
వైమానిక దాడులు, ఫిరంగి కాల్పులు..
భయంతో నగరం నుంచి జనం పలాయనం
గాజా నగరం: గాజా నగరాన్ని ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ బలగాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. హమాస్‌కు గట్టి పట్టున్న గాజాను ఆక్రమించుకునే ప్రణాళిక మొదటి దశలో భాగంగా గురువారం ఇజ్రాయెల్ బలగాలు నగర శివారులోకి ప్రవేశించాయి. సెపె్టంబర్ మొదటి వారం నుంచి మొదలయ్యే క్షేత్రస్థాయి సైనిక చర్యకుగాను ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 వేల రిజర్వు బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే సైనిక చర్యలో పాలుపంచుకుంటున్న మెజారిటీ జవాన్ల స్థానంలో వీరు విధులు నిర్వర్తిస్తారు. అంతేకాకుండా, మరో 20వేల మంది సైనికుల విధులను ప్రభుత్వం పొడిగించనుంది. పది లక్షలకు పైగా జనాభా కలిగిన గాజా నగరంపై గత కొన్ని రోజులుగా బాంబింగ్, ఫిరంగి కాల్పులు కొనసాగుతున్నాయి.
దీంతో శివారు ప్రాంతాలైన జెయిటౌన్, సబ్రాల నుంచి వందలాదిగా పాలస్తీనియన్లు నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రాణభయంతో వలసవెళ్తున్నారు. ‘బాంబు ల మోత, పేలుళ్లు, ఫిరంగి కాల్పులు, యుద్ధ విమానాల రొద, అంబులెన్సులు సైర న్లు, జనం ఆర్తనాదాలతో మా ప్రాంతం రాత్రంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది’అని అహ్మద్ అల్–షాంటి తెలిపారు. బాంబుల శబ్దాలకు మా ఇళ్లు ఊగిపోతున్నాయి. కానీ, మేము ఎక్కడికి వె ళ్లాలి? అని ఆయన ప్రశ్నించారు. ‘గత ఒక్క రాత్రి మాత్రమే కాదు. వారం రోజులుగా ఇదే తంతు. గాజాలోని వారెవరికీ కంటిపై కనుకు లేదు. ఫిరంగి కాల్పులు, వైమానిక దాడులు ఆగలే’అని చెప్పారు. సైనిక చర్యను ప్రారంభించేందుకు వీలుగా
జెయిటౌన్, జబాలియా ప్రాంతాల్లో బుధవారం నుంచే బలగాలు తమ పనిని ప్రారంభించాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. సైన్యం ముందుగా కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా ముట్టడిస్తుందన్నారు. గాజా నగరంలోని లక్షలాది మందిని ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ బలగాలు తీవ్ర ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గాజా నగరంలోని వారిని ఖాళీ చేయించి, ఉత్తరగాజాలో పునరావాసం కలి్పంచాలని ఆరోగ్య యంత్రాంగం, అంతర్జాతీయ సహాయ సంస్థలకు సైతం తాము ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. ఖాళీ చేసి వెళ్లే వారికి పునరావాసం కల్పించేందుకు అవసరమైన టెంట్లను సైతం సిద్ధం చేసి ఉంచామని చెబుతోంది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలను జారీ చేయలేదు.
ఖండించిన గుటెర్రస్.. మండిపడ్డ హమాస్
ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్ ఇజ్రాయెల్ చర్యను తీవ్రంగా ఖండించారు. మరణాలు, విధ్వంసాన్ని ఆపేందుకు వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడులు ఎదురవుతున్నా ఇజ్రాయెల్ మాత్రం ముందుగా ప్రకటించిన విధంగానే గాజా నగర ముట్టడి కొనసాగుతుందని ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక చర్యపై హమాస్ మండిపడింది.
నగరంలోని అమాయకులపై క్రూరమైన యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కొనసాగిస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. మధ్యవర్తులు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను సైతం ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. మిలటరీ ఆపరేషన్ కారణంగా హమాస్ వద్ద సజీవంగా మిగిలి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న భయాందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ తీవ్రమైన మానవీయ సంక్షోభం నెలకొని ఉండగా, తాజా చర్యలు పరిస్థితిని మరింతగా దిగజార్చే ప్రమాదముందంటున్నారు.
అలసిపోయిన ఇజ్రాయెల్ ఆర్మీ
గాజాలోని హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించే లక్ష్యంతో మొదలైన యు ద్ధానికి రెండేళ్లయినా ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు విధుల్లోకి పిలిపించిన సైనికుల్లో కొందరు అసంతృప్తితో ఉన్నా రని ఆర్మీ చీఫ్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైనికులు ఆర్మీని విడిచి వెళ్లే ప్రమాదం సైతం ఉందని చెబుతున్నారు. సైన్యంలోని కనీసం 40 శాతం మంది ఇకపై విధుల్లో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని, కేవలం 13 శాతం మందే ఆసక్తితో ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. మెజారిటీ ప్రజలు సైతం యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నారు. అతివాదులైన యూదులు కొందరు సైన్యంలో చేరేందుకు నిరాకరిస్తున్నారు. వారిని కూడా బలవంతంగా సైన్యంలో చేర్చేందుకు చట్టాన్ని తీసుకురావడం సైతం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేందుకు కారణంగా మారింది.