
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్న అక్షయ్ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని గుర్తు చేశారు. తన 13 ఏళ్ల కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక కలతపెట్టే సంఘటనను పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
సైబర్ నేరగాళ్లు తన కుమార్తెతో ఎలా ప్రవర్తించారో ఇలా పంచుకున్నారు. "కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటనను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కుమార్తె ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే మీరు మేల్, ఫీమేల్‌నా అంటూ జెండర్ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్ చేశాడు. ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, వెళ్లి నా భార్యతో చెప్పింది.
ఇలాంటివి సైబర్ నేరంలో ఒక భాగం.. తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాష్ట్రలో ఏడవ తరగతి నుంచే పిల్లలకు ఈ నేరాల గురించి తెలియాలి. అందుకోసం ప్రతి స్కూల్లో సైబర్ పీరియడ్ అని ఒక గంట సమయం కేటాయించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి నేరాళ గురించి పిల్లలకు వివరించాలి. నేటి ప్రపంచంలో సైబర్ నేరం వీధి నేరాల కంటే ప్రమాదంగా మారుతోందని మీ అందరికీ తెలుసు. ఈ నేరాన్ని ఆపడం చాలా ముఖ్యం..." అని అక్షయ్ వెల్లడించారు. ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు కూడా ఆవతల మరో వ్యక్తితో ఆడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తన కుమార్తె ఘటనను అక్షయ్ గుర్తుచేశారు.

ముంబైలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (మహారాష్ట్ర), రష్మి శుక్లా, ఇక్బాల్ సింగ్ చాహల్ (ఐపీఎస్), రాణి ముఖర్జీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.