
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనర్హత నోటీసులందుకున్న దివ్యాంగులకు వచ్చేనెలలో పింఛన్లు అందవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రీ అసెస్‌మెంట్‌లో వైద్య పరీక్షలు పూర్తయి మళ్లీ సర్టిఫికెట్లు వచ్చాకే వారికి తిరిగి పింఛన్లు వస్తాయని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులకు అనర్హుల పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ సంఖ్యలో నోటీసులు జారీచేస్తుండడంపై వివాదం రగులుతున్న నేపథ్యంలో.. శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 2.07 లక్షల మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని.. అంతకుముందు 15 ఏళ్లలో ఆరు లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఉన్నాయని చెప్పారు.
అయితే, గత ఏడాది తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై అధ్యయనం చేస్తే చాలామంది అనర్హులకు వికలాంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేలిందని.. దీంతో మొత్తం అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాలని ఆదేశించామన్నారు. ఇక ప్రస్తుతమున్న మొత్తం 7.95 లక్షల మంది దివ్యాంగుల పింఛనుదారులకుగాను 5.50 లక్షల మందికి సంబంధించిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, అందులో 80 వేల మంది అనర్హులుగా తేలగా, వారికి నోటీసులు జారీచేసినట్లు మంత్రి తెలిపారు.
ఇదిలా ఉంటే.. అనర్హులుగా తేలిన వారిని వారి అర్హతబట్టి ఇతర పింఛన్లకు మళ్లిస్తున్నామని.. ఇలా 20 వేల మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చినట్లు మంత్రి చెప్పారు. వితంతువులు ఉంటే వాళ్లను వితంత పింఛన్లకు మారుస్తున్నామన్నారు. ఇక 2024 జులైలో 65.18 లక్షలు మందికి పింఛన్లు ఇచ్చామని.. ఇప్పుడు 63.71 లక్షల మందికి ఇస్తున్నామని.. ఈ తగ్గిన పింఛన్లు మరణించిన వారివి మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ చెప్పారు.