బీఆర్‌ఎస్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపాటు
అసత్యాల ప్రచారంతో అవినీతి బురద జల్లుతోంది
రూ.25 కోట్ల కమీషన్లు తినేశామంటూ ప్రచారం చేయడం దుర్మార్గమన్న సీఎం
పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్సే అలాంటి పనులు చేసిందంటూ ధ్వజం
పేదల ఇళ్లు కూలగొడితే తమ పార్టీ సహించదన్న హరీశ్‌రావు
మొదట్నుంచి చివరి వరకు ప్రక్షాళన జరగాలి: అక్బరుద్దీన్
హరీశ్‌రావు మైక్‌ను కట్ చేయడంతో బీఆర్‌ఎస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని తాను కృత నిశ్చయంతో ఉంటే, విపక్ష బీఆర్‌ఎస్ అసత్యాల ప్రచారంతో అవినీతి బురద జల్లుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 1.50 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చామని, రూ.25 కోట్ల కమీషన్లు తినేశామని ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. వాళ్ల కడుపులో విషం మూసీ కాలుష్యం కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు.
కాలి బూడిదయ్యేంత విషపు కళ్లతో చూస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ పునరుజ్జీవంపై పలువురు లేవనెత్తిన ప్రశ్నలపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. అసలు మూసీ ప్రక్షాళన ఇష్టమా? కాదా? చెప్పాలని నిలదీశారు. ప్రక్షాళనకు సహకరిస్తే సూచనలు ఇవ్వాలని, వ్యతిరేకం అయితే ఆ కడుపు మంటకు కారణమేంటో చెప్పాలని అన్నారు.
డీపీఆర్‌లు వచ్చిన తర్వాతే అంచనాలు
‘బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిందేంటో చెప్పాలి. కాంట్రాక్టులు ఇవ్వడం, కమీషన్లు పట్టడం, లిçఫ్టులు, పంపులు పెట్టడం, ఇళ్లలో కనకవర్షం కురిపించుకోవడం, జన్వాడ, మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్‌లు కట్టుకోవడమే కదా చేసింది. తమను వాళ్లలా ఊహించుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు అంతర్జాతీయ కన్సల్టెన్సీ తోడ్పాటు తీసుకుంటున్నాం. అది డీపీఆర్‌లు ఇచి్చన తర్వాతే అంచనాలు వెల్లడిస్తాం. ముందే చెప్పడానికి నేను 80 వేల పుస్తకాలు చదవలేదు. వాళ్ళంత పరిజ్ఞానం లేదు. దుర్గంధ భరితమైన మూసీ పక్కన నివసించాలని ఎవరికీ ఉండదు.
ఎంతో కష్టాల్లో ఉన్న నిరుపేదలే అక్కడ ఉంటారు. అలాంటి వారికి మంచి కాలనీలు కట్టించాలని, వారి పిల్లలకు చదువులు చెప్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, విపక్షం మాత్రం వాళ్లు అక్కడే ఉండాలని కోరుకుంటోంది. విపక్ష నేతలు వర్షాలు ఉన్నప్పుడు మూసీ ప్రాంతంలోని ఇళ్ళల్లో ఎందుకు పడుకోలేదు?. ఇప్పుడైనా సగం కాలిపోయి, కుళ్ళిపోయిన శవాలున్న మూసీ ప్రాంతంలో పడుకోవాలి. నన్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అది ఒక పరిశ్రమ.. అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి..’అని సీఎం చెప్పారు.
మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీరు
‘మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. కంపెనీల కలుíÙత జలాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రక్షాళనే ప్రభుత్వ లక్ష్యం. ప్రక్షాళనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేస్తాం. లండన్ థేమ్స్ నదిని, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి ప్రక్షాళన పనులు పరిశీలించాం.
మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 20 టీఎంసీల గోదావరి జలాలు తరలించి 15 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, 5 టీఎంసీలు మూసీలో నిరంతరం స్వచ్చమైన నీరు పారించేందుకు ఉపయోగిస్తాం. మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తాం. ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ. 4 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచి్చంది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నాం. ఓల్డ్ సిటీ ఎప్పటికీ ఒరిజినల్ సిటీయే. దాన్ని నిర్లక్ష్యం చేయం. మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలి..’అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
బుల్డోజర్లకు అడ్డు పడతాం: హరీశ్‌రావు
బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్‌రావు ఈ అంశంపై చర్చలో పాల్గొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళు కూలగొడితే తమ పార్టీ సహించదని, బుల్డోజర్లకు అడ్డుపడతామని అన్నారు. మూసీలో ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు తొలగించారో, ఎంతమందికి ప్రత్నామ్నాయం చూపారో, ఇంకెన్ని ఇళ్ళు కూల్చాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. మూసీ పునరుజ్జీవం వల్ల నిరాశ్రయులైన వారికి ఇప్పటివరకు ఎంత చెల్లించారో చెప్పాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం కింద డబ్బులు ఇచ్చారా లేదా తెలపాలన్నారు. ఇటీవల వర్షాలు కురిసినప్పుడు మూసీ గేట్లు ఉద్దేశపూర్వకంగా ఎత్తివేసినట్టు తమ దృష్టికి వచి్చందని, ప్రభుత్వమే దీనికి అనుమతించినట్టు తెలిసిందని, ఇందులో వాస్తవం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
సమగ్ర ప్రక్షాళన అవసరం: అక్బరుద్దీన్ ఓవైసీ
మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలను సభ ముందుంచాలని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మూసీ నది ప్రారంభమయ్యే దగ్గర్నుంచి, అది ముగిసే వరకూ ప్రక్షాళన పనులు జరగాలని సూచించారు. హైదరాబాద్‌లో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వీటితో పాటు నగర సంస్కృతిని కాపాడాలని కోరారు.
మైక్ కట్‌తో బీఆర్‌ఎస్ నిరసన
సీఎం ప్రసంగం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్..బీఆర్‌ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. హరీశ్‌రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె కోరడంతో స్పీకర్ అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డికీ ఇదే పరిస్థితి ఎదురైంది. తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. మూసీ పునరుద్ధరణకు సహకరిస్తామని, నిర్వాసితులకు ఇచ్చే పరిహారం గురించి చెప్పాలని తలసాని అన్నారు. తమకు కడపులో విషం ఉందని సీఎం అనడం సరికాదన్నారు. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రి ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని అన్నారు.
అనంతరం హరీశ్‌రావుకు అవకాశం ఇవ్వగా..సభలో తమ హక్కులు కాపాడాలని ఆయన కోరారు. మూసీ కంపుకన్నా ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ ఉందంటూ విమర్శించారు. దీంతో హరీశ్‌రావు మైక్‌ను స్పీకర్ నిలిపివేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా యూరియా కొరతపై బీఆర్‌ఎస్, ఇతర అంశాలపై పలువురు ఇచి్చన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సీఎంపై హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు బాలూ నాయక్, శంకరయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, పాయల్ శంకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.


