
( ఫైల్ ఫోటో )
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్‌లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు.
పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్‌ఎస్ (4 రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !మాత్రమే ఉంది. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగ్గా, అటు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది.
‘తమిళనాడు మోదీ’గా పేరు
సి.పి.రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. 16 ఏళ్లకే ఆరెస్సెస్‌లో చేరారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్‌తో ఆయనకు బలమైన అనుబంధముంది. అభిమానులు ఆయనను ‘తమిళనాడు మోదీ’ అని పిలుస్తుంటారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీలో బలమైన ఓబీసీ నేతగా ఎదిగిన ఆయనకు పార్టీ పలుమార్లు గవర్నర్‌గా అవకాశమిచ్చింది.
జార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సేవలందించారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ 1974లో జనసంఘ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా, సభ్యుడిగా చేశారు. స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం వహించారు. 2004 నుంచి మూడేళ్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 93 రోజులపాటు 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర చేశారు.
మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా: సుదర్శన్‌రెడ్డి
మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తానని ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమిని స్వీకరించాలన్నారు. ‘ ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్య బలం.. కేవలం విజయంలో మాత్రమే లేదు. చర్చలు, నిరసన ద్వారా కూడా ప్రజాస్వామ్యం బలపడుతుంది. విజయం సాధించిన రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు’ అని తెలిపారు.
రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపిన అమిత్ షా
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నాయకుడని ఆయన కొనియాడారు.
ఖర్గే శుభాకాంక్షలు
రాధాకృష్ణన్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్‌రడ్డి పోరాటానికి సైతం కృతజ్ఞతలు తెలిపారు. ‘ ఇది ఎన్నిక మాత్రమే కాదు.. ఇది సిద్ధాంతాల యుద్ధం. పార్లమెంట్ సంప్రదాయాలను రాధాకృష్ణన్ కాపాడతారని ఆశిస్తున్నా. ప్రతిపక్షాలకు సరైన సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.