
తిరోగమనంలో ఉన్న వ్యవస్థ మూల స్తంభాలను సరిదిద్దాలి
మార్పునకు నేను దోహదపడతానేమోనన్నభావనతోనే బరిలోకి..
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరి విధుల్లో మరొకరు జొరబడకుండా ఉంటే వ్యవస్థలన్నీ బాగానే ఉంటాయి. కానీ మన దగ్గర ఇప్పుడదే లోపిస్తోంది. ‘‘పార్లమెంటులో జరిగే చర్చల్లో మెజారిటీ, మైనారిటీ పార్టీలన్న భేదం చూపటం మొదలుపెడితే అదే రోజు ప్రజాస్వామ్యం అంతమైనట్టే..’’అన్న మన తొలి లోక్‌సభ స్పీకర్ గణేశ్ మౌలాంకర్ మాటలు గుర్తొస్తున్నాయి. పార్లమెంటులో ఎవరు మాట్లాడాలో, ఎవరు మా ట్లాడొద్దో శాసిస్తున్నారు. అంతా వారిష్టం అన్నట్టుగా కొనసాగుతోంది. చర్చ, సంభాషణకు వీల్లేకుండా పోయింది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది.
ఆ మార్పునకు నేనేమన్నా దోహదపడతానేమోనన్న భావనతోనే ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించాను..’అని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలస్తంభాల ప్రతిష్ట మసకబారుతోందని, అవి తిరోగమనంలో ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆ యన పాల్గొన్నారు. తాను ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అంగీకరించటానికి దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
పెడధోరణిని నియంత్రించాలి
నేను ఏ రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తిని కాను. భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో చేరను. దేశంలో 63.7 శాతం జనాభాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండటమంటే మెజార్టీ ప్రజల అభ్యర్థిగా ఉండటమేనని భావిస్తూ అంగీకరించా. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు స్థానం లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 30 రోజుల్లోనే ఓటర్ల జాబితా రూపకల్పన కసరత్తు మొదలైంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అప్పట్లో జాబితా రూపొందించారు. వయోజనులను జాబితాలో ఎలా చేర్చాలనే ప్రధాన కర్తవ్యంతో ఆ కసరత్తు జరిగింది. కానీ ప్రస్తుతం జాబితా నుంచి పేర్లు ఎలా తొలగించాలి అన్నదే ముఖ్యంగా మారింది. ఆ పద్ధతిని ప్రశ్నించాల్సి ఉంది.
ఇక్కడి వారు అండగా ఉంటారన్న నమ్మకం ఉంది..
నేను 53 సంవత్సరాలుగా రాజ్యాంగ పుస్తకాన్ని వెంట మో స్తున్నాను. అన్నింటికీ అందులో సమాధానం ఉంటుందని బలంగా నమ్ముతాను. నేను ఉప రాష్ట్రపతిగా విజయం సాధి స్తే, దాని ప్రకారమే నడుచుకుంటాను. ఎలక్టోరల్ కాలేజీలో పార్టీలకు సభ్యత్వం ఉండదు, వాటి ప్రతినిధులకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. వారు పార్టీలకతీతంగా ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారని భావిస్తున్నా.
రాజకీయ పదవి కాదు..
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌కు మద్దతివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. శివసేన చీఫ్ ఉద్ధవ్ థ్రాక్రేను కోరినట్టు తెలిసింది. అయితే ఆ సమయంలోనే నేను ఉద్ధవ్‌ను కలిశాను. ఫడ్నవీస్ అభ్యర్థనకు మీరెలా స్పందిస్తారని ఆయనను విలేకరులు అడిగారు. దీంతో సుదర్శన్‌రెడ్డితో భేటీ ముగిశాక నేను ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వమని కోరతాను అని ఆయన అన్నారు.
ఆయన తీరు నాకు ఆసక్తిగా అనిపించింది. ఇండియా కూటమిలో కాకుండా తటస్థంగా ఉన్న విపక్ష పార్టీలు నాకు మద్దతు తెలిపినందున నేను ఇండియా కూటమి అభ్యర్థిగా కాకుండా విపక్షాల అభ్యర్థిగా బరిలో ఉన్నాను. రాజకీయ ముళ్ల కిరీటం మీకెందుకు అని కొందరు నా అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఉప రాష్ట్రపతి పదవి రాజకీయ పదవి కాదు, అది ఏ పార్టీకి సంబంధం లేనిది. అందుకే దాన్ని నేను రాజకీయ ముళ్లకిరీటంగా భావించటం లేదని చెప్పా.
నిర్భయంగా.. నిష్పాక్షికంగా పనిచేస్తా
దేశంలోని ఎంపీలకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి లేఖ
ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభకు చైర్మన్‌గా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను బాధ్యత వహిస్తానని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు. భయం, పక్షపాతం లేకుండా పనిచేస్తానని, గౌరవం, మర్యాద, సంభాషణ, సమన్వయం అనే విలువలతో ముందుకెళతానని వెల్లడించారు. దేశంలోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సోమవారం ఆయన లేఖ రాశారు ఈ లేఖను తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘రాజ్యాంగ పరిరక్షణే దేశానికి నిజమైన బలమని నా జీవితం నాకు తెలియజేసింది. ఈ ఎన్నిక ఇద్దరు వ్య క్తుల మధ్య పోటీ కాదు. సిద్ధాంతపరమైన పోరాటం. సెప్టెంబర్ 9వ తేదీన జరిగే ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వండి. ’ అని ఆ లేఖలో సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.