
పూర్తయిన నామినేషన్ల పరిశీలన
న్యూఢిల్లీ: దేశ 17వ ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9వ తేదీన జరిగే ఎన్నిక బరిలో అధికార ఎన్‌డీయే బలపరిచిన సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మిగిలారు. ఈ ఇద్దరు అభ్యర్థులు అందజేసిన నాలుగేసి సెట్ల నామినేషన్ పత్రాలు సరిగ్గా ఉన్నాయని ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ తెలిపారు.
వీటిని అంగీకరించామని చెప్పారు. శుక్రవారంతో నామినేషన్ల పరిశీలనకు గడువు ముగియడంతో, దక్షిణాదికే చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ ఖరారైనట్లయింది. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సీపీ రాధాకృష్ణన్, సుదర్శన్‌రెడ్డిల నామినేషన్లు మినహా సరిగా లేని మిగతా అన్ని నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వివరించారు.