
సీఎం రేవంత్‌రెడ్డితో కరచాలనం చేస్తున్న అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ చేతన్ కృష్ణస్వామి
తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి
పీఏఎఫ్‌ఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
న్యూజెర్సీ గవర్నర్ సహా పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు
రాష్ట్రంలో రూ.200 కోట్లతో కొత్త డెయిరీ యూనిట్ పెట్టేందుకు ముందుకొచి్చన గోద్రెజ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామని.. పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నగరం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని గొప్పగా నిర్మిస్తున్నామని తెలిపారు. భావితరాలకు అవకాశాలు సృష్టించడమే తమ ఆలోచన అన్నారు. దేశంలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణ, హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు.
శుక్రవారం ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్‌లో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్‌ఐ) 12వ వార్షిక సదస్సుకు రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన అంశాల గురించి సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అలాగే 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఉద్దేశాలతోపాటు ఇటీవల ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి తెలియజేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు లక్ష్యాల గురించి వివరించారు.
తెలంగాణలో ‘ట్రంప్’ను ప్రజలు పక్కనబెట్టారు...
‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం. ట్రంప్ ఒకరోజు ప్రధాని మోదీని స్నేహితునిగా అభివర్ణిస్తారు. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారు. తెలంగాణలో ఒక ట్రంప్ (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) ఉండేవాడు. ఆయన్ను తెలంగాణ ప్రజలు పక్కనపెట్టారు. రాత్రి వచి్చన ఆలోచనను తెల్లారే అమలు చేయడం సాధ్యం కాదు’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
న్యూజెర్సీ గవర్నర్‌తో భేటీ...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో... పట్టణ రవాణా), మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాల గురించి ఆయనకు తెలియజేశారు. తెలంగాణ రైజింగ్–2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. న్యూజెర్సీ రైల్ అథారిటీ ద్వారా హైదరాబాద్ పట్టణ, ప్రజారవాణా రంగాలకు, తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని సీఎం రేవంత్‌కు మర్ఫీ హామీ ఇచ్చారు.
దావోస్‌కు రావాలని సీఎంకు
డబ్ల్యూఈఎఫ్ చీఫ్ ఆహా్వనం..
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బోర్డ్ బ్రేండేతోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రైజింగ్–2047కు మద్దతిస్తామని సీఎంకు తెలియజేశారు. వచ్చే ఏడాది దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక
సదస్సుకు విచ్చేయాలని రేవంత్‌ను ఆహా్వనించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసే విషయమై చర్చించేందుకు త్వరలో హైదరాబాద్‌కు వస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచి్చన అమెజాన్
అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) చేతన్ కృష్ణస్వామితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులను ‘కళాకార్’కార్యక్రమం కింద మార్కెటింగ్ చేసుకొనేందుకు ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా చేతన్ హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల కోసం 100 విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల విక్రయదారులు వారి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకొనే విషయంలో తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు గోద్రెజ్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో జెర్సీ క్రీమ్ బ్రాండ్ కింద రూ. 200 కోట్లకుపైగా పెట్టుబడితో కొత్త డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు.