తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్‌హాసన్ (Kamal Haasan), రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్‌స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు.
రజనీ హీరోగా, కమల్ నిర్మాతగా
అయితే దీనికంటే ముందు కమల్‌హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.
సాయిపల్లవి?
పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


