ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి | Justice Sudarshan Reddy Selected as India Alliance candidate | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

Aug 20 2025 1:49 AM | Updated on Aug 20 2025 1:49 AM

Justice Sudarshan Reddy Selected as India Alliance candidate

ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక

విపక్ష పార్టీల ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే

ఈ ఎన్నిక ‘సైద్ధాంతిక యుద్ధం’ అంటూ అభివర్ణన

ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని వ్యాఖ్య 

ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీ పడనున్న సుప్రీం మాజీ జస్టిస్‌ 

నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు... సెప్టెంబర్‌ 9న ఎన్నికలు 

వ్యవసాయ కుటుంబంలో జన్మించి న్యాయ కోవిదుడిగా ఎదిగిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకా ఆకుల మైలారం ఆయన స్వగ్రామం

‘ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు. రాజకీయాలతో సంబంధం లేని వారిని ఎన్నుకోవాలని వాళ్లు భావించినట్లుంది. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎంపీలను వ్యక్తిగతంగా కలిసి, నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని, ఓటు వేయాలని కోరతా. దేశ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తా’.     
 – ఢిల్లీలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం తీసుకుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బూచిరెడ్డి సుదర్శన్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఇండియా కూటమి నేతలతో కలిసి ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో రెండో అత్యున్నత పదవికి జరగనున్న ఈ ఎన్నికలను ‘సైద్ధాంతిక యుద్ధం’గా ఖర్గే అభివర్ణించారు. 

అందుకే విపక్షాలన్నీ ఐక్యంగా పోటీ పడుతున్నాయన్నారు. కాగా అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్ష అభ్యర్థి, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌తో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పోటీ పడనున్నారు. సెప్టెంబర్‌ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, రాధాకృష్ణన్‌లు బుధవారం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం సంవిధాన్‌ సదన్‌ (పార్లమెంటు పాత భవనం)లో ఇండియా కూటమి సమావేశం జరగనుంది.  

ఏకగ్రీవ నిర్ణయం 
మంగళవారం మధ్యాహ్నం ఖర్గే నివాసంలో, ఆయన అధ్యక్షతన జరిగిన ఇండియా కూటమి భేటీకి విపక్ష పార్టీల నేతలు శరద్‌పవార్, సంజయ్‌ రౌత్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, డెరిక్‌ ఓబ్రియెన్, కనిమొళి, తిరుచ్చి శివ, జాన్‌ బ్రిట్టాస్, ధర్మేంద్ర యాదవ్, ప్రమోద్‌ తివారీ, రజని పాటిల్, అరి్వంద్‌ సావంత్, ఎంఏ బేబీ తదితరులు హాజరయ్యారు. అంతా కలిసి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరును విపక్ష కూటమి అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించింది. ఈ సమావేశానంతరం ఖర్గే విపక్షాల సంయుక్త ప్రకటనను మీడియాకు చదివి విన్పించారు. 

పేదల పక్షపాతి 
‘సుదర్శన్‌ రెడ్డి దీర్ఘకాలం పాటు న్యాయ సేవలందించారు. దేశంలోని ప్రఖ్యాత, ప్రగతిశీల న్యాయవేత్తలలో ఒకరు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశిష్టమైన సేవలు అందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిరంతరం పోరాడారు. ఆయన తీర్పుల్లో పేదల పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ, ప్రాథమిక హక్కుల కాపాడేందుకు కృషి చేశారు. 

విపక్ష పార్టీలన్నీ ఒకే పేరుకు అంగీకారం తెలపడం సంతోషంగా ఉంది. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఎదురవుతుందో అప్పుడు విపక్షాలన్నీ ఏకమై ఇందుకు వ్యతిరేకంగా పోరాడతాయి..’అని ఖర్గే పేర్కొన్నారు.  

దక్షిణాది వర్సెస్‌ దక్షిణాది! 
జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో అనివార్యమైన ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చివరివరకు ప్రయతి్నంచింది. కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలను రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. ఏ కూటమిలోనూ లేని వైఎస్సార్‌సీపీ, బీజేడీ వంటి పార్టీల అధినేతలతో ఈ మేరకు బీజేపీ నేతలు చర్చలు జరిపారు. మంగళవారం సైతం రాధాకృష్ణన్‌ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. 

అయితే ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి దక్షిణాది రాష్ట్రానికే చెందిన రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపాలని నిర్ణయించింది. ఊహించని విధంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. తద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నికను దక్షిణాది వర్సెస్‌ దక్షిణాది అన్నట్టుగా మార్చివేసింది. ఎన్డీయే తమ అభ్యర్థిగా..తమిళనాడుకు చెందిన, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం కలిగిన మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను బరిలోకి దింపిన నేపథ్యంలో.. డీఎంకే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఎలక్టొరల్‌ కాలేజీలో ఎన్డీఏకే బలం 
ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 782 మంది ఓటర్లు ఉన్నారు. ఎవరైనా గెలవాలంటే 394 ఓట్లు అవసరం. కాగా ఎన్డీఏకు లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల (మొత్తం 422) మద్దతు ఉంది. ఇండియా కూటమికి లోక్‌సభలో 234 మంది, రాజ్యసభలో 96 మంది (మొత్తం 330) మద్దతు ఉంది. ఇక ఏ కూటమికీ చెందనివారు 30 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం ఎన్డీఏ ఆధిక్యం సుస్పష్టంగా ఉన్నప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని బరిలోకి దింపాయి. 

వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి.. 
జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ మండలం ఇబ్రహీంపట్నం తాలూకా ఆకుల మైలారం గ్రామంలో బూచిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, అనసూయమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. సుదర్శన్‌రెడ్డికి భార్య పద్మారెడ్డి, ఇద్దరు కుమారులు శశిధర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, కుమార్తె సుమిత (పస్తుతం అమెరికాలో) ఉన్నారు. ఆయన ఆకుల మైలారం గ్రామంతో పాటు యాచారం మండలం కురి్మద్దలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ ప్రాథమిక విద్యను అభ్యసించారు. 

ఆ తర్వాత పదో తరగతి వరకు హైదరాబాద్‌ శాలిబండలోని రిఫైన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో చదివారు. నగరంలోని వివేకవర్ధిని కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదివారు. 1971లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశారు. సిటీ సివిల్‌ కోర్టు (హైదరాబాద్‌), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పలు కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించారు. 

1988 ఆగస్టు 8న హైకోర్టులో రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది (1988–1990)గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా స్వల్పకాలం విధులు నిర్వర్తించారు. ఏవీ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు కార్యదర్శిగా, కరస్పాండెంట్‌గా పనిచేశారు. 1993–94 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

2005 డిసెంబర్‌ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. 2011 జూలై 8న పదవీ విరమణ పొందారు. 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం ఆమోదం పొందిన తర్వాత అదే ఏడాది గోవా తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు. అయితే వ్యక్తిగత కారణాలతో అదే ఏడాది ఆ పదవి నుంచి వైదొలిగారు. 

అందరి మద్దతూ కోరతా 
– ఢిల్లీలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి 
– ఘన స్వాగతం పలికిన విపక్ష పార్టీల ఎంపీలు 
    జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, రఘురాంరెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్‌లతో పాటు రాజీవ్‌ శుక్లా సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తనను ఎంపిక చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎంపీలను వ్యక్తిగతంగా కలిసి, తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా, ఓటు వేయాల్సిందిగా కోరతానని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.  

జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, రఘురామిరెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్‌లతో పాటు రాజీవ్‌ శుక్లా సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు.  

ఆకుల మైలారంలో ఆనందోత్సాహాలు 
కందుకూరు: జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన స్వగ్రామమైన ఆకుల మైలారంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక యువత బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడంతో ఆనందంగా ఉందని వారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన.. గ్రామ పరిధిలోని మాలగూడ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఓ ఇల్లు నిర్మించుకున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వరి పంట, పండ్ల తోటలు పరిశీలించి వెళ్తుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement