రాజ్యసభ ఛైర్మన్ హోదాలో తొలిసారిగా ఉపరాష్ట్రపతి దిశానిర్దేశనం
న్యూఢిల్లీ: ఇటీవల ఉపరాష్ట్రపతిగా ప్రమాణంచేసిన సీపీ రాధాకృష్ణన్ సోమవారం మొదలైన పార్లెమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిసారిగా రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్యసభలో సభాకార్యకలాపాలు మొదలుకాగానే సభ్యులను ద్దేశించి రాధాకృష్ణన్ మాట్లాడారు. ‘‘రాజ్యాంగబద్ధ సంస్థలను సభ్యులంతా గౌరవించాలి. దేశానికి సంబంధించిన తమ బాధ్యతలను సభ్యులు గుర్తెరగాలి. దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరింపజేయడంలో మీ వంతు కృషిచేయండి.
ఈసారి సిట్టింగ్‌లో చాలా ఎక్కువ అంశాలపై రాజ్యసభలో చర్చించాల్సి ఉంది. సమయం చాలా తక్కువ ఉండటంతో ఇది నాకూ, మీకూ ఎంతో సవాల్‌తో కూడిన విషయం. రాజ్యసభ ఛైర్మన్‌గా నాకు సాదరస్వాగతం పలికి సభాధ్యక్ష స్థానందాకా వెంట నడిచిన ప్రధాని మోదీ, అన్ని పార్టీల సభ్యులకు నా కృతజ్ఞతలు. ప్రధాని మోదీ నా గురించి మాట్లాడేటప్పుడు క్రీడాకారునిగా ఉన్నప్పటి నా గతకాలపు జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. క్రీడాకారుడంటేనే కచ్చితమైన నిబంధనలను పాటించాలి. అలాగే ఈ సభలోని సభ్యులు సైతం రాజ్యసభ పార్లమెంటరీ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలి.
లక్ష్మణరేఖ దాటకూడదు. లక్షణరేఖకు లోబడే ప్రతి ఒక్క సభ్యుని హక్కులకు విలువ లభిస్తుంది. న్యాయబద్ధమైన అభ్యంతరాలను పరిశీలిస్తా. కర్షకులు, కార్మికులు, వీధి వ్యాపారులు, మహిళలు, యువత, నిరుపేదల ఆకాంక్షలను పార్లమెంట్ ప్రతిబింబించాలి. సమాజంలో ఎస్సీ, ఎస్టీలు, వెనకబడిన, అణచివేతకు గురైన వర్గాల సామాజికన్యాయం, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా పనిచేస్తూ రాజ్యాంగంపట్ల మన నిబద్ధతను చాటుదాం. సభ్యులు రాజ్యసభలో ఉన్నంతసేపు తమ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకన్‌కాలాన్ని అర్ధవంతమైన చర్చల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పటిష్టంచేసేందుకు సద్వినియోగం చేయాలి ’’ అని రాధాకృష్ణన్ అన్నారు.


