
జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నన్ను కొందరు నక్సలైట్ అన్నందుకు బాధపడలేదు.. నేను ఇచ్చిన తీర్పులో వారు ఒక్క అక్షరం కూడా మార్చలేరు
ఇండియా కూటమి అభ్యర్థిని కాను... ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని
ఎన్నికల సంఘం ఇదే ధోరణితో వెళితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పరిచయ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
తెలుగు ఎంపీలంతా ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఫలానా అని ముద్ర వేస్తూ కొంద రు మాట్లాడుతున్నారు. అలా అంటే ఈ రాజకీయాలు నాకెందుకులే అని వెనక్కు తగ్గుతానేమో అనుకున్నారు. కానీ నేను ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’అని విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ మాట (నక్సలైట్) అన్నందుకు తనకు బాధ కలగలేదని చెప్పారు.
వారు మాట్లాడినంత మాత్రాన తాను సుప్రీంకోర్టు జడ్జిగా ఇచి్చన తీర్పులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చలేరని చెప్పారు. అసలు ఆ తీర్పు గురించి మాట్లాడే ముందు ఒక్కసారి చదివి మాట్లాడాలని హితవు పలికారు. అలా చదివి మాట్లాడితే తనపై ఉపయో గించిన భాషా ప్రయోగం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఇండియా కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల మధ్య పరిచయ కార్యక్రమం జరిగింది.
ఏ పార్టీ సభ్యత్వం తీసుకోను..
ఈ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రా జ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు మసకబారుతున్న సందర్భంలో గొంతెత్తి మాట్లాడే కర్తవ్యం ప్రతి పౌరుడిపైనా ఉంటుందన్నారు. అందుకే తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి అంగీకరించానని చెప్పారు. తాను రాజకీయ ముళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకోలేదని.. భవిష్యత్తులోనూ ఏ పార్టీ సభ్యత్వం తీసుకోనని స్పష్టం చేశారు. తాను రాజకీయేతర వ్యక్తిని కాదని.. రాజ్యాంగంపట్ల విధేయతతో ఓటు వేసే ప్రతి పౌరుడికీ రాజకీయాలతో అవినాభావ సంబంధం ఉంటుందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వివరించారు.
మరింత ప్రమాదంలోకి ప్రజాస్వామ్యం...
దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడికి ఆయుధంగా ఓటు హక్కును ఇవ్వాలని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావించారని, కానీ ఓటరు జాబితాను చిత్తు కాగితంలా మార్చి ఇష్టం ఉన్నవారి పేర్లను జాబితాలో చేర్చి.. ఇష్టంలేని వారి పేర్లు తీసేయడం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఇదే ధోరణితో వెళ్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించను..
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు తాను పార్టీల బలాబలాలను చూసుకోలేదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చెప్పా రు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకను హిమాలయాలపై ఎగురవేశానని చెప్పేంత వెర్రివాడిని కాదని.. కానీ తెలంగాణ ప్రతిష్టకు, ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ఏ పనీ చేయనని చెప్తానన్నారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని, దేశంలోని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థినని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇండియా కూటమిలో లేని ‘ఆప్’సహా మరికొన్ని పార్టీలు తనకు మద్దతిచ్చాయని చెప్పారు.
రెండు విధానాల మధ్య పోటీ: సీఎం రేవంత్
ఈ ఎన్నిక రెండువిధానాల మధ్య జరుగుతోందని.. రాజ్యాం గాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వారు.. రాజ్యాంగాన్ని రక్షించి పేదలందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలనే వారి మధ్య పో టీ జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలుగు గౌ రవాన్ని, ప్రతిష్టను పెంచేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఒ క్కతాటిపైకి రావాలని కోరారు. జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్, వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్, ఒవైసీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతివ్వాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 42 మంది లోక్‌సభ, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.