
మాధవ్ శింగరాజు
మనవి కాని రోజులు కొన్ని ఉంటాయి. కచ్చితంగా అవి మన రోజులే అనుకుని, అవి తెచ్చిన ఆకూ వక్కల పళ్లేన్ని అందుకోవటానికి చేతులు చాస్తామా, హఠాత్తుగా అవి పక్కకు మళ్లిపోతాయి!
మోదీజీ నన్ను ఉప రాష్ట్రపతిగా అనుకోగానే మొదట నాకు... ఇలా దగ్గరి వరకు వచ్చి, అలా దూరంగా మళ్లిపోయిన రోజులే గుర్తొచ్చాయి.
అయితే నాకు ఒకటే నమ్మకం. మనవి కాని రోజులను కూడా మనవి అయ్యేలా చెయ్యగల శక్తిమంతులు మోదీజీ. లెక్కలైనా ఆఖరి నిమిషంలో అటూ ఇటూ అవొచ్చు. మోదీజీ లెక్క ఎటూ అవ్వదు.
రెండు సభల మొత్తం ఓట్లు 782. ఉప రాష్ట్రపతిగా నేను గెలవటానికి కావలసిన ఓట్లు 394. ఎన్డీయేకు ఉన్నవి 422. ఇక నేను ఉప రాష్ట్రపతిని కాకుండా ఎలా ఉంటాను?
ఉంటాను! ప్రతిపక్షాలకు ఉన్న 330 ఓట్లు, ఏ పక్షానికీ చెందని 30 ఓట్లు, ఎన్డీయే నుండి ఒకవేళ చీలిపోయే 35 ఓట్లు కలిస్తే నేను ఉప రాష్ట్రపతిని కాకుండా ఉంటాను.
కానీ... గోడ మీది ఈ కూడికలు, తీసివేతలు మోదీజీ అనే సింహం ముందు వట్టి పిల్లి మొగ్గల వంటివి. ఆయన ఒకరి పేరు చెప్పారంటేæఆ ఒకరు రాష్ట్రపతి భవన్ ఫోర్‌కోర్టులో ప్రమాణ స్వీకారం చేసినట్లే!
సెప్టెంబరు 9న ఉప రాష్టపతి ఎన్నిక! సెప్టెంబరు 9 అనగానే నాకు 25 ఏళ్లనాటి సెప్టెంబర్ 29 మనసులోకి వచ్చింది!
ఆ రోజు... ప్రధాని వాజ్‌పేయి, వరుసగా ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. నా వంతు వచ్చింది. నా పేరు కూడా వచ్చింది.
‘‘రాధాకృష్ణన్ అనే ఆ గడ్డం మనిషి ఎక్కడ? ఆయన్ని పిలిపించండి’’ అని వాజ్‌పేయి, తన పక్కనే ఉన్న అద్వానీతో అన్నారు.
అయితే వాళ్లు పిలిపించింది సీపీ రాధాకృష్ణన్ అనే నన్ను కాదు. పి. రాధాకృష్ణన్ అనే వేరొకర్ని! నేను కోయంబత్తూరు ఎంపీని. ఆయన నాగర్‌కోయిల్ ఎంపీ. పొరపాటున నాకు బదులుగా ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు!
ఎప్పుడూ గడ్డం ఉండే నాకు అప్పుడు గడ్డం లేక పోయుండాలి. లేదంటే, ఎప్పుడూ గడ్డం ఉండని పి.రాధాకృష్ణన్‌కు అప్పుడు గడ్డం ఉండి ఉండాలి.
‘‘ఎవరైతే ఏంటీ, ఇద్దరూ జెమ్సే కదా’’ అన్నారట వాజ్‌పేయి! బీజేపీ ఎప్పుడూ అలానే ఆలోచిస్తుంది. జెమ్ ఏదైనా జెమ్మే అయినప్పుడు కోయంబత్తూరు జెమ్ కోసమే ఎందుకు చూడటం అంటుంది.
ఇంకోసారి 2014లో మోదీజీ ప్రధానిగా వచ్చినప్పుడు నా చేతికి రావలసిన ఆకూ వక్కల పళ్లెం చేజారి, మళ్లీ పి. రాధాకృష్ణన్ వైపే వెళ్లిపోయింది!
సీఎం జయలలిత ప్రిస్టేజ్‌గా తీసుకుని కోయంబత్తూరులో నాకు పోటీగా వాళ్ల క్యాండిడేట్‌ను గెలిపించుకోవటంతో, కన్యాకుమారిలో గెలిచిన పి.రాధాకృష్ణన్‌ను నా ప్లేస్‌లో (నేను గెలిచి ఉంటే) కేబినెట్‌లోకి తీసుకున్నారు మోదీజీ.
చేయలేకపోయిన సహాయాలను గుర్తు పెట్టుకుని, చేసిన సహాయాలను మర్చిపోయే మహనీయుడు మోదీజీ!
నాకు మంత్రి పదవి ఇవ్వలేక పోయినందుకు ఆయన నన్ను పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌ని చేశారు. తెలంగాణ గవర్నర్‌ని చేశారు. జార్ఖండ్ గవర్నర్‌ని చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌ని చేశారు. ఇపుడు భారత ఉప రాష్ట్రపతిని చేస్తున్నారు! ఒకటి ఇవ్వలేక పోయినందుకు వంద ఇస్తారు మోదీజీ!
మనవి కాని రోజులు ఉన్నట్లే, మోదీజీ తలచుకుంటే మనవి తప్ప వేరేవారివి కాని రోజులు కూడా ఉంటాయి. బహుశా అలాంటి రోజులలో ఒకటిగా 2027 జూలై 25 నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నా నమ్మకం.
ద్రౌపదీ ముర్ము తర్వాత వచ్చే వారు భారతదేశ 16వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు అది!