
శుక్రవారం ఢిల్లీలో జరిగిన పీఏఎఫ్‌ఐ సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గోదావరి, కృష్ణాలో ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నామో తెలియట్లేదు
ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
‘కాళేశ్వరం’పై విచారణను సీబీఐకి ఇస్తే 48 గంటల్లో తేలుస్తామన్న కిషన్‌రెడ్డి ఎక్కడ?
సరిపడా యూరియా ఇవ్వకుండా రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధిస్తోందని ఆరోపణ
కేసీఆర్, ఎల్ అండ్ టీ వల్లే మెట్రో రైలు అంచనా వ్యయం పెరిగిందన్న సీఎం
సుప్రీం తీర్పునకు అనుగుణంగా ‘స్థానికం’పై ముందుకెళ్తామని వెల్లడి
కండువాలు కప్పినంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదని వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదుల్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వినియోగిస్తున్నామన్న లెక్కలు ప్రభుత్వం వద్ద లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో రాష్ట్రానికి 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నా అందులో ఎంత నీటిని వాడుతున్నామన్న దానిపై స్పష్టత కొరవడిందన్నారు. శుక్రవారం ఢిల్లీలో వివిధ అంశాలపై సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇందులో భాగంగా నీటి వినియోగ లెక్కల గురించి ఆయన వివరించారు.
‘గోదావరిలోని 968 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఎన్ని టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకుంటోందో ఎవరికీ తెలియదు. ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నదీ.. ఎంత ఆయటక్టుకు నీళ్లిస్తున్నదీ తెలియకుండా గత ప్రభుత్వం అంతా గందరగోళం చేసింది. ఒక ప్రాజెక్టు ఆయకట్టును ఇంకో ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టులో కలిపి చూపించింది. దీంతో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు ఉందో, ఎంత నీటిని వినియోగిస్తున్నామో రాష్ట్రం వద్ద లెక్కల్లేవు. అందుకే ఆ లెక్కలు తయారు చేయాలని అధికారులను ఆదేశించాం. అది పూర్తయితేనే తెలంగాణకు మిగిలిన నీటి వాటా ఎంతో తెలుస్తుంది.
ఆ మిగిలిన నీటి వాటాను వినియోగించుకునేలా తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టులను చేపడతాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ఇక కృష్ణాలోనూ పరీవాహకం ఆధారంగా 904 టీఎంసీలను కోరుతున్నామని.. అందులో నికర, వరద, మిగులు జలాలన్నీ కలిపి ఉన్నాయని సీఎం వివరించారు.
‘కాళేశ్వరం’పై సీబీఐ విచారణకు జాప్యం ఎందుకు?
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరినా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఇస్తే 48 గంటల్లో తేలుస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఇంతకాలం అవుతున్నా కనీసం ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేదు? ప్రాజెక్టు లోపాల్లో కుట్రదారులెవరో తేల్చాల్సి ఉన్నా, సమగ్ర విచారణ జరగాల్సి ఉన్నా కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోంది? విచారణ జరగకుండా కేటీఆర్ ఆపుతుంటే దానికి కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది’అని సీఎం ఆరోపించారు.
హైకోర్టు చెప్పినట్లుగా ఈ నెలాఖరులోగా ‘స్థానికం’కష్టసాధ్యం..
స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు విధించిన ఈ నెల 30లోగా నిర్వహించడం కష్టసాధ్యమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపాం. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ అధికారం సుప్రీంకు ఉందా? అని రాష్ట్రపతి సుప్రీంకు రెఫరెన్స్ ఇచి్చంది. ఆ రెఫరెన్స్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థలపై నిరీక్షిస్తాం. ఆ తర్వాతే తదుపరి కార్యాచరణ చేపడతాం’అని సీఎం రేవంత్ తెలిపారు.
కేసీఆర్, ఎల్ అండ్ టీ తప్పులకు ప్రజలపై భారమా?
హైదరాబాద్ మెట్రో విస్తరణలో ఎల్ అండ్ టీ సంస్థ తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు. మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ సహకరించాలని.. లేకపోతే ప్రభుత్వపరంగా ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ‘మెట్రో విస్తరణలో భాగంగా 76 కి.మీ. కనెక్టివిటీ జరగాలి. ఇది పూర్తి కావాలంటే ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం షరతు పెడుతోంది. కానీ మెట్రోతో మాకు నష్టాలు వస్తున్నందున కొత్త పనులు చేయలేమని ఎల్ అండ్ టీ అంటోంది. కేసీఆర్, ఎల్ అండ్ టీ చేసిన తప్పిదాలు, భూసేకరణలో జాప్యం వల్ల రూ. 13 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం కాస్తా రూ. 20 వేల కోట్లకు పెరిగింది. వాళ్లు చేసిన తప్పిదాలకు రాష్ట్ర ప్రజలు భారం భరించాలా? ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టీ డిక్టేట్ చేయజాలదు’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ కోసమే యూరియా డ్రామా...
రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రంపై కక్ష సాధిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్రానికి సీజన్‌లో 9.8 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ 2 లక్షల టన్నుల యూరియాను కేంద్రం సరైన సమయానికి సరఫరా చేయలేదు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌కు తిరిగి జీవం పోసేలా బీజేపీ డ్రామాలాడింది. ఇదే అదునుగా బీఆర్‌ఎస్ ప్రజల్లో యూరియా లేదని ఒక అస్థిరతను సృష్టించడం.. రైతులు ఎక్కువగా కొనుగోళ్లు చేయడంతో సమస్య పెద్దదైంది. బీఆర్‌ఎస్‌ను నిలబెట్టేందుకు కేంద్రం రైతులకు నష్టం చేస్తోంది’అని సీఎం ఆరోపించారు.
కండువాలు కప్పితే పార్టీ మారినట్లు కాదు..
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని స్పీకర్‌కు సూచించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అయితే పార్టీ కండువాలు కప్పుకున్నంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కాదన్నారు. ‘కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను ఈరోజు ఎంతో మందికి కండువాలు కప్పాను. వారికి కప్పిన కండువా ఏదో వారికే తెలియదు. ఎవరి ఇంటికి వెళ్తే ఏం భోజనం పెడతారో ముందే తెలియదు కదా? బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల్లోంచి ప్రతి నెలా రూ. 5 వేలు ఆ పార్టీ ఫండ్‌కు వెళ్తున్నాయి. తమ పారీ్టకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఆ మేరకు సమయం కేటాయించాలని అసెంబ్లీలో హరీశ్‌రావు ఆన్ రికార్డుగా చెప్పారుగా’అని సీఎం గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్‌లో ఆస్తుల గొడవతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు..
బీఆర్‌ఎస్‌లో కవిత ముసలం పుట్టిందని సీఎం అన్నారు. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న పాపం ఊరికే పోదు కదా? అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావులు కలిసి కవితపై మూకుమ్మడిగా దండయాత్ర చేస్తున్నారని.. అయితే ఈ ఆస్తుల గొడవతో తమ పారీ్టకి సంబంధం లేదన్నారు.
మావోలతో చర్చించాలి..
కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ సూచించారు. ఉగ్రవాదులతోపాటు దాయాది దేశమైన పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతున్న కేంద్రం.. మావోయిస్టులతో చర్చిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. వాళ్లూ ఈ దేశ ప్రజలే కదా.. మన అక్కాతమ్ముళ్లే కదా అని పేర్కొన్నారు.