
అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి
సీపీ రాధాకృష్ణన్, జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిల మధ్య ముఖాముఖి పోటీ
ఓటింగ్‌లో పాల్గొననున్న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు
ఉదయం 10 గంటలకు పోలింగ్ షురూ..
6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..తర్వాత వెలువడనున్న ఫలితం
బలాబలాల పరంగా ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మెజార్టీ
మాక్ పోలింగ్‌లు, ఎంపీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పార్టీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగనుండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్‌ను నిర్వహించాయి.
పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు.
ఎన్డీఏకు సొంతంగా 422 మంది సభ్యుల బలం
ఎలక్టోరల్ కాలేజీలోని బలాబలాల పరంగా చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 781 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇక 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉంది. విజయానికి అవసరమైన ఓట్లు 391 కాగా, ఎన్డీఏకు సొంతంగానే 422 మంది సభ్యుల బలం ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ 11 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించడంతో ఆ సంఖ్య 433కి చేరనుంది. ఇక విపక్ష ఇండియా కూటమికి రెండుసభల్లో కలిపి 311 ఓట్లు ఉండగా, ఈ కూటమికి ఆప్ మద్దతు ప్రకటించింది. దీంతో కూటమి బలం 320 మాత్రమే దాటుతోంది. అయితే రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఎంపీలు తమ పార్టీల విప్‌ను పాటించాల్సిన అవసరం లేదు.
అన్ని పార్టీల మాక్ పోలింగ్..
పార్టీల బలాబలాలపై ఇరు పక్షాలకు స్పష్టత ఉన్నప్పటికీ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడంపై ఆందోళన, క్రాస్ ఓటింగ్ భయం రెండు కూటముల్లోనూ కనిపిస్తోంది. 2022 ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోవడంతో ఈసారి పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ తమ ఎంపీల కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ పాత పార్లమెంట్ భవనం సెంట్రల్‌హాల్‌లో మాక్ పోలింగ్ ద్వారా తమ ఎంపీలకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందు ఇచ్చారు. సంవిధాన్ సదన్‌లో జరిగిన సమావేశంలో ఖర్గేతో పాటు సోనియాగాం«దీ, శరద్‌పవార్, టీఆర్ బాలు, అఖిలేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సైతం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలతో మాక్ పోలింగ్ నిర్వహించింది.

ఎన్డీఏ ఎంపీలతో మోదీ సమావేశం
మంగళవారం ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం..‘రాధాకృష్ణన్ అద్భుతమైన ఉప రాష్ట్రపతి అవుతారని ప్రజలు విశ్వసిస్తున్నారు..’అంటూ ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ మచ్చలేని నేతగా అభివరి్ణస్తోంది. రాజకీయ, పాలనాపరమైన ఆయన విశేష అనుభవం..రాజ్యసభ చైర్మన్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉపకరిస్తుందని పేర్కొంటోంది. ఇక విపక్షాల అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి 2011లో సుప్రీంకోర్టులో పదవీ విరమణ పొందారు. నల్లధనం, సల్వాజుడుం తదితర కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు.
బీఆర్‌ఎస్, బీజేడీ దూరం
రెండు కూటములకు సమాన దూరాన్ని పాటిస్తూ వస్తున్న బీఆర్‌ఎస్, బీజేడీలు ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్‌ఎస్‌కు నలుగురు, బీజేడీకి ఏడుగురు సభ్యుల బలం ఉంది.