ప్రధాని మోదీ గోపూజ..
ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే గొప్ప పండుగ
ప్రకృతిని కాపాడుకోవాలన్న సందేశం ఇస్తోంది
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగన్
నివాసంలో పొంగల్ వేడుకలు
గోపూజ చేసి, పొంగలి వండిన ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే గొప్ప పండుగ పొంగల్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇది ప్రపంచ స్థాయి పండుగగా మారిందని ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, కె.రామ్మోహన్ నాయుడితోపాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గోపూజ చేశారు. స్వయంగా పొంగలి వండారు. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పంటలు ఇచ్చే భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పొంగల్ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. పండుగ పరమార్థంలో రైతన్నల శ్రమ కూడా దాగి ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు సాగాలన్న సందేశాన్ని పొంగల్ ఇస్తోందని తెలిపారు. ప్రపంచంలో తమిళులు ఎక్కడున్నా సరే పొంగల్‌ను ఉత్సాహంగా నిర్వహించుకుంటారని, తమిళ సంస్కృతిని సుసంపన్నం చేసుకోవడంలో వారు ముందుంటారని గుర్తుచేశారు. పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్‌గా మారడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
తమిళ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుతున్నాం
‘‘కృతజ్ఞత అనేది కేవలం మాటలకే పరిమితం కావొద్దని, నిత్య జీవితంలో అది అంతర్భాగం కావాలని పొంగల్ మనకు గుర్తుచేస్తుంది. మనం జీవించడానికి ఎన్నో ఇస్తున్న భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. పొంగల్ పండుగలో భాగం కావడం గర్వంగా భావిస్తున్నా. ప్రపంచంలో ఇప్పటికీ మనుగడలో ఉన్న ప్రాచీన నాగరికతల్లో తమిళ నాగరికత, సంస్కృతి ఉన్నాయి. ఇది శతాబ్దాల జ్ఞానం, సంప్రదాయాల సమ్మేళనం. చరిత్ర నుంచి పాఠాలను స్వీకరిస్తూ భవిష్యత్తుకు దారిచూపుతున్న మహోన్నత సంస్కృతి ఇది. తమిళ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుతున్నాం.
సాంస్కృతిక మూలాల ద్వారా బలోపేతం అవుతూ మున్ముందుకు సాగుతున్నాం. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సుహృద్భావ బంధం ఉండాలన్న పొంగల్ సందేశాన్ని మనమంతా స్వీకరిద్దాం. భవిష్యత్తు తరాల బాగు కోసం భూమి నిస్సారం కాకుండా రక్షించుకోవడం, జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, వనరులను తెలివిగా, పరిమితంగా ఉపయోగించుకోవడం అత్యవసరం. ఇందులో భాగంగానే మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ వంటి పథకాలు తీసుకొచ్చాం. ఐక్యత, విశ్వాసం మన బలం. భూమిని గౌరవించుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.
సందడి చేసిన ‘పరాశక్తి’ టీమ్
కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో తమిళ సినీ నటులు కూడా సందడి చేశారు. తమిళ చిత్రం ‘పరాశక్తి’లో నటించిన శివకార్తికేయన్, రవి మోహన్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ కుమార్ పొంగల్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పొంగల్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. 1960వ దశకంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసన కార్యక్రమాల ఆధారంగా పరాశక్తి చిత్రాన్ని తెరకెక్కించారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరును ఇందులో ప్రస్తావించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ప్రజలకు మోదీ పొంగల్ శుభాకాంక్షలు
పొంగల్ సందర్భంగా ప్రధాన మోదీ తమిళం, ఆంగ్ల భాషల్లో ప్రజలకు బుధవారం లేఖ రాశారు. కష్టపడి పనిచేస్తూ మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న వారికి కృతజ్ఞతలు తెలియజేసే పండుగే పొంగల్ అని పేర్కొన్నారు. దేశ ప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలు, సౌభాగ్యం, మంచి ఆరోగ్యంతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ పండుగతో వ్యవసాయం, అన్నదాతలు, గ్రామీణ, జీవితానికి బలమైన అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా కుటుంబాలు కలుస్తుంటాయని, ప్రజలు కష్టసుఖాలు కలబోసుకుంటారని, వారి మధ్య బంధం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఐక్యతా స్ఫూర్తిని పొంగల్ మరింత బలోపేతం చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష అయిన తమిళం మన దేశంలో ఉన్నందుకు మనం గర్వించాలని మోదీ ఉద్ఘాటించారు.


