బుల్లెట్ రైలు.. భారతీయ రైల్వే కలల ప్రాజెక్టు. దేశంలోని ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో నవ్య ఆవిష్కరణ. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడపాలనుకుంటున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజక్టు ఇప్పుడు ఏ దశలో ఉంది? ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా? తదితర అంశాలతో కూడిన ప్రత్యేక కథనం ఇది..
ఖర్చు ఎంతంటే..
భారతదేశ ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ప్రారంభంలో రూ. 1.08 లక్షల కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పుడు దాదాపు రెట్టింపై రూ. 1.98 లక్షల కోట్లకు చేరింది. రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం వ్యయం పెరిగినప్పటికీ, కేంద్ర క్యాబినెట్ నుంచి దీనికి త్వరలోనే తుది ఆమోదం లభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
నిధుల సేకరణ: పెరిగిన భారం ఎవరిపై?
ఈ భారీ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) సుమారు రూ. 88,000 కోట్ల తక్కువ వడ్డీ రుణాన్ని భారత్‌కు అందిస్తోంది. అయితే వ్యయం పెరగడం వల్ల తలెత్తిన అదనపు భారాన్ని భరించడానికి జేఐసీఏ నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో, పెరిగిన రూ. 90,000 కోట్ల అదనపు వ్యయాన్ని భారత ప్రభుత్వమే స్వయంగా భరించాల్సి వస్తుంది.
ఆలస్యానికి గల కారణాలు
వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2022 నాటికే అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే భూసేకరణ ప్రక్రియలో ఎదురైన సమస్యలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు 2029 చివరి నాటికి పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.
మొదటి సర్వీస్ ఎప్పుడు?
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ఆగస్టు 15, 2027న పట్టాలెక్కనుంది. ఇది సూరత్ - బిలిమోరా మధ్య మొదటి విడతలో ప్రారంభం కానుంది. ఈ హై స్పీడ్ రైలు ట్రయల్స్, మొదటి రన్ కోసం రైల్వే శాఖ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
విడతల వారీగా ప్రారంభం
ఈ ప్రాజెక్టును దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలుత సూరత్-బిలిమోరా సెక్షన్, ఆ తర్వాత వాపి-సూరత్, వాపి-అహ్మదాబాద్, చివరగా థానే-అహ్మదాబాద్ సెక్షన్లను ప్రారంభిస్తారు. అత్యంత కీలకమైన ముంబై-అహ్మదాబాద్ కారిడార్ మొత్తం ప్రాజెక్టులో చివరి దశలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
రూట్- స్టేషన్ల వివరాలు
ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల పొడవునా ఈ హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మితమవుతోంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. అవి.. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి.
ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ పాత్ర
బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) పర్యవేక్షిస్తోంది. 2016లో స్థాపితమైన ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ).. ఈ కారిడార్‌కు సంబంధించి నిధుల సమీకరణ, నిర్మాణం, భవిష్యత్తులో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. భారతదేశ రవాణా రంగంలోనే ఇది అత్యంత ఖరీదైన, సాంకేతికతతో కూడిన ప్రాజెక్టుగా నిలవనుంది.
ఆధునిక భారత్ కల
ప్రాజెక్టు వ్యయం పెరిగినప్పటికీ, దేశ ఆర్థిక వృద్ధికి, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ బుల్లెట్ రైలు కీలకం కానుంది. ఈ బుల్లెట్ రైలు.. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, భారత రైల్వేను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ప్రభుత్వం చెబుతోంది.
ఇది కూడా చదవండి: నేడు మరో నూతన సంవత్సరం.. కోలాహలానికి భిన్నంగా..


