
వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన సీపీఐ అగ్రనేత
విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధం
పార్టీలో వివిధ హోదాల్లో సేవలు.. ప్రదాన కార్యదర్శిగానూ బాధ్యతలు
నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీ..
సురవరం మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, పలువురు ప్రముఖులు, పార్టీ నేతల సంతాపం
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్/ నల్లగొండ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి(83) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో
సుధాకర్‌రెడ్డి మరణించినట్లు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు. ఆయనకు భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్‌రెడ్డి గతంలో పార్టీలో అత్యున్నత పదవి అయిన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సురవరం మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా..రెండుసార్లు ఎంపీగా
సుధాకర్‌రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండ్రావుపల్లిలో సురవరం వెంకట్రామ్‌రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. అయితే ఆయన సొంతూరు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని కంచుపాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కర్నూలు జిల్లాలోని ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
సీపీఐ అనుబంధ ఆల్ ఇండియా విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అంతకుముందు 1966లో ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా.. 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984, 1990లలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994లోనూ కర్నూలులోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.
అయితే 1998 (12వ లోక్‌సభ), 2004 (14 లోక్‌సభ)లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా, 2012లో పాటా్నలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా ఆయననే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004లో ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (కారి్మక) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
విద్యుత్ చార్జీల ఆందోళనలో కీలక పాత్ర
2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచగా.. దీనిపై వామపక్షాలు పెద్దయెత్తున పోరాటం నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళనల్లో సురవరం కీలక పాత్ర పోషించారు. ఎంపీగా పార్లమెంటులో కారి్మకులు, రైతులు, కూలీలు, పేదల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కులు, ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించారు. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. నిరాడంబర జీవనశైలి, ఆచరణాత్మక రాజకీయ దృక్పథం ఆయన ప్రత్యేకత. దేశంలో వామపక్ష శక్తుల ఐక్యత కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి ఈయనకు పెదనాన్న.
మహబూబ్‌నగర్‌లో జననం..నల్లగొండతో అనుబంధం
సురవరం సుధాకర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జని్మంచినా నల్లగొండతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీ కార్యక్రమాలైనా, రాజకీయాలైనా నల్లగొండ గడ్డ నుంచే క్రియాశీలంగా వ్యవహరించారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొంది సేవలందించారు. ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంగా అనేక వామపక్ష పోరాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2024 డిసెంబర్‌లో నల్లగొండలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగసభలో పాల్గొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఆయన సభలో పాల్గొని మాట్లాడారు. జాతీయ నాయకులతో కలిసి వేదికపై ప్రసంగించారు.
చిరస్మరణీయుడు సురవరం
సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సీపీఐ పార్టీకే, తెలంగాణకు, దేశ వామపక్ష రాజకీయ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ నేతలు నివాళులు అర్పించారు.
గొప్ప నాయకుడిని కోల్పోయాం: సీఎం రేవంత్
సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్ధంచారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుధాకర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగిప గొప్ప నాయకుడని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేశారని కొనియాడారు.
కేసీఆర్, సీపీఐ నేతల సంతాపం
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సురవరం మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, నర్సింహ, కలవేణ శంకర్, మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు సంతాపం ప్రకటించారు.
కాంగ్రెస్ నేతల సంతాపం
సుధాకర్‌రెడ్డి మృతిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కమ్యూనిస్టు నాయకుడిగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన సుధాకర్ రెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు సంతాపం ప్రకటించారు.