
ఫైల్ ఫొటో
ఢిల్లీ: స్వయంగా దేశ ప్రధానినే తమ అభ్యర్థికి ఓటేయాలని అడుగుతున్నారని.. అలాంటిది తాను ఎంపీలను అడగడంలో తప్పేమీ లేదని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి(79) అంటున్నారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. ఓ తెలుగు ఛానెల్‌తో ఆయన మాట్లాడారు.
‘‘ఉత్తర, దక్షిణ భారత దేశం అనే తేడా లేదు. నేను తెలంగాణలో పుట్టా.. కానీ భారతదేశ పౌరుడినే. ఉపరాష్ట్రపతి పదవిని- దేశాన్ని దయచేసి వేరుగా చేసి చూడొద్దు. ప్రజాక్షేత్రంలోకి వచ్చాను. ఇందులో దాపరికం ఏం లేదు. పార్లమెంట్ సభ్యులందరూ విజ్ఞులు. స్వయంగా ప్రధాని తమ అభ్యర్థికి ఓటేయాలని ఎంపీలను అడుగుతున్నారు. అందుకే నేను కూడా నాకు ఓటు వేయాలని ఎంపీలను బహిరంగా కోరుతున్నా..
.. ఉపరాష్ట్రపతి పీఠం.. రాజకీయ వ్యవస్థేం కాదు. అదొక రాజ్యాంగబద్ధమైన పదవి. రాజకీయ వ్యవస్థ కాదనే ఉద్దేశంతోనే అడగ్గానే ఒప్పుకున్నా. రాజకీయ ప్రేరేపిత పరిస్థితుపై మాట్లాడను. ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. నేను పోటీ పడుతోంది ఉప రాష్ట్రపతి పదవి కోసమే. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు కాదు. ఆ పదవికి ఉన్న గౌరవం కాపాడాల్సి ఉంది.
పార్లమెంట్ సభ్యుల్లో విభజన జరిగిందని నేను అనుకోవడం లేదు. నేను గెలవాలని ఎంపీలు కోరుకుంటున్నారు. నాకు మద్దతు ఇస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడిని అనుకుంటే నాకు ఓటేయండి. భారతీయ రాజకీయ వ్యవస్థలో మార్పు జరగాలి. రాజ్యాంగ పరిరక్షకు కృషి చేస్తా. సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుతున్నా’’ అని ఎంపీలకు విజ్ఞప్తి చేశారాయన.
ఇదిలా ఉంటే.. ఉపరాష్ట్రపతి పదవికి నామినేన్ల దాఖలుకు రేపు ఆఖరి తేదీ. ఇవాళ ఇండియా ఎంపీల కూటమి సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పాల్గొంటారని.. రేపు(గురువారం) తన నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.