
సోమవారం విచారించనున్న జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుందని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించడమేనని వంగ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 29న పిటిషన్ దాఖలు చేశారు.
అంతేగాక స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను గోపాల్‌రెడ్డి సవాల్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ వర్గానికి కేటాయించే రిజర్వేషన్లు అయినా మొత్తం 50 శాతానికి మించకూడదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను అతిక్రమిస్తోందని పిటిషన్‌లో ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. దీంతో ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.