
ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి
సాక్షి, చెన్నై: తనను ఆదరించి గెలిపిస్తే ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని విపక్షాల ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. తమిళనాడులోని ఎంపీల మద్దతును కూడగట్టుకునేందుకు చెన్నైలో ఆదివారం సాయంత్రం సుదర్శన్ రెడ్డి పర్యటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో సమావేశమయ్యారు.
చెన్నై టీనగర్‌లోని ఓ హొటల్‌లో జరిగిన సమావేశంలో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, వీసీకే తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ‘‘ నేనిప్పుడు నా గురించి చెప్పుకోదల్చుకోలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేనిచ్చిన తీర్పులనూ ప్రస్తావించదల్చుకోలేదు. నా తీర్పుల కంటే ఇప్పుడు మీరు నా విషయంలో ఇచ్చే తీర్పు(ఓటు వేయడం) అత్యంత కీలకం. నాకు అవకాశం ఇస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా’’ అని సుదర్శన్ రెడ్డి చెప్పారు.