మెదక్ జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన ఘటనలో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్సై మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుల్లెబోయిన స్వామి అరవింద పరిశ్రమలో ఫైర్ ఇంజిన్ డ్రెవర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 23న గ్రామ శివారులోని నేరళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి భార్య మౌనికపై అనుమానంతో విచారించగా ఇదే గ్రామానికి చెందిన సంపత్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారిందని చెప్పింది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్తను హతమార్చాలని పథకం రంచించి... గత నెల 22న రాత్రి స్వామి మద్యం తాగి ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా మౌనిక ఆమె ప్రియుడు సంపత్ అతడి గొంతు నులిమి హత్యచేశారు. మృతదేహన్ని బైక్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని నేరళ్లకుంటలో పడేశారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


