
ఆధారాలు లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బీజేపీ ఫోబి యా పట్టుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎంతో సహా ప్రతి ఒక్కరు బీజేపీపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు కలిసి పనిచేశారని, ప దవులు పంచుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వారు బీజేపీకి నీతులు, కథలు చెప్పాల్సిన పనిలేదన్నారు.
కాశేళ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సీబీఐ పరిశీలిస్తోందని, త్వర లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు అభివృద్ధి, విస్తరణ పనులపై ఆయనతో చర్చించారు. అనంతరం తన నివాసంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 26 ప్రాజెక్టులు డీపీఆర్ స్టేజ్‌లో ఉన్నాయని.. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎప్పుడు ప్రాజెక్టులు పూర్తవుతాయనే వివరాలు వెల్లడిస్తామన్నారు.
రేవంత్ వ్యవహారం సరిగాలేదు..
‘మెట్రో విస్తరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని సమంజసంగా లేదు. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ముందు వరుసలో నేనుంటాను. నేను కానీ, కేంద్రం కానీ మెట్రో రాకుండా అడ్డుకోవడం లేదు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విషయంలో అందరికంటే ముందే మేం చురుగ్గా వ్యవహరించాం.
ట్రిపుల్ ఆర్‌కు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నప్పుడు చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతాయి. మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీన్ని వారే తేల్చుకోవాలి. మెట్రో విషయంలో అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది’అని కిషన్‌రెడ్డి తెలిపారు.
రూ.30,425 కోట్లతో 1,174 కిలోమీటర్లకుపైగా జాతీయ రహదారులు
‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఈ సంవత్సరం.. కొత్తగా 767 కిలోమీటర్ల మేర రూ.29,555 కోట్లు విలువైన వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనుంది. దీనికి అదనంగా ఈ సంవత్సరం సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఐఆర్‌ఎఫ్) కూడా మంజూరయ్యాయి. తెలంగాణలో 422 కిలోమీటర్ల సీఐఆర్‌ఎఫ్ రోడ్డుకు రూ.868 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి.
మొత్తం కలిపి 1,174 కిలోమీటర్లకు గానూ.. రూ.30,425 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనులు తెలంగాణలో ప్రారంభమవుతాయి. హైదరాబాద్–శ్రీశైలం రోడ్డు మార్గంలో భక్తులు, పర్యాటకుల సౌకర్యం కోసం.. 4లేన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్, కల్వకుర్తి మధ్యలో 4లేన్ కావాలని అడిగాం. దానిపై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పారు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.