కూసుమంచి: ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచగా, పురోగతి సాధించినట్లు తెలిసింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఈనెల 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లో మునగగా మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఘటన జరిగాక కారు నడుపుతున్న వ్యక్తి ఒడ్డుకు చేరి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో కూసుమంచి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
సదరు వ్యక్తి హైదరాబాద్‌లో పోలీసులకు లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని, అదే జరిగితే కేసులో చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు కారు యజమానిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక శ్రీనివాస్ మృతదేహానికి నేలకొండపల్లి ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన నివేదిక వచ్చినట్లు సమాచారం. శ్రీనివాస్ నీట మునగడంతో చనిపోలేదని, ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు ధ్రువీకరించారని తెలిసింది.
ఏదేమైనా మిస్టరీగా మారిన శ్రీనివాస్ మృతి కేసు మరో రెండు రోజుల్లో ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. మృతుడు శ్రీనివాస్ సెల్‌టవర్ల వ్యాపారంలో ఉండగా, ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోగా.. త్వరలోనే కేసు ఛేదిస్తామని కూసుమంచి ఎస్సై నాగరాజు ‘సాక్షి’కి తెలిపారు.


