
అక్కడ అత్యంత తీవ్రమైన కరువు
యూఎన్ డబ్ల్యూఎఫ్‌పీ చీఫ్ అధికారిక ప్రకటన
తక్షణం స్పందించకపోతే మరింత విస్తరిస్తుందని హెచ్చరిక
గాజా స్ట్రిప్: రెండేళ్ల యాజన్.. గాజా నగరంలోని బీచ్‌లో ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్నాడు. ఆ శిబిరానికి రెండు నెలలుగా పిండే కాదు.. ఎలాంటి ఆహార సహాయం అందడం లేదు. విశాలమైన అతని కళ్లు.. ఆహారం కోసం ఎదురుచూసి.. చూసి.. అలసటతో బరువెక్కాయి. ఎముకలు తేలిన శరీరం అతని ఆకలిని చెబుతోంది. ఏడవడానికి కాదు కదా.. చివరికి తిండి తినడానికి కూడా ఓపికలేక.. చిరిగిపోయిన పరుపుపై జీవచ్ఛవంలా కూర్చున్నాడు.
ఇది ఒక్క యాజన్ స్థితి కాదు.. గాజా స్ట్రిప్‌లోని పిల్లలందరి సామూహిక దుంఖః. ప్రస్తుతం గాజాలో పోషకాహార లోపం వేగంగా వ్యాపిస్తోంది. గాజా నగరంలో ఆకలి మరణాలు ఫిబ్రవరి నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం గాజాలో 5లక్షల మంది తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిండీ మెక్ కెయిన్ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో అధికారికంగా కరువు నిర్ధారించడం ఇదే మొదటిసారి.
రాబోయే రోజుల్లో ఇది గాజా గవర్నరేట్ నుంచి డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్‌కు వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ‘రోజుల తరబడి తినడానికి ఏమీ లేక లక్షలాది మంది బతుకీడిస్తున్నారు. పోషకాహార లోపం స్థాయి వేగంగా పెరుగుతోంది. ఆకలి మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో తక్షణ, పూర్తి స్థాయి మానవతా సాయం అవసరమని ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పాయి. కరువును ఎలాగైనా ఆపాలని ఆమె పిలుపునిచ్చారు. ఆ ప్రజల ప్రాణాలు కాపడేందుకు అడ్డంకులు లేని మానవతా సహాయం, తక్షణ కాల్పుల విరమణ అవసరమని సూచించారు. లేని పక్షంలో సెప్టెంబర్ చివరి నాటికి, గాజా స్ట్రిప్ అంతటా దాదాపు 7 లక్షల మంది కరువును ఎదుర్కొంటారని ఆమె హెచ్చరించారు.
ప్రాణాంతకంగా మారిన పోషకాహార లోపం
రెండు సంవత్సరాల సంఘర్షణ ప్రజలను పదేపదే నిరాశ్రయులను చేస్తే.. మానవతా సాయంపై ఆంక్షలు ప్రజలను ఆకలిలోకి నెట్టాయి. ఇక్కడ ఆహారం దొరకడం లేదు. జూలై, మే నెలతో పోలిస్తే ప్రజలు రెట్టింపు సంఖ్యలో ఆకలితో అలమటిస్తున్నారు. ఇక గాజా నగరంలో మూడు రెట్లు ఎక్కువైంది. ప్రతి ముగ్గురిలో ఒకరికి రోజుల తరబడి ఆహారం దొరకడం లేదు. దొరికిన కొద్ది మొత్తంతో పిల్లల కడుపు నింపి, పెద్దలు పస్తులుంటున్నారు. పిల్లల్లో పోషకాహార లోపం వేగంగా పెరుగుతోంది. నలుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అది అత్యంత ప్రాణాంతకం.
జూన్ 2026 చివరి నాటికి పోషకాహార లోపం వల్ల మరణించే ప్రమాదం ఉన్న పిల్లల సంఖ్య 14,100 నుంచి 43,400 కు అంటే మూడు రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 98 శాతం పంట భూములు దెబ్బతిన్నాయి. వ్యవసాయం లేదు. ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. జూలై నుంచి గాజాలోకి వచ్చే ఆహారం, సహాయ సామగ్రి పెరిగింది. కానీ.. అవసరంతో పోలిస్తే అది చాలా తక్కువ. సహాయ ట్రక్కుల నుంచి ఆహారం దోచుకుంటున్నారు. వంట చేసుకోవడానికి నీళ్లు కూడా లేవంటే పరిస్థితిని ఊహించొచ్చు.
మనుషులు సృష్టించిన కరువు
అయితే ఈ కరువు మనుషులు సృష్టించిందని, అవకాశం ఉన్నా నివారించలేకపోవడం వెంటాడే విషయమని ఐక్యరాజ్యసమితి సహాయ అధిపతి టామ్ ఫ్లెచర్ అన్నారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇజ్రాయెల్ విధిస్తున్న అడ్డంకుల కారణంగా పాలస్తీనా భూభాగానికి ఆహారం చేరుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని అనుమతిస్తే మనం నివారించగలిగే కరువు ఇది. ఇజ్రాయెల్ అడ్డంకుల కారణంగానే సరిహద్దుల వద్ద ఆహారం నిల్వలు నిలిచిపోయాయి’ అని తెలిపారు.