
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills Bypoll) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ ఈ విషయంలో చాలా ముందుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచారం కూడా ముమ్మరంగా చేసుకుంటోంది. కాంగ్రెస్ దాదాపుగా మహమ్మద్ అజారుద్దీన్‌ను ఖరారు చేసినట్లే చేసి.. ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది. ఇక బీజేపీ సరైన అభ్యర్థినే ఎన్నుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో..
ఇప్పటికే హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అభ్యర్థుల పరిశీలన జరిగింది. ఇవాళ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన జూమ్ మీటింగ్‌లోనూ ఈ ఉప ఎన్నిక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇక.. రేసులో ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని త్వరలోనే పీసీసీకి సమర్పించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే.. ఈ నెల 6వ తేదీన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది(Jubilee Hills Congress Candidate).
ఇక ఈ లిస్టులో లోకల్ యంగ్ లీడర్ నవీన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. అనూహ్యంగా రెహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు వచ్చి చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే గత గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గ్రాండ్ విక్టరీకి కారణమైన మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెర మీదకు రావడం గమనార్హం. మరోవైపు..
బీజేపీ పార్టీ కూడా ఆపరేషన్ జూబ్లీహిల్స్‌ను ముమ్మరం చేసింది(Jubilee Hills BJP Candidate). ఇందుకోసం త్రీమెన్ కమిటీ వేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులుకు చోటు కల్పించారు. వీళ్లు గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అతిత్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లంకా దీపక్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పీవీ మనవడు ఎన్వీ సుభాష్, సామాజిక కార్యకర్త మాధవీలత, డాక్టర్ పద్మ విప్పర్తి, కీర్తి రెడ్డి.. ఇలా పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆ రెండు పార్టీలు వారం, పదిరోజుల్లో అభ్యర్థిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.