూడా మనకు లేకపోలేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తించగలిగారు. అంతేగాదు, మరొక వాస్తవాన్ని కూడా జస్టిస్ సుదర్శన్ బహిర్గతం చేశారు. వార్తా పత్రికలు నిర్వహించే యాజమాన్య సంస్థల్లో పెక్కింటికి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నందున నిర్ణయాలు త్వరగా తీసుకోలేని దుఃస్థితిని కూడా ఆయన వివరించారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దాని విలువల్ని కాపాడేందుకుగానూ పూర్తిగా ప్రయివేట్ పత్రికా యాజమాన్యాల మీడియా సంస్థలపై సరైన అదుపాజ్ఞలు విధించడం అవసర మన్న సుప్రీంకోర్టు ప్రకటనను కూడా జస్టిస్ సుద ర్శన్ గుర్తు చేయవలసి వచ్చింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్ట్ ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ – ప్రతీ పాత్రి కేయ విలువనూ, గత ప్రమాణాలనూ ధ్వంసం చేసి నేరస్థ రాజకీయ విలువల్ని చొప్పించేశారనీ, అదే జర్నలిజంగా ప్రమోట్ అవుతోందనీ ఆవేదన చెందారు. ధనార్జనలో భాగంగా అమెరికన్ కోటీశ్వరుడు రూపర్ట్ మర్డోక్ ‘ఫాక్స్’ న్యూస్ చానల్ పెట్టి ఎలా అనైతిక ప్రమాణాలను ప్రవేశపెట్టాడో లోకానికి తెలుసు. ఎక్కడో అమెరికా, ఇతర దేశాల సంగతి కాదు... ఆ మాటకొస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నట్టింటనే ఇలాంటివి జరిగాయి. ‘‘సీనియర్ జర్నలిస్టుల’’ పేరిట చలామణీ అవు తున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రి సాకడం జరిగింది. వారికి ఇంటర్– స్టేట్ వాహనాల లైసెన్సులు ఇప్పించడమే గాకుండా హౌసింగ్ బోర్డు యాజమాన్యంలో కూడా చోటు కల్పించారు. దాన్ని స్వప్రయోజనాలకు వినియో గించుకుని బ్యాంకుల్ని దివాళా తీయించిన ఉదా హరణలూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరవరాదు! అంతేగాదు, అనైతిక మీడియా సోదరుడే ‘‘ముందు వాడి (ఎన్.టి.ఆర్.) ఫొటోను తీసి అవ తల పారేస్తావా, లేదా?’’ అని స్వయంగా చంద్ర బాబు ముఖం మీదనే ‘ఉరిమాడా,’ లేదా? ఎన్టీఆర్ ఫొటో తీసేస్తే కథ అడ్డం తిరుగుతుందని తెలిసిన చంద్రబాబు ‘అలాగే తీసేద్దాంలే, ఇప్పుడు కాదు’ అని చెప్పి... ‘ఫొటో నాటకం’ కోసం కొన్నాళ్లు ఎన్టీఆర్ అవసరమని తెలిసి తన తైనాతీ జర్న లిస్టును కాపాడుకున్నాడా, లేదా? ఇప్పటికీ ఆ నాటకం ఎన్టీఆర్ బొమ్మతోనే కొనసాగిస్తున్నారా, లేదా? చివరికి అమరావతి రైతాంగాన్ని మోస గించిన వైనాన్ని గురించి సీనియర్ జర్నలిస్టుగా హైకోర్టులో నేను రిట్ వేసినా, దాన్ని కనీసం చర్చకు కూడా రానివ్వకుండా తొక్కిపెట్టించిన ఖ్యాతిని మూటగట్టుకున్నవాడు చంద్రబాబే! అంతే గాదు, అమరావతి రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి సుప్రీంకోర్టులో నేను రిట్ వేసినప్పుడు, ఆగమేఘాల మీద ఢిల్లీ చేరుకుని, ఆ కేసును కూడా తొక్కిపట్టేట్టు చేసినవాడూ చంద్ర బాబే కదా? ఆ కేసు అప్పటికీ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ముక్కారు పంటలు పండే అమ రావతి ప్రాంత భూములను తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన మంత్రివర్గంలోని ధనాఢ్యుడైన విద్యాశాఖామంత్రికి ధారాదత్తం చేయడమే కాక... ఎదురు తిరిగిన రైతుల భూముల్ని తగలబెట్టించి, ఆ దుర్మార్గాన్ని దళితు డైన నందిగం సురేష్‌పై (నేటి పార్లమెంట్ సభ్యుడు) నెట్టి, వేధింపులకు గురిచేసిన వాళ్లెవరు? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి పాలకుల స్వార్థపర రాజకీయా లేనని మరవరాదు. కనుకనే గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మన మీడియా నిర్వాహకులకు (కోట్లకు పడగలెత్తిన యాజమాన్యాలకు, బతుకు బాటలో లొంగిపోయే కొందరు మీడియా మిత్రు లకు) చురకలు వేయడం సకాలంలో సబబైన స్పందనగా నేను భావిస్తున్నాను. అమెరికాలో వాల్టర్ లిప్మన్, ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ నిర్వ హించిన పాత్రను ఇక్కడ మన కాలంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోషిస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాజాలదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి
హైదరాబాద్ : ప్రశ్నించడంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు కవులు,రచయితలు, కళాకారులు తమ కలాలను, గళాలను సంధించాలన్నారు. డెబ్బై ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలి భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందని సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లా డారు. వక్రబుద్ధితో ఆలోచించేనేతల చేతుల్లో చిక్కుకున్న వ్యవస్థలో సత్యం మాట్లాడలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆత్మగౌరవం నినాదంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న మనం అమరుల త్యాగాల మీద నడుస్తున్నామన్నారు. వ్యవస్థను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం సాధ్యం కాకపోతే దాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ దారి తప్పిన పిల్లలున్నారు కానీ దారి తప్పిన కలాలు లేవన్నారు. సమాజం తనదని భావించినప్పుడే నిజమైన సాహిత్యం ప్రారంభం అవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సుప్రసిద్ధ తమిళ రచయిత పి. శివకామి అన్నారు. ప్రముఖ రచయిత ప్రొఫెసర్ హెచ్ఎస్ శివప్రకాశ్, ప్రొఫెసర్ ఎం.ఎం.వినోదిని, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడారు. సాహిత్యం, సాంస్కృతిక రంగాలపై పార్టీలు మాట్లాడటం లేదు : రామచంద్రమూర్తి ‘సాక్షి ’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి ఏ పార్టీ చర్చించడంలేదనీ, తమ మేనిఫెస్టో లో పెట్టడంలేదన్నారు. పుణె పోలీసులు విరసం నేత వరవరరావును అరెస్ట్ చేస్తుంటే ఏ పార్టీ నేతలూ మాట్లాడలేదని చెప్పారు. నాలుగేళ్లపాటు ఒక మహిళామంత్రి లేకుండా పాలించినా ఏ ఉద్యమమూ జరగలేదన్నారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, పూర్వ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, సకల జనుల వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.వినాయకరెడ్డి పాల్గొన్నారు. ‘ఎన్నికలు, ప్రజల కర్తవ్యాలు– రచయితలు’అనే అంశంపై జరి గిన సభలో అన్నవరం దేవేందర్, అల్లం రాజయ్య, సీహెచ్ మధు, ‘మేనిఫెస్టోలు – భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు – వివిధ పార్టీలు’ అనే అం శంపై జరిగిన సెషన్లో మానవ హక్కుల వేదిక అధ్య క్షుడు ఎస్. జీవన్‌కుమార్, సీపీఎం నేత జి. నాగయ్య, పొట్లపల్లి రామారావు జయంతి ఉత్సవాల ముగింపు సమావేశంలో బూర్ల వెంకటేశ్వర్లు, ప్రముఖ కవి నిఖి లేశ్వర్, విమలక్క, పొట్లపల్లి వరప్రసాదరావు, డా.వి.ఆర్. శర్మ, పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. పలు పుస్తకాల ఆవిష్కరణ అలిశెట్టి ప్రభాకర్‌పై రాసిన వ్యాస సంకలనం నెత్తుటి పాలపుంత, తిరుమలరావు సంకలనం దళిత గీతాలు, నల్లేల రాజయ్య రచన సిరధమనులు, పెనుగొండ బసవేశ్వర్ ఆకాశమంతా పావురం, పెనుగొండ సరసిజ రచన ‘కాగితాన్ని ముద్దాడిన కళ’, నేరేళ్ల శ్రీనివాస్ రచన ‘దుళ్దుమ్మ’’, తోకల రాజేశం రచన ‘‘అడవి దీపాలు’’, బండి చంద్ర శేఖర్ రచన ‘‘ఆవాజ్’’, వడ్నాల కిషన్ రచన ‘‘వెన్నెల ముచ్చట్లు’’, జి.లచ్చయ్య రచన ‘‘కాలంబూ రాగానే’’ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. -
ఆర్థిక విధానాలే గుత్తాధిపత్యానికి కారణం
హైదరాబాద్: నూతన ఆర్థిక విధానాలు గుత్తాధిపత్యానికి, ఆర్థిక అసమానతలకు కారణమయ్యాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గుత్తాధిపత్య సంస్థల ఆకాంక్షలు ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొం దని, నేడు అత్యంత ఉన్నతమైన పరిజ్ఞానాన్ని గూగుల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు తీసుకొస్తున్నాయన్నారు. వారు సృష్టించిన సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపైన, జిజ్ఞాసపై దాడి జరుగుతోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 39వ ఆర్టికల్ ఉత్పత్తి శక్తులు ఎవరి చేతుల్లో కేంద్రీకరించరాదని చెబుతోందని, దీనికి భిన్నంగా నేటి పరిణామాలు కనిపిస్తున్నాయన్నారు. జాతీయ ఆదాయంలో 73% ఆదా యం ఒక్క శాతం జనాభా వద్దనే ఉందని, దీని వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నా రు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యూట్రిషన్ శాస్త్రవేత్త డాక్టర్ మెహ్తాబ్ ఎస్.బాంజీ, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ పి.అంబేడ్కర్, డాక్టర్ భీమేశ్వర్రెడ్డి, డాక్టర్ టి.సుందరరామన్, ప్రొఫెసర్ శీలాప్రసాద్ పాల్గొన్నారు. -
పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్: పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. నిరంతరం ప్రశ్నించేతత్వం ఉండాలని, ఈ క్రమంలో సంయమనం పాటించాలన్నారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ప్రజా స్వామ్యం- పౌర సమాజం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంను ఘనంగా సత్కరించారు. కోదండరాంను అభినందిస్తే పౌర సమాజాన్ని గౌరవించినట్లేనని అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలు పెరిగినా నకిలీ విత్తనాలపై నియంత్రణ, పర్యవేక్షణ కరువైంద న్నారు. ఏ దేశంలో కూడా అపరిమితమైన వనరులు ఉండవని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమైన అంశంపైనే దృష్టి సారించాలన్నారు. మన దేశంలో రాజకీయ నాయకులను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలని, ఆ ఫలితాలు అందరికీ దక్కాలనే భావనతో భవిష్యత్‌లో ప్రజల పక్షాన నిలబడి పని చేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, స్వర్ణలత, పి.రమ పాల్గొన్నారు. -
హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వరంగల్ : తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారక ప్రథమ సభ కు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ‘ప్రత్యేక హైకోర్టు లేని తెలంగాణ రాష్టం రాజ్యంగ బద్ధమేనా?’ అం శంపై ఆయన మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంటే విశాల ప్రజానీకానికి వ్యతిరేకమైన ఈ చర్యను తీవ్రంగా పరిగణించేవాడినని’ అన్నారు. 214వ అధికరణం ద్వారా ప్రతి రాష్ట్రానికి విధిగా హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వైశాల్యంలో, జనాభాలో చిన్న రాష్ట్రాలు అయిన త్రిపుర, మణిపూర్, మేఘాలయాకు హైకోర్టును ఏర్పాటు చేశారని, 4కోట్లకు పైగా జనాభా, విశాలమైన విస్తీర్ణం ఉన్న తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. -
మహాభారత యుద్ధాన్ని కోరకండి
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కీలక దశకు చేరుకున్న దశలో అడ్డుకోవడం రాజ్యాంగ ద్రోహమని గోవా లోకాయుక్త జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ‘‘చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలేవీ ఉండవు. అలా కాకుండా మరో మహాభారత యుద్ధాన్ని మాత్రం కోరుకోవద్దు. మరో యుద్ధమే జరిగితే దుర్యోధనుడి తొడలు విరుగుతాయి’’ అని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. కరీంనగర్లో ఆదివారం అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పోరాటాన్ని అన్యాయానికి, దోపిడీకి, అసమానతలకు వ్యతిరేకంగా సాగుతున్న విముక్తి పోరాటంగా అభివర్ణించారు. జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించకపోతే మున్ముం దు ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ‘‘ఆధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో సంపాదించుకున్న ఆస్తులను ప్రజలపరం చేసే దిశగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. లెక్కలన్నీ తేలాల్సిందే. నిజాం కాలం నాటి సర్ఫె ఖాస్ భూములు, 440 చెరువులు, కుంటలతో పాటు వక్ఫ్, దేవాలయ భూముల లెక్కలు వెలికితీయాలి. అయితే ఇది ప్రతీకార వాంఛ మాత్రం కాదు. పునర్నిర్మాణంలో భాగమంతే’’ అని తెలిపారు. తెలుగుజాతి, తెలుగుతల్లి అనే పదా లు ఎక్కడా లేవని, సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఎక్కడా ఈ తెలుగుజాతి ప్రస్తావన లేదని వివరించారు. తెలుగుదేశం, తెలుగునాడు అన్న మాటలు వాడారే తప్ప ఎక్కడా జాతి అని వాడలేదన్నారు. ‘‘తెలంగాణ ప్రాంతం విడిపోతే దక్షిణ పాకిస్థాన్ అవుతుందని 1969 ఉద్యమంలో ఎవరో విమర్శించారు. తెలుగుతల్లి పిల్లలం అనే మాటలోనే ముసలం ఉందని కాళోజీ అప్పుడే హెచ్చరించారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న జాతి సమైక్యత, ప్రాదేశిక సమగ్రత అనే మాటల్లో జాతి అంటే భారతజాతి మాత్రమే. భారతదేశంలో ఉన్నవారంతా భారత పౌరులు. తెలుగు పౌరులూ, తమిళ పౌరులూ ఉండరు. భాషకో జాతి అన్న భావనే ప్రమాదకరమైనది. భాషాభిమానం దురభిమానంగా మారకూడదని సూచించారు. తమిళ భాషాభిమానం వెర్రితలలు వేసి, ద్రవిడ ఉద్యమ కాలంలో తాము ఈ దేశంలోనే ఉండబోమనే వరకు వెళ్లింది. దేశ పౌరులు సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సిందేనంటూ అప్పుడే ఏడో రాజ్యాంగ సవరణ వచ్చింది’’ అని గుర్తు చేశారు. తెలుగుజాతి అన్న పదం ఆధిపత్య భావజాలం నుంచి వచ్చిందని సుదర్శన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రచయితలు సోక్రటీస్ వారసులని ప్రశంసించారు. తాము ప్రశ్నించడమేగాక, ప్రశ్నించే హక్కు మీకూ ఉందని ప్రజలకు నేర్పించారంటూ అభినందించారు. చివరివరకు దోపిడీని ప్రశ్నించిన కాళోజీ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నలి మెల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ డాక్టర్ ఎన్.గోపీ, సూరెపల్లి సుజాత, జూకంటి జగన్నాథం, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎన్.శేఖర్ పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రవాస తెలంగాణ రచయితల సదస్సు జరిగింది. మైసూరు తెలుగు సమితి అధ్యక్షుడు సి.ఎన్.రెడ్డి అధ్యక్షత వహించారు. ముంబై, షోలాపూర్, భీవండి, సూరత్ నుంచి వచ్చిన రచయితలు పాల్గొన్నారు. 12 పుస్తకాలు, రెండు సీడీలను ఆవిష్కరించారు.