పదవీకాలానికి ముందే ఇద్దరు రాజీనామా
పాలకమండలి నియామకంలో ప్రభుత్వ జాప్యం
ఈవోల ఇష్టారాజ్యంగా పాలనా వ్యవహరాలు
గాడితప్పుతున్న యాదగిరిగుట్ట ఆలయ పాలన
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈవోల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. పాలకమండలి నియామకం లేకపోవడంతో కొందరు ఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2023 నుంచి గుట్టలో పనిచేసిన ముగ్గురు ఈవోల బదిలీలు వివాదాస్పదంగా మారాయి. ఇందులో ఇద్దరు ఈవోలు రాజీనామా చేశారు. 2014 నుంచి ఈవోగా పనిచేసిన గీతారెడ్డి 2023లో రాజీనామా చేశారు.
ఆ తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం. రామకృష్ణారావును ఇన్‌చార్జ్ ఈవోగా నియమించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుట్ట ఆలయం ఆశీర్వచనం విషయంలో తలెత్తిన వివాదంతో రామకృష్ణారావును తొలగించారు. ఆ తర్వాత ఈవోగా వచ్చిన భాస్కర్‌రావు 2024 మార్చిలో బదిలీ అయ్యారు. 2025 ఏప్రిల్‌లో ఐఏఎస్ అధికారి వెంకట్‌రావు ఈవోగా నియమితులయ్యారు. ఆయన పదవీ విరమణ అనంతరం కూడా ప్రభుత్వం ఈవోగా కొనసాగించింది. రెండు రోజుల క్రితం వెంకట్‌రావు అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేశారు. వెంకట్‌రావు ఈవోగా చేరినప్పటి నుంచి దేవస్థానంలో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పొడిగించడం, సస్పెండ్ అయిన ఉద్యోగికి బెనిఫిట్స్ ఇవ్వడం, సదరు ఉద్యోగి ఏసీబీకి పట్టుబడడం, దేవాలయ ప్రసాద విక్రయశాల గోదాంలో చోరీకి బాధ్యులపై సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లం ఘించాడన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. సమస్యలను గాలికొదిలి, వ్యక్తిగత ప్రచారానికి ప్రాముఖ్యతను ఇచ్చాడని ఫిర్యాదులు అందాయి. ఇటీవల అన్నప్రసాద శాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కాదని ప్రారంభోత్సవం చేయించడం వివాదాస్పదమైంది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల విషయంలో ఈవో ఉదాసీనతే ఆయన పదవికి ఎసరు తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
అటకెక్కిన పాలకమండలి
తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట పాలకమండలిని నియమిస్తామని ప్రభుత్వం చట్టం చేసింది. 2025 మార్చిలోనే వైటీడీ బిల్లు పాసైంది. వైటీడీ ఏర్పాటుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది. కానీ ఇంతవరకు పాలవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో పాలన వ్యవహారాల్లో అ«ధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


