
శత్రు దేశాల లక్ష్యాల జాబితాలో శాటిలైట్స్
కమ్యూనికేషన్ వ్యవస్థపై సైబర్ దాడులు
బుల్లెట్ కూడా పేల్చకుండానే భారీ నష్టం
2025 మే 9.. టీవీలకు అతుక్కుపోయిన ఉక్రెయిన్ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారు చూస్తున్న కార్యక్రమాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అంతరాయం కలిగితే షాక్‌కు గురికావడం ఏంటి? ఇది సహజమే కదా అన్నదే మీ ప్రశ్న కదూ. అక్కడికే వస్తున్నాం.. మాస్కో వేదికగా రష్యా తన యుద్ధ ట్యాంకులు, ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ సైనికులతో నిర్వహించిన విక్టరీ డే కవాతు తమ దేశంలో ప్రత్యక్ష ప్రసారం కావడం ఉక్రెయిన్లను ఆశ్చర్యానికి లోను చేసింది. ఉక్రెయిన్ కు టెలివిజన్ సేవలను అందించే కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని రష్యాకు మద్దతుగా ఉన్న హ్యాకర్లు హైజాక్ చేశారు. ఇదంతా ఉక్రెయిన్ వాసులను భయపెట్టడానికి రష్యా చేసిందన్నమాట! – సాక్షి, స్పెషల్ డెస్క్
పెద్ద పెద్ద దేశాలన్నింటికీ అంతరిక్షంలో ఎన్నో శాటిలైట్లు ఉన్నాయి. వాటిలో ఒక్క ప్రధానమైన ఉపగ్రహాన్ని నిలిపేసినా చాలు.. ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే భారీ నష్టమే కలిగించవచ్చు! ఊహించుకుంటేనే భయంగానూ, విచిత్రంగానూ అనిపిస్తోంది కదూ. భవిష్యత్తులో అంతరిక్షం కూడా ‘ప్రధాన యుద్ధభూమి’ కానుంది.
మామూలు దెబ్బ కాదు..
కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల్లో 12,000 పైచిలుకు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రసార సమాచార మార్పిడిలో మాత్రమే కాకుండా సైనిక కార్యకలాపాలు, జీపీఎస్, నిఘా సేకరణ వంటి నావిగేషన్ వ్యవస్థ సహా అనేక అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇవి.. దేశం మీదకు వస్తున్న శత్రు క్షిపణులు సమీపిస్తున్నాయని హెచ్చరించగలవు. శత్రు దేశాల జాతీయ భద్రతను విఫలమయ్యేలా చేసేందుకు; శత్రువు ఆర్థిక వ్యవస్థను, సైనిక సంసిద్ధతను దెబ్బతీసేందుకు కూడా ఉపయోగపడగలవు. రష్యాకు మద్దతు ఇస్తున్న హ్యాకర్లు టెలివిజన్ సిగ్నల్స్‌ను హైజాక్ చేసి ఉక్రెయిన్ కు చేసినట్టుగా మానసికంగానూ దెబ్బకొట్టగలవు.
బలహీనమైన లింక్ కోసం..
హ్యాకర్లు సాధారణంగా ఉపగ్రహానికి సపోర్ట్ చేసే లేదా భూమిపై సమాచారాన్ని నియంత్రించే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లలో బలహీనమైన లింక్ కోసం చూస్తుంటారు. కక్ష్యలో తిరిగే ఉపగ్రహం సాఫ్ట్‌వేర్‌లో ఏ చిన్న లోపం పసిగట్టినా.. ఇంతే సంగతులు! దాన్ని సులభంగా దెబ్బతీయవచ్చని నిపుణులు అంటున్నారు.
2022లో రష్యన్ దళాలు ఉక్రెయిన్ ను ఆక్రమించినప్పుడు.. ఉక్రెయిన్ ప్రభుత్వం, సైన్యం ఉపయోగించే అమెరికాకు చెందిన ఉపగ్రహ సంస్థ వయాశాట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. వేలాది మోడెమ్‌లను ప్రభావితం చేయడానికి మాల్వేర్‌ను ఉపయోగించడంతో యూరప్‌లోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
సూపర్ పవర్స్‌గా..
చంద్రుడిపైకి ఒక చిన్న అణు రియాక్టర్‌ను పంపే ప్రణాళికల్లో నాసా ఉంది. చైనా లేదా రష్యా కంటే ముందుగా ఈ పని పూర్తి చేయాలన్నదే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. చంద్రుడిపై ముందుగా స్థావరం ఏర్పాటు చేసుకుని, కొన్ని కీలక ప్రాంతాలను తమవే అని ప్రకటించుకోవాలని భావిస్తోంది. చంద్రుడిపై హీలియం–3 సమృద్ధిగా ఉంది.
హీలియం కేంద్రక సంలీనం (రెండు హీలియం కేంద్రకాలు కలిసి ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడే రసాయన ప్రక్రియ) ద్వారా భారీ మొత్తంలో శక్తి ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. కానీ, చంద్రుడిపై నియంత్రణ.. ఏ దేశాలు సూపర్ పవర్స్‌గా ఉద్భవిస్తాయో నిర్ణయించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అంతరిక్షంలో అణ్వాయుధం!
యూఎస్ జాతీయ భద్రతా అధికారుల ప్రకారం.. భూమి దిగువ కక్ష్యలో ఉన్న దాదాపు ప్రతి ఉపగ్రహాన్ని ఒకేసారి నాశనం చేయడానికి అణు, అంతరిక్ష ఆధారిత ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తోంది. ఈ ఆయుధం భూమి దిగువన ఉన్న కక్ష్యను ఉపగ్రహాలకు ఒక సంవత్సరం పాటు ఉపయోగించలేని విధంగా చేయగలదని సమాచారం. దీనిని ఉపయోగిస్తే అమెరికా, దాని మిత్రదేశాలు ఆర్థిక సంక్షోభానికి, అణు దాడికి కూడా గురయ్యే అవకాశం కూడా ఉంది. రష్యా, చైనా సైతం ఉపగ్రహాలను కోల్పోతాయి.
అయితే యూఎస్ మాదిరిగా కాకుండా విభిన్న శాటిలైట్లను రష్యా, చైనాలు ఉపయోగిస్తున్నాయి. ఉపగ్రహ వ్యతిరేక అణు ఆయుధాన్ని అంతరిక్షంలో ఉంచితే.. అది ఎలాంటి ముప్పు తెస్తుందో ఊహకు కూడా అందదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను, ఇంధన వనరులను ఉపయోగించుకోవాలని చూస్తున్నందున.. చంద్రుడిపై, గ్రహశకలాలలో లభించే విలువైన ఖనిజాలు, ఇతర పదార్థాలు భవిష్యత్తులో సంఘర్షణలకు దారితీయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
శాటిలైట్..: ఉపగ్రహ భద్రతా సాఫ్ట్‌వేర్‌ను లక్ష్యంగా చేసుకుని.. భూమి నుండి సంకేతాలను పంపే, లేదా స్వీకరించే దాని సామర్థ్యాన్ని దెబ్బతీస్తే.. ఉపగ్రహం కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని అడ్డుకోగలిగితే.. గణనీయమైన స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. ఉపగ్రహ ఆధారిత సేవలన్నీ నిలిచిపోతాయి. శత్రుదేశం ఏం చేయాలనుకుంటే చేయొచ్చు.
జీపీఎస్..: ఇక జీపీఎస్.. ఇప్పుడు మన నిత్య జీవితంలో ఇదో భాగమైపోయింది. జీపీఎస్ సేవల్లో ఒక్కసారిగా అంతరాయం కలిగితే.. అంతా గందరగోళం అవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
ఏం చేయొచ్చు?
దాడులు, నిఘా, పనిచేయకుండా నిర్వీర్యం చేయడం.
ఎలా చేయొచ్చు?
» భూమి నుంచి.. అంతరిక్ష ఉపగ్రహాల వంటివాటిపై.
» అంతరిక్షంలో ఉన్న వాటిపై అంతరిక్షంలో నుంచి.
» అంతరిక్షం నుంచి భూమిపై ఉన్నవాటిపై.