
ఆసియాకప్-2025 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన పాకిస్తాన్ వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరపున ఆడేందుకు రిజ్వాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో ప్రకారం.. సెయింట్ కిట్స్ జట్టులో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ పేసర్ ఫజల్హాక్ ఫరూఖీ స్ధానాన్ని రిజ్వాన్ భర్తీ చేయనున్నాడు. ఫరూఖీ ఆసియా కప్‌కు ముందు యూఏఈ, పాకిస్తాన్‌తో జరిగే ట్రైసిరీస్ ఆడేందుకు అఫ్గాన్ జట్టులో చేరనున్నాడు.
ఈ క్రమంలోనే రిజ్వాన్‌ను సెయింట్ కిట్స్ యాజమాన్యం తమ జట్టులో తీసుకుంది. ఈ విషయంపై మరో 24 గంటల్లో అధికారికంగా ప్రకటన వెలువడనుంది. అయితే రిజ్వాన్‌కు ప్రస్తుతం వేరే కమిట్‌మెంట్స్ లేకపోవడంతో ఈ ఏడాది సీపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది.
కాగా సీపీఎల్‌లో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడనుండడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ ఏడాది సీపీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఉసామా మీర్, అబ్బాస్ అఫ్రిది. ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్, నసీమ్ షా, సల్మాన్ ఇర్షాద్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగమయ్యారు. ఇప్పుడు రిజ్వాన్ వారి సరసన చేరనున్నాడు.
కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ కాంట్రాక్ట్ ఆటగాళ్లను 12 నెలల వ్యవధిలో రెండు టీ20 లీగ్‌లలో మాత్రమే పాల్గొనడానికి అనుమతి ఇస్తుంది. రిజ్వాన్ ఇప్పుడు సీపీఎల్, ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్ 2025-26లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడనున్నాడు.
దీంతో ఈ 12 నెలల కాలానికి రిజ్వాన్ ఫ్రాంచైజీ లీగ్‌ల కోటా పూర్తి కానుంది. రిజ్వాన్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 286 టీ20లు ఆడి 43 సగటుతో 8421 పరుగులు చేశాడు. అయితే ఇటీవల కాలంలో అతడి ఫామ్ దిగజారడంతో పాక్ టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి తిరిగి టీ20 జట్టులోకి రావడమే లక్ష్యంగా రిజ్వాన్ ముందుకు వెళ్తున్నాడు.
చదవండి: Prithvi Shaw: తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలం