కొంతకాలంగా సౌత్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ విలన్‌గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఆఫర్ చేయడం సబబు కాదంటున్నాడు. ద లాలంటాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. నాకు సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.
నచ్చట్లే..
కానీ ఇక్కడేం జరుగుతుందంటే మాకు నెగెటివ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెప్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్ దర్బార్‌లోనూ నెగెటివ్ రోల్ చేశాను. కాకపోతే రజనీ సర్‌తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నాను.
కంటెంటే కింగ్
ఈ మధ్యే 'జై' అనే తుళు సినిమా చేశాను. ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అందులో యాక్ట్ చేశా.. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్ ఒక్కటే కింగ్. కంటెంట్ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్ శెట్టి చివరగా కేసరి వీర్, నడానియన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్‌కమ్ టు ద జంగిల్, హెరా ఫెరి 3 మూవీస్ చేస్తున్నాడు. ఈయన తెలుగులో మోసగాళ్లు, గని సినిమాలు చేశాడు.


