
బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ 2025లో సంచలనం నమోదైంది. పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ లాంటి స్టార్లు ఉన్న మహారాష్ట్రను చిన్న జట్టు ఛత్తీస్‌ఘడ్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్ సంజీత్ దేశాయ్ (93) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. శుభమ్ అగర్వాల్, అవ్నీశ్ సింగ్ ధలీవాల్ ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో విక్కీ ఓస్త్వాల్, హితేశ్ వలుంజ్ తలో 3 వికెట్లు తీశారు.
అరంగేట్రంలోనే మెరుపు సెంచరీ చేసిన పృథ్వీ షా
అనంతరం బరిలోకి దిగిన మహారాష్ట్ర.. అరంగేట్రం ఆటగాడు పృథ్వీ షా మెరుపు సెంచరీతో (111) ఆదుకోవడంతో 217 పరుగులు చేయగలిగింది. షా రాణించినా మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఛత్తీస్‌ఘడ్‌కు 35 పరుగులు కీలక ఆధిక్యం లభించింది. దేశవాలీ క్రికెట్‌లో ముంబై తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో షా మహారాష్ట్రకు మారిన విషయం తెలిసిందే.
చెలరేగిన మహా బౌలర్లు
35 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్‌ఘడ్.. మహారాష్ట్ర బౌలర్లు విక్కీ ఓస్త్వాల్, హితేశ్ వలుంజ్ (థలో 5 వికెట్లు తీశారు) ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది.
ఘోరంగా విఫలమైన షా, రుతురాజ్
అనంతరం 185 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మహారాష్ట్ర అనూహ్యంగా 149 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పృథ్వీ షా రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.
బావ్నే ఒంటరిపోరాటం వృధా
కెప్టెన్ అంకిత్ బావ్నే ఒంటరిపోరాటం (66) చేసినా మహారాష్ట్రను గెలిపించలేకపోయాడు. 36 పరుగుల తేడాతో ఛత్తీస్‌ఘడ్ మహారాష్ట్రను ఓడించింది. శుభమ్ అగ్రవాల్ మహారాష్ట్రను దెబ్బేశాడు.