ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం ఫేం హరీష్ ధనుంజయ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మరువ తరమా. అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించగా గిడుతూరి రమణ మూర్తి, NV విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. నేడు(నవంబర్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఒకే ఆఫీస్‌లో పని చేసే రిషి ( హరీష్ ధనుంజయ్), సింధు( అవంతిక ), అన్వీ (అతుల్య) చుట్టూ తిరిగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇది. సింధుతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు రిషి. రిషి అంటే అన్వీకి చాలా ఇష్టం. కానీ సింధు అంటే అతనికి ఇష్టమని తెలుసుకొని తన ప్రేమ విషయాన్ని తనలోనే దాచేస్తుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న రిషి, సింధు ఓ కారణంగా విడిపోతారు. అదేంటి? విడిపోయిన సింధు మళ్లీ రిషి జీవితంలోకి ఎలా వచ్చింది? అన్వీ తన ప్రేమ విషయాన్ని రిషితో చెప్పిందా లేదా? చివరకు ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ట్రయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగు తెరకు కొత్త కాదు. గతంలో ఇలాంటి చిత్రాలు చాలా వచ్చినా..ఇప్పటికే ఈ స్టోరీలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకుడిని కాస్త ఎంగేజ్ చేసేలా లవ్‌స్టోరీని రన్ చేస్తే చాలు..ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. దర్శకుడు చైతన్య వర్మ అదే ఫాలో అయ్యాడు. కథలో కొత్తదనం లేకపోయినా..కామెడీ, ఎమోషనల్ సీన్లతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండదు. కానీ పంచ్ డైలాగ్స్, కామెడీ సీన్లతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు.
ఇక సెకండాఫ్ ను పూర్తిగా కధ, కధనాలపైనే దృష్టి పెట్టాడు. ఆడియన్స్ ను ఎమోషనల్ గా కథకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో కొంతవరకు సఫలం అయ్యాడు. తెరపై ప్రధాన పాత్రలను చూస్తుంటే.. మన చుట్టుపక్కల వారిని చూస్తున్నట్లు అనిపిస్తుంది. వారి మధ్య సాగే సన్నివేశాలు..మన జీవితంలోనూ లేదా మన స్నేహితుల జీవితంలోనూ చూసినట్లే అనిపిస్తుంది. ‘అమ్మాయిల విషయంలో ఆప్షన్లు ఉంటాయి ఏమో కానీ అమ్మ విషయంలో ఆప్షన్స్ ఉండవు’, ‘అనుకున్నట్లు జరిగితే అది ప్రేమ ఎందుకు అవుతుంది’ లాంటి ఆకట్టుకునే డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమాలో సాగదీత సీన్లతో పాటు కొన్ని మైనసులు ఉన్నపటికీ.. డైలాగ్స్, నేపథ్య సంగీతం వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. మనకి తెలిసిన కథను అంతే అర్థమవంతంగా యదార్ద సంఘటనల ఆధారంగా జరిగిన కథ ఈ మరువ తరమా
ఎవరెలా చేశారంటే..
రిషి పాత్రకు హరీష్ ధనుంజయ్ న్యాయం చేశాడు. తెరపై చూడడానికి చాలా బాగున్నాడు. నటనలోను ఈజ్ తో చేసాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అవంతిక చాలా బాగా నటించింది. అతుల్య పాత్ర పరిధి మేరకు నటించింది. రోహిణి కనిపించింది కాసేపైనా మంచి పాత్ర. భద్రమ్ రెండు మూడు సీన్లు మాత్రమే పరిమితం అయ్యాడు. దినేష్ పాత్ర చేసిన నటుడు హిలేరియస్ గా నవ్వించాడు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ బుల్గానిన్ & ఆరిష్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. బీజీఎంతో పాటు పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- రేటింగ్: 2.5/5


